Legislative
-
ఒకసారి రిజర్వేషన్లు పొందిన వారికి...ఆ సౌకర్యం నిలిపేయాలి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఆ ఫలాలు పొంది, ఆ కారణంగా ఇతరులతో సమానంగా పోటీ పడే స్థాయికి చేరినవారికి రిజర్వేషన్లను తొలగించవచ్చని అభిప్రాయపడింది. అయితే ఇది శాసన, కార్యనిర్వహక వ్యవస్థలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేసింది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీల ధర్మాసనం గురువారం ఈ మేరకు పేర్కొంది. ఎస్సీల్లో క్రీమీ లేయర్ ఏర్పాటు చేసే అధికారం రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు ఉందంటూ గత ఆగస్ట్‌లో ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పును జస్టిస్ గవాయ్ ఈ సందర్భంగా ఉటంకించారు. ఎస్సీల్లోని వెనకబడ్డ కులాలకు లబ్ధి చేకూర్చేందుకు వీలుగా వారికి ఉద్దేశించిన రిజర్వేషన్లలో ఉప వర్గీకరణ చేయొచ్చని ఆ తీర్పు స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ కూడా సభ్యుడే. మెజారిటీ నిర్ణయంతో సమ్మతిస్తూనే నాడు ఆయన విడిగా తీర్పు వెలువరించారు. ఎస్సీలతో పాటు ఎస్టీల్లో కూడా క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్లను నిలిపేయాలని అందులో స్పష్టం చేశారు. ఇందుకోసం రాష్ట్రాలు విధిగా ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని కూడా ఆదేశించారు. ఆ తీర్పును తాజా కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ప్రస్తావించారు. ‘ఒకసారి లబ్ధి పొందినవారికి రిజర్వేషన్లను తొలగించాలి. గత 75 ఏళ్ల పరిణామాలను బేరీజు వేసిన మీదట ఈ అభిప్రాయం వెలువరిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించి ఆరు నెలలు గడిచినా ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్ గుర్తింపునకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘ప్రభుత్వాలు ఆ పని చేయవు. చివరికి అత్యున్నత న్యాయస్థానమే జోక్యం చేసుకోవాల్సి వస్తుంది‘ అన్నారు. ఆ వాదనతో ధర్మాసనం ఏకీభవించలేదు. ‘ఆ పని చేసేందుకు శాసన, కార్యనిర్వాహక విభాగాలు ఉన్నాయి. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలయ్యేలా వాళ్లు చట్టం చేయాలి‘ అని పునరుద్ఘాటించింది. అయితే సంబంధిత వర్గాలనే ఆశ్రయిస్తామని పిటిషనర్ తెలపడంతో కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతించింది. -
ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది.ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు. గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
స్పీకర్ నిర్ణయాలపైన్యాయ సమీక్ష జరపొచ్చు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నిర్ణయాలపై న్యాయసమీక్ష జరిపే అధికారం ధర్మాసనాలకు ఉంటుందని సుప్రీంకోర్టు న్యాయవాది ఆర్యామ సుందరం హైకోర్టులో వాదనలు వినిపించారు. స్పీకర్‌ను ట్రిబ్యునల్ చైర్మన్‌గా పరిగణించాలని.. స్పీకర్‌కు కాకపోయినా, ట్రిబ్యునల్ చైర్మన్‌కు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా తేలి్చచెప్పిందని పేర్కొన్నారు.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ.వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్‌రావు, మాజీ ఏఏజీ రామచంద్రరావు హాజరయ్యారు.పిటిషనర్ల తరఫున న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయన్ను ప్రజలు ఓడించారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిరీ్ణత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7ను ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి. అని విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యానికి ముప్పన్న సుప్రీంకోర్టు ‘పదవ షెడ్యూల్‌ను ఉల్లంఘించిన వ్యక్తులను అనర్హులుగా ప్రకటించాలనే రాజ్యాంగ లక్ష్యానికి కట్టుబడి ఉండాలంటే, ఫిర్యాదు చేసిన తేదీ నుంచి మూడు నెలల వ్యవధిలో స్పీకర్ ముందు దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా లోక్‌సభ, శాసనసభల జీవితకాలం ఐదేళ్లు మాత్రమే. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచుకోకుండా సరైన సమయంలో తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తీర్పునిచి్చంది. మెజారిటీ ఉన్న పార్టీ తరఫు వ్యక్తి స్పీకర్ అవుతారని, అధికార పారీ్టకి వ్యతిరేకంగా ఆయన నిర్ణయం తీసుకోకుండా పదవీకాలం ముగిసేవరకు పెండింగ్‌లో ఉంచడం సరికాదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.కైశమ్ మేఘచంద్రసింగ్ వర్సెస్ స్పీకర్ ఆఫ్ మణిపూర్.. కేసులో స్పీకర్ రాజకీయ విధేయత కారణంగా పక్షపాత వైఖరిని సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పుగా పేర్కొంది. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని.. ఒక పార్టీ నుంచి ఎన్నికవుతున్న స్పీకర్ వద్ద ఉంచాలా.. వద్దా.. అనేది పార్లమెంట్ పునరాలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీంకోర్టు సూచించింది’అని ఆర్యామ సుందరం వివరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఇచి్చన ఆదేశాలను హైకోర్టుకు నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేశారు.ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి రిజర్వేషన్ ఫలాలుసుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ జరిగేందుకు మార్గం సుగమమైంది. మూడు దశాబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌తో పాటు పలు సంఘాలు తీవ్రస్థాయిలో చేసిన ఉద్యమానికి ఇప్పుడు ఫలితం దక్కింది. ఎస్సీ, ఎస్టీల్లోని ప్రతి కులానికి ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలుఅందుతాయి. ఇప్పటివరకు రిజర్వేషన్ల అమల్లో స్పష్టత లేకపోవడంతో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు వర్గీకరణ ద్వారాన్యాయం జరగనుంది. – వలిగి ప్రభాకర్ ఎరుకల, ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు -
మిజోరంలో 77 శాతానికి పైగా పోలింగ్
ఐజ్వాల్: అధికార మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్), విపక్ష జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య తీవ్రపోటీకి వేదికగా నిలిచిన మిజోరం శాసనసభ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 40 స్థానాలకూ ఒకే దఫాలో పోలింగ్ నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అందిన సమాచారం మేరకు 77.39 శాతం పోలింగ్ నమోదైందని అదనపు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్.లియాంజెలా చెప్పారు. సవరించిన తుది ఫలితాలు బుధవారం వచ్చేసరికి పోలింగ్ శాతం 80 శాతాన్ని తాకొచ్చు. 18 మంది మహిళలు సహా మొత్తంగా 174 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 8.57 లక్షల ఓటర్లు ఉన్నారు. సెర్చిప్ జిల్లాలో అత్యధికంగా 84.49 శాతం, ఐజ్వాల్ జిల్లాలో అత్యల్పంగా 73.09 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు 7,200 భద్రతా సిబ్బందిని నియోగించారు. పోలింగ్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,276 పోలింగ్‌కేంద్రాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి ఓటేయబోతే మొరాయించింది ఐజ్వాల్‌లోని ఒక ఈవీఎం ఏకంగా ముఖ్యమంత్రినే రెండోసారి పోలింగ్‌కేంద్రానికి రప్పించింది. మొదటిసారి మొరాయించడమే ఇందుకు కారణం. ర్యామ్హ్యూన్ వెంగ్లాయ్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు ఉదయాన్ని ముఖ్యమంత్రి జోరామ్‌థంగా విచ్చేశారు. అప్పుడే ఈవీఎం మొరాయించింది. చేసేదేం లేక ఇంటికి వెనుతిరిగారు. మళ్లీ 9.40 గంటలకు వచ్చి ఓటేశారు. ‘ ఈసారి కనీసం 25 చోట్ల గెలుస్తాం’ అని సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు లాల్సావ్తా ఐజ్వాల్ వెస్ట్–3 నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 96 ఏళ్ల అంధుడు పూ జదావ్లా పోస్టల్ బ్యాలెట్‌ను కాదని స్వయంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. పోలింగ్ నేపథ్యంలో మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దులను మూసేశారు. రాకపోకలను ఆపేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఏకంగా 81.61 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. డిసెంబర్ మూడో తేదీన ఓట్లలెక్కింపు ఉంటుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 26 చోట్ల గెలిచి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఉపఎన్నికల్లో మరో రెండు చోట్ల గెలిచింది. విపక్ష జెడ్పీఎం ఎనిమిది చోట్ల గెలిచింది. బీజేపీ కేవలం ఒక్క స్థానంలో, కాంగ్రెస్ ఐదు చోట్ల విజయబావుటా ఎగరేశాయి. ‘ఈసారి పట్టణప్రాంతాల్లో జెడ్పీఎం, గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎన్ఎఫ్ ఎక్కువ సీట్లు గెలవొచ్చు’ అన్న విశ్లేషణలు వినిపించాయి. -
లింగ, మతప్రమేయం లేని... ఉమ్మడి చట్టాలు చేయొచ్చా?
న్యూఢిల్లీ: శాసన వ్యవస్థ పరిధిలోని అంశాలపై న్యాయ వ్యవస్థ జోక్యంపై సుప్రీంకోర్టు సోమవారం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు, విడాకులు, మనోవర్తి, వారసత్వం వంటి అంశాల్లో లింగ, మతప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానంగా వర్తించేలా ఉమ్మడి చట్టాలు చేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పి.ఎస్.నరసింహ, జె.బి.పార్డీవాలా ధర్మాసనం విచారణ జరిపింది. ‘‘వీటిపై శాసన వ్యవస్థకు కోర్టులు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చా? ఈ మేరకు కేంద్రానికి నిర్దేశాలు జారీ చేయొచ్చా?’’ అంటూ సందేహాలు లేవనెత్తింది. శాసన వ్యవస్థ పరిధిలోని ఈ అంశాలపై న్యాయ జోక్యం ఏ మేరకు ఉండొచ్చన్నదే ఇక్కడ కీలక ప్రశ్న అని అభిప్రాయపడింది. ఇలాంటి అంశాల్లో ఉమ్మడి చట్టాలకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. విచారణను ధర్మాసనం నాలు గు వారాల పాటు వాయిదా వేసింది. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించాలో, వద్దో అప్పుడు తేలుస్తామని పేర్కొంది. ‘అందరికీ ఒకే వివాహ వయసు’ పిటిషన్ కొట్టివేత స్త్రీ, పురుషులందరికీ చట్టబద్ధంగా ఒకే కనీస వివాహ వయసుండేలా చట్టం తేవాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం కొట్టేసింది. ‘ఇది పార్లమెంటు పరిధిలోని అంశం. దానిపై మేం చట్టం చేయలేం. రాజ్యాంగానికి మేం మాత్రమే ఏకైక పరిరక్షకులం కాదు. పార్లమెంటు కూడా ఆ భారం వహిస్తోంది’ అని అభిప్రాయపడింది. కనీస వివాహ వయసు పురుషులకు 21 ఏళ్లు, మహిళలకు 18 ఏళ్లు. -
శాసన రాజధానిలో మౌలిక వసతుల ఏర్పాటుపై కమిటీ
సాక్షి, అమరావతి: శాసన రాజధానిలో ఎటువంటి మౌలిక వసతులు, భవనాలు, గృహ సముదాయాలు ఉండాలనే దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వడానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో శాసన సభ కార్యదర్శి, సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులిచ్చారు. (చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!) ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం -
కొత్త ఎమ్మెల్యేలతో కళకళలాడుతున్న పార్టీ కార్యాలయం
-
జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం..
-
16న అసెంబ్లీ సమావేశం
సాక్షి, అమరావతి: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును ఆమోదించేందుకు ఈనెల 16వ తేదీన అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ మేరకు అసెంబ్లీ ఇంచార్జి కార్యదర్శి కె.సత్యనారాయణ బుధవారం ప్రకటన జారీచేశారు. జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా వ్యాట్ స్థానంలో జీఎస్టీ అమల్లోకి రానుంది. రాష్ట్రంలో జీఎస్టీ అమల్లోకి రావాలంటే శాసనసభ బిల్లును ఆమోదించాల్సి ఉంది. -
చట్ట సభలు విఫలమయ్యాయనేది వాస్తవం
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించటంలో చట్టసభలు విఫలమయ్యాయనేది కాదనలేని వాస్తవమని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభిప్రాయపడ్డారు. పార్లమెంటు, శాసనసభ, మండళ్లలో క్రమశిక్షణ, హుందాతనం కరువైందన్నారు. శుక్రవారం గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో శాసనసభాపతులు, కార్యదర్శుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. పోరాటాలు, నినాదాలు సభాపతులమీద ఒత్తిడి పెంచుతున్నాయన్నారు. ఈ సందర్భంగా చట్టసభలు సమర్థవంత ంగా పనిచేసేందుకు కోడెల కొన్ని సూచనలు చేశారు. వెల్‌లోకి వచ్చే సభ్యులు ఆటోమేటిక్‌గా సస్పెండ్ అయ్యేలా నిబంధనలు ఉండాలన్నారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎజెండా ప్రకారం నిర్వహించాలని, చట్టసభలు ఏటా తగినన్ని రోజులు సమావేశం కావాలని సూచించారు. అనుచితంగా వ్యవహరించిన వారికి జరిమానా విధించేలా ప్రతి సభ నైతిక విలువల కమిటీని నియమించుకొని సభల గౌరవం, హుందాతనం కాపాడాలన్నారు. -
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయేకు ఆధిక్యం
పాట్నా: బీహార్ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు మెజార్టీ సీట్లు దక్కాయి. మొత్తం 24 స్థానాలకు జరిగిన ఎన్నికలో ఎన్డీయే 13 సీట్లను కైవసం చేసుకుంది. మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా వివిధ పార్టీలు కలిసి కూటమిగా అవతరించిన జనతాపరివార్‌కు కేవలం పది స్థానాలే దక్కాయి. ఒక సీటు మాత్రం స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నాడు. ఈ ఫలితాలతో బీహార్‌లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపట్ల ఒక అవగాహనకు రాకపోయినా.. వీటి ప్రభావం కొంత మేర అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని మాత్రం చెప్పవచ్చు. ఈ విజయం కొంతమేర బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
గొంతు నొక్కారు
విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి అసెంబ్లీలో మైక్ కట్ హైదరాబాద్: అధికార పార్టీ శాసనసభలో ప్రతిపక్షంపై దూషణల పర్వం కొనసాగించింది. విపక్షం లేవనెత్తిన అసలు అంశాలను పక్కదారి పట్టిస్తూ శ్రుతిమించిన విమర్శలు, తీవ్రస్థాయిలో నిందారోపణలతో టీడీపీ ఎదురుదాడి సాగింది. అధికార పక్షం నుంచి వస్తున్న నిందారోపణలపై వివరణ కోరడానికీ ప్రతిపక్షానికి అవకాశం ల భించలేదు. ఆ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వాకౌట్ చేస్తామని చెప్పడానికీ అవకాశమివ్వని ఘటన శాసనసభ వేదికగా చోటుచేసుకుంది. శాంతిభద్రతల అం శంపై 344 నిబంధన కింద స్వల్పకాలిక చర్చకు సంబంధించి శనివారం కూడా శాసనసభలో గం దరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల ఫలి తాల అనంతరం తమ పార్టీకి చెందిన 14 మంది కార్యకర్తల హత్య జరిగి, ఆ కుటుంబాలకు న్యా యం చేయాలి కాబట్టి వాటిపై చర్చ జరగాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ చేసిన ప్రయత్నాలకు అధికార పార్టీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు. ఎన్నికల ఫలితాల అనంతర హత్యా రాజకీయాల మీద చర్చ జరగకుండా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిల మీద వ్యక్తిగత దూషణలు, అస త్య ఆరోపణలు చేస్తూ చర్చను పక్కదారి పట్టిం చారు. అధికార పక్ష సభ్యులు తమ ప్రసంగాల్లో అన్‌పార్లమెంటరీ(అభ్యంతరకర) పదాలు, తీవ్రమైన దూషణలతో నింపేశారు. ఇదేమిటని గట్టి గా నిలదీస్తూ మాట్లాడుతున్న విపక్ష నేత జగన్ మోహన్‌రెడ్డి మాటలు వినిపించకుండా స్పీకర్ మైక్ కట్ చేశారు. ఆ దశలో తమ నిరసనను తెలి యజేసి సభ నుంచి వాకౌట్ చేస్తామని చెప్తున్నా జగన్ మాట్లాడటానికి స్పీకర్ అనుమతించలేదు. నిరసన తెలియజేయడానికి కూడా మైక్ ఇవ్వకపోవడంతో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండానే వైఎస్సార్ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. శనివారం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన త ర్వాత శాంతిభద్రతల మీద లఘు చర్చను కొనసాగించడానికి స్పీకర్ అనుమతించారు. శుక్రవా రం అర్ధాంతరంగా ప్రసంగం ఆపివేసిన టీడీపీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరికి అవకాశం ఇచ్చారు. శుక్రవారం తాను పరుషపదజాలం వాడలేదని, అయినా ప్రతిపక్ష నేత తమను బఫూన్లంటూ ఎందుకు వ్యాఖ్యానించారో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయలో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి.. విపక్ష నేత క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశా రు. వైఎస్సార్ సీపీ సభ్యులు తమ స్థానాల్లో నిల బడి.. తమ నాయకుడిని నరరూప రాక్షసుడని అన్నారని, అందుకు ముందుగా క్షమాపణలు చెప్పాలని గట్టిగా అడిగారు. ఒక దశలో స్పీకర్ తో సంబంధం లేకుండా అధికార, విపక్ష సభ్యు లు వాగ్వాదానికి దిగారు. టీడీపీ సభ్యులు.. ‘వుయ్ వాంట్ జస్టిస్’ అంటూ సభను నినాదాలతో హోరెత్తించారు. సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో 10.20గంటలకు సభను వాయి దా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. 11.15 గంటలకు సభ తిరిగి ప్రారంభమైనప్పుడు.. విపక్ష నేత క్షమాపణ చెప్పాలనే డిమాండ్ నుంచి టీడీపీ సభ్యులు కాస్త వెనక్కితగ్గారు. శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ ఆవేశంలో నోరు జారడం, అనుకోకుండా పరుషమైన మాట దొర్లడం సహజమని చెప్పారు. కొన్నిసార్లు ఉద్దేశపూర్వకంగా అంటారన్నారు. ప్రతిపక్ష నేత భేషజాలకు పోవాల్సిన అవసరం లేదని, గతంలో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి ఉద్దండుడు కూడా పరుష పదాలు వాడినప్పుడు ఉపసంహరించుకున్నారని వ్యా ఖ్యానించారు. ‘‘సభా గౌరవానికి, హుందాతనానికి భంగం కలిగించే విధంగా ఇరుపక్షాలు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తాం. ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే ఆ పనిచేయవచ్చు. అది సభా గౌరవాన్ని పెంచుతుంది. ఇక మీదట సంయమనం పాటించండి’’ అని స్పీకర్ సూచించారు. తర్వాత చర్చ కొనసాగించడానికి గోరంట్లకు అవకాశం ఇచ్చారు. ఆయన మళ్లీ తీవ్రస్థాయిలో నిందారోపణలు చేశారు. బాంబే మాఫియా ముఠాలతో మొదలుపెట్టి... గతంలో జరిగిన హత్యలు, వివిధ కేసులను ప్రస్తావించా రు. వై.ఎస్.రాజారెడ్డి హత్య కేసులో నిందితులను చంపడానికి అంటూ.. అన్‌పార్లమెంటరీ పదాలు ఉపయోగిస్తూ ఆవేశంతో గోరంట్ల ప్రసంగిస్తున్న తీరు పట్ల జగన్ అభ్యంతరం తెలి పారు. ‘‘విచ్చలవిడిగా అసత్యాలు, ఆరోపణలు చేస్తున్నా, ఇష్టానుసారం మాట్లాడుతున్నా ఊరికే ఉంటారా?’’ అని స్పీకర్‌ను ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు అసెంబ్లీలో ఖూనీ చేస్తున్నారు.. టీడీపీ సభ్యులు ఏ స్థాయిలో దూషణలు చేసినా మీకు అభ్యంతరం లేదా?’’ అని ఆవేదన వ్యక్తంచేశారు. దీనికి స్పీకర్ స్పందిస్తూ.. ‘‘ప్రతిపక్ష నేతకు అవకాశం ఇస్తే స్పీకర్ స్థానానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. అది సరైనది కాదు. వారికి (టీడీపీ) అవకాశం ఇచ్చినప్పు డు వారు మాట్లాడుతున్నారు. మీకూ అవకాశం ఇస్తా మాట్లాడండి. ఎవరైనా అన్‌పార్లమెంటరీ భాష వాడితే రికార్డుల నుంచి తొలగిస్తాం’’ అం టూ ప్రతిపక్ష నేత మైక్‌ను కట్ చేశారు. మంత్రి యనమల జోక్యం చేసుకొని.. స్పీకర్ మీద ఆరోపణలు చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం (మైక్) ఇవ్వాలని వైఎస్సార్ సీపీ సభ్యులు స్పీకర్‌కు పదేపదే విజ్ఞప్తి చేసినా స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. ‘‘మీ నాయకుడికి మైక్ ఇస్తే స్పీకర్ స్థానం మీదే ఆరోపణలు చేశారు. నేను పూర్తిగా నిష్పాక్షికంగా ఉన్నాను’’ అని కోడెల పేర్కొన్నారు. సభ్యులు ఏది మాట్లాడినా అనుమతిస్తే.. ఇక నిబంధనలు ఎందుకని విపక్ష సభ్యులు నిలదీశారు. విపక్ష నేతకు మైక్ ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్సార్ సీపీ సభ్యులు గట్టిగా వినిపించడంతో.. ‘‘మీరు స్పీకర్‌ను శాసించలేరు’’ అని సభాపతి పేర్కొన్నారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విపక్షం గొంతు నొక్కుతున్న తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వైఎస్సార్ సీపీ సభ్యులు నిష్ర్కమించారు. -
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ విప్‌గా వి.సంపత్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం. -
శ్రీధర్‌బాబు శాఖ మారింది