సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి | Telangana CLP elects | Sakshi
Sakshi News home page

సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి

Published Wed, Aug 6 2014 1:27 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి - Sakshi

సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి

ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు
కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం
జానా తీరుపై డీఎస్ అసంతృప్తి
 

హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ విప్‌గా వి.సంపత్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు.

పీఏసీ రేసులో ఆ నలుగురు

శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement