స్పీకర్ ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బీఏసీ భేటీ..
సమావేశాల తేదీలపై రాని స్పష్టత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్‌మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్‌లో బీఏసీ భేటీ జరిగింది.
ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది.
బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు
కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.
హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్‌ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు.
గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు
ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్‌ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్‌ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment