Prasad Kumar
-
ఈ నెల 20 వరకే అసెంబ్లీ సమావేశాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈ నెల 20వ తేదీ వరకే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో శుక్రవారంతో సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. కానీ ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ పట్టుబట్టినట్టు సమాచారం. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో స్పష్టత రాలేదు. సోమవారం మధ్యాహ్నం స్పీకర్ ప్రసాద్‌కుమార్ చాంబర్లో బీఏసీ భేటీ జరిగింది.ఇందులో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్.. బీఆర్ఎస్ నుంచి హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి పాయల్ శంకర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ నిర్వహణ తేదీలు, ఎజెండాపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.కనీసం 15 రోజుల పాటు సభ నిర్వహించాలని కోరింది. దీనికి ప్రభుత్వం అంగీకరించకపోవడంతో భేటీ నుంచి వాకౌట్ చేసింది. మరోవైపు సభ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కూడా బీఏసీ భేటీ బయటికి వచ్చారు. బీఏసీ భేటీకి సంబంధించిన వివరాలను మంగళవారం ఉదయం అధికారికంగా వెల్లడించే అవకాశముంది. బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు: హరీశ్‌రావు కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ నడపాలని కోరా మని బీఏసీ భేటీ అనంతరం హరీశ్‌రావు చెప్పారు. ‘‘బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదు. బీఏసీలో ఏమీ తేల్చకపోవడంతో, సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పకపోవడంతో వాకౌట్ చేశాం. లగచర్ల అంశంపై చర్చకు మంగళవారం కూ డా పట్టుబడతాం. ఒకరోజు ప్రభుత్వం, మరోరోజు విపక్షం ప్రతిపాదించే ఎజెండాకు అవకాశం ఇవ్వ డం సాంప్రదాయం. బీఏసీకి కేవలం సూచనలు చేసే అధికారం మాత్రమే ఉందని సీఎం చేసిన వ్యా ఖ్యలపై అభ్యంతరం తెలిపాం.హౌజ్ కమిటీలు ఏ ర్పాటు చేయాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)పై బీఆర్ఎస్ అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని అడిగాం. బీఏసీలో చర్చించకుండానే సభలో బిల్లులు ప్రవేశపెట్టడం, పుట్టినరోజులు, పెళ్లిళ్లు ఉన్నందుకు సభ వాయిదా వేయడంపై అభ్యంతరం చెప్పాం. ప్రతీరోజూ జీరో అవర్‌లో బీఆర్ఎస్ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా మాట్లాడే సమయం ఇవ్వాలని కోరాం’’అని హరీశ్‌రావు వెల్లడించారు. గత పదేళ్లలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా?: మంత్రి శ్రీధర్‌బాబు ఉమ్మడి ఏపీతోపాటు తెలంగాణ ఏర్పాటైన పదేళ్ల నుంచీ కూడా బీఏసీ సమావేశంలో చర్చించి సభ నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటున్నారని... సభ ఎన్ని రోజులు నడపాలనేది స్పీకర్ నిర్ణయమని శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడారు. ‘‘బీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం ద్వారా బీఆర్ఎస్, ఎంఐఎం స్పీకర్‌ను అవమానించాయి. బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు చెప్పినట్టు గత పదేళ్లలో కూడా బీఏసీ సమావేశంలో చాయ్ తాగి, బిస్కెట్లు తినే వచ్చారా? బీఆర్ఎస్ తీరు సరికాదు..’’అని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. -
ప్రజాసంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం
హుజూర్నగర్, పాలకవీడు: ప్రజాసంక్షేమం.. అభి వృద్ధి ప్రభుత్వ లక్ష్యం అని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. గురువారం ఆయన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని ఫణిగిరి గుట్ట వద్ద రూ.74.80 కోట్లతో 2,160 సింగిల్ బెడ్రూం ఇళ్ల పునర్నిర్మాణ పైలాన్ ఆవిష్కరించారు. రూ.50 లక్ష లతో క్రిస్టియన్ సిమెట్రీ, రూ.కోటితో టౌన్హాల్లో అభివృద్ధి పనులు, రూ.33.83 కోట్లతో పాలకవీడు మండలం బెట్టెతండ గ్రామం వద్ద మూసీనదిపై నిర్మించనున్న ఎత్తిపోతల పనులకు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో స్పీకర్ మాట్లా డుతూ.. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. ఇప్పుడు మరోసారి అవకాశం రావడంతో ఈ నియోజకవర్గ రూపురేఖలు మారిపోతాయ న్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వంలో ధరణి పేరుతో వేలాది కోట్ల ఆస్తులు ఎలా దోచుకుని దాచుకున్నారో..ఆ లెక్కలను ప్రజల ముందు ఉంచుతామని చెప్పారు. గత ప్రభుత్వం కమీషన్ల కోసం పడ్డ ఆరాటం అభివృద్ధిపై పెట్టలేద ని ఆయన ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లలో అర్హుల ఎంపికకు రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన నిరుపేదలకు 17 లక్షల ఇళ్లు అందించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో లక్షా 12 వేల ఇళ్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందిస్తామని చెప్పారు. వంద రోజుల్లో ఇచ్చిన ప్రతీ హామీని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, డబుల్ బెడ్రూం ఇళ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అనేక రంగాల్లో అందినకాడికి దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభు త్వంలో ఎన్నో లిఫ్ట్‌లు, రహదారులు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని, ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలకు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు, ఎస్పీ రాహుల్ హెగ్డే, అదనపు కలెక్టర్ లత, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నీటిపారుదల అధికారులు పాల్గొన్నారు. -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 11న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది. 26 గంటల 33 నిమిషాలు ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
TS: అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ నామినేషన్.. బీఆర్ఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు(గురువారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ స్థానం కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా, ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలుమద్దతు ఇవ్వడం విశేషం. స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం.. ఆయన నామినేషన్ వేశారు. ఆయన పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. ఇక, ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మరోవైపు.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్ సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్ ఉస్సేన్ మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా.. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. -
‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్ మూవీ ఆరంభం
-
కత్రిన, కరీనా మధ్య కమల్‌హాసన్‌కి పనేంటి?
ఓ అమ్మాయి పేరు కత్రినా, మరో అమ్మాయి పేరు కరీనా.. వీరిద్దరి మధ్యకు కమల్‌హాసన్ అనే కుర్రాడు చేరాడు. అప్పుడు ఈ అమ్మాయిల జీవితాలు ఎలాంటి మలుపు తీసుకున్నాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘కత్రిన కరీనా మధ్యలో కమల్‌హాసన్’. విజయ్‌సాయి, సోనాలి దీక్షిత్, పావన ప్రధాన పాత్రధారులు. రత్న కోరెపల్లి దర్శకుడు. కర్నె వెంకటరెడ్డి, కర్నె రంగారెడ్డి, శ్రీను విజ్జగిరి, ప్రసాద్‌కుమార్ నిర్మాతలు. గురువారం హైదరాబాద్‌లో ఈ చిత్రం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.ఎస్.రావు కెమెరా స్విచాన్ చేయగా, శాసనసభ్యుడు కొప్పుల ఈశ్వర్ క్లాప్ ఇచ్చా రు. సినిమా విజయం సాధించాలని అతిథులు ఆకాంక్షించారు. కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోందని, ఈ నెల 29 నుంచి వైజాగ్‌లో ఏకధాటిగా జరిపే చిత్రీకరణతో సినిమా పూర్తవుతుందని దర్శకుడు చెప్పారు. ఇందులోని అయిదు పాటలకు సంగీత దర్శకుడు శ్రీకర్ శ్రావ్యమైన బాణీలిచ్చారని నిర్మాతలు చెప్పారు. -
కాంగ్రెస్ నేతల రహస్య భేటీ?
శంకర్పల్లి,న్యూస్‌లైన్: మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో రాజకీయ సమీకరణాల కోసం వివిధ పార్టీల నాయకులు సమాయత్తం అవుతున్నారు. శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్స్‌లో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈమేరకు రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, ఎమ్యెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకటస్వామి, చేవెళ్ల అసెంబ్లీ అభ్యర్థి కాలె యాదయ్య ఇతర ముఖ్యనేతలు హాజరయినట్లు తెలిసింది. సోమవారం వెలువడనున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు , మంగళవారం వెలువడనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై అంచనాలు, ఆ తరువాత అనుసరించవలసిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా మెజార్టీ ఎంపీపీ స్థానాలతోపాటు, జెడ్పీటీసీ చైర్మన్‌గిరి కైవసం చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా చర్చించారని తెలుస్తోంది. అయితే సమావేశానికి సంబంధించి వివరాలు వెల్లడించేందుకు నాయకులు నిరాకరించారు. -
సాధారణ ఎన్నికల వేళ.. ‘పుర’పోరు గోల
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాధారణ ఎన్నికల ముంగిట్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఆయా పార్టీల నేతలను ఆత్మరక్షణలో పడేసింది. శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలనే తపనతో ఏడాది కాలంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న ఆశావహులకు తాజా పరిణామాలు తలనొప్పిగా మారాయి. వారం, పదిరోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారపర్వాన్ని భుజానెత్తుకోవడం వారి జేబులకు కత్తెర వేయనుంది. రిజర్వేషన్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఊహించని విధంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒకే వార్డుకు పలువురు పోటీపడుతుండడం, వీరిని బుజ్జగించడం వారిని తలకుమించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం తేడా వచ్చిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపుపై ప్రభావం చూపుతుందనే బెంగ వారిని వెంటాడుతోంది. పట్టణ ఎన్నికలు కావడం.. సాధారణ ఎన్నికల ఫలితాలకు ఇవి సంకేతాలని విశ్లేషిస్తున్న తరుణంలో... ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఆరు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే అడ్డగోలుగా డబ్బులు వెదజల్లిన స్థానిక నేతలు.. ఈ ఎన్నికల్లోనే అదే ధోరణిని కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. మున్సిపాలిటీల్లేని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు/ఆశావహులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వీటి ప్రభావం ఉన్నవారు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు నగర పంచాయతీలున్నా యి. కొత్త మున్సిపాలిటీలుగా అవతరించిన పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో అధిపత్యాన్ని కొనసాగించడ ం ఆయా రాజకీయపార్టీలకు సవాలుగా పరిణమించింది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉండడం.. అధికార, ప్రతిపక్ష పార్టీలను కలవరపెడుతోంది. తాండూరు మున్సిపాలిటీ ఎన్నికలు స్థానిక శాసనసభ్యుడు మహేందర్‌రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. ఇటీవలే టీడీపీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయనకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. తన ప్రాభవాన్ని కాపాడుకునేందుకు.. రాజకీయ అస్థిత్వం నిలుపుకునేందుకు ఇవి ప్రామాణికంగా మారనున్నాయి. ప్రత్యర్థి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి మహేందర్ హవాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. వికారాబాద్ పట్టణ ఎన్నికలు తాజా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రసాద్ పలుకుబడిని దెబ్బతీయడం నైతికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో మంచి ఊపు మీద ఉన్న టీఆర్ఎస్కు సీట్లు దక్కకుండా చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మహేశ్వరం సెగ్మెంట్ పరిధిలోని బడంగ్పేట్ నగర పంచాయతీల్లో ఆధిక్యతను కనబరచడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి కూడా ఈ పురపోరు సవాల్‌గా మారింది. దీంట్లో సత్తా చూపితేనే కేడర్‌లో ఉత్సాహం వస్తుందని, ఇప్పటికీ టీ ప్రకటనతో కుంగిపోయిన పార్టీ శ్రేణులు.. ఓటమి పాలైతే నైరాశ్యంలో కూరుకుపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. -
ఎన్నికల ముంగిట్లో.. నిధుల నిగారింపు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బ్యాంకుల్లో మూలుగుతున్న నిధులకు రెక్కలొస్తున్నాయి. ఏళ్లుగా నిలిచిపోయిన పను లు మళ్లీ మొదలవబోతున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పట్టీపట్టనట్లు వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఎన్నికల ముంగిట్లో ప్రజల్లోకి వెళ్లేందుకు అభివృద్ధి పనుల పేరిట విన్యాసాలకు తెరలేపారు. పాత హామీలను నెరవేర్చే పనిలో బిజీ అయ్యారు. భాగంగా ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పలు పనులను జిల్లా పరిషత్ ఆమోదిస్తూ మంజూరు చేసింది. రూ.4.07కోట్ల పనులు గతనెల చివరి వారం నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ కోటాలో రూ.4.07కోట్ల మేర వివిధ కేటగిరిల్లో 99 పనులు మంజూరయ్యాయి. ఇవన్నీ జడ్పీ సాధారణ నిధులకు సంబంధించినవే. ప్రధానంగా తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు, డ్వాక్రా భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు తదితర పనులున్నాయి. అయితే నిధులను క్రమపద్ధతిలో వాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన నేతలు.. ముందుగా గతంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసే పనిలో పడ్డారు. తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి ఓటర్ల మెప్పుపొందే క్రమంలో ఈ ఉపాయాన్ని ఎంచుకున్నారు. తాజాగా మంజూరైన పనులన్నీ ఆ కోవకు చెందినవే. అగ్రనేతలదే హడావుడి జడ్పీ జనరల్ ఫండ్ నుంచి మంజూరుచేసిన పనుల్లో బడా నేతలు ప్రతిపాదించినవే ఎక్కువగా ఉన్నాయి. మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితారెడ్డి ప్రతిపాదించిన పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం, బంట్వారం, బషీరాబా ద్ మండలాలకు సంబంధించిన పనులు అధికంగా ఉన్నాయి. కేవలం శంషాబాద్ మండలానికి సంబంధించిన పనులే రూ.44లక్షల విలువ ఉండడం గమనార్హం. అదేవిధంగా మెయినాబాద్ మండలానికి కూడా పెద్దఎత్తున పనులు మంజూరయ్యాయి. 2013 -14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ సాధార ణ కోటా కింద దాదాపు రూ.25కోట్ల వరకు పనులు మంజూరు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. కేవలం రెండు నెలల్లోనే పావువంతు పను లు యుద్ధప్రాతిపదికన ఆమోదం తెలపడం ప్రజాప్రతినిధుల ఎన్నికల హడావుడిని స్పష్టం చేస్తోంది. -
ఓట్లకు ‘మార్గం’!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రభుత్వం ఎన్నికల వేళ ‘తాయిలాల’ను ప్రకటిస్తోంది. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు భారీగా నిధుల వరదను పారిస్తోంది. ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్ల అభివృద్ధికి నిధులు కుమ్మరిస్తోంది. తాజాగా కేంద్ర రోడ్డు నిధి(సీఆర్ఎఫ్) కింద రాష్ర్టవ్యాప్తంగా రూ.600 కోట్లను విడుదల చేసిన కేంద్ర సర్కారు.. దాంట్లో రూ.101 కోట్లను జిల్లాకు కేటాయించింది. దీంతో 116.72 కిలోమీటర్ల మేర రహదారులకు మహర్దశ పట్టనుంది. కేంద్ర రహదారి, రవాణా మంత్రిత్వశాఖ మార్గదర్శకాల మేరకు వీటిని 24 నెలల్లో నిర్మించాలని పేర్కొంటూ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శాంబాబ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఆరు ప్రధాన మార్గాలకు మోక్షం కలుగనుంది. సుమారు 52 కిలోమీటర్ల పొడవు గల ఈ రోడ్లను రూ.71 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయాలని ఆర్అండ్బీ శాఖ నిర్ణయించింది. మెదక్ జిల్లాను తాండూరుతో అనుసంధానంచేసే తాండూరు- కోట్‌పల్లి మార్గానికి రూ.10 కోట్లు మంజూరయ్యాయి. గతుకులమయమైన ఈ రహదారిని మరమ్మతు చేయాలని కొన్నేళ్లుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదు. చివరకు జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ చొరవతో ఈ రోడ్డుకు గ్రహణం వీడింది. -
24నెలలు..15 రోజులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో రెండేళ్లపాటు చక్రంతిప్పిన వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ తాజా మాజీ మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ సీఎం కిరణ్ బుధవారం సమర్పించిన రాజీనామాను శుక్రవారం గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్ర మంత్రివర్గం రద్దయింది. దీంతో ప్రసాద్ మంత్రి పదవిని కోల్పోయారు. 2012 ఫిబ్రవరి 6న కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో తొలిసారి బెర్త్ దక్కించుకున్న ఆయన రెండేళ్ల 15రోజులపాటు చేనేత మంత్రిగా పనిచేశారు. గతంలో మర్పల్లి ఎంపీపీగా పనిచేసిన ప్రసాద్.. టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ రాజీనామాతో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో వికారాబాద్ నుంచి బరిలోకి దిగారు. తొలిసారే విజయఢంకా మోగించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నిల్లోనూ గెలిచిన ప్రసాద్‌కు అనతికాలంలో ఆమాత్య పదవి లభించింది. అధికారపార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, సామాజిక సమీకరణలు అప్పట్లో ఆయనకు కలిసొచ్చాయి. వివాదస్పద వ్యాఖ్యలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన శంకర్రావు స్థానంలో ఈ ఛాన్స్ కొట్టేశారు. జిల్లా నుంచి అప్పటికే కేబినెట్లో సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, సామాజిక సమతుల్యతలో భాగంగా అవకాశం లభించింది. రెండోసారి గెలిచిన ఎమ్మెల్యేలెవరూ లేకపోవడం.. మెజార్టీ శాసనసభ్యులు కూడా ప్రసాద్ పేరును సూచించడం ప్లస్‌పాయింట్‌గా మారింది. కాగా, మంత్రి పదవి రాకమునుపే సబితకు వైరివర్గం నేతగా పేరొందిన ప్రసాద్.. ఆ తర్వాత కూడా అదే వైఖరిని కొనసాగించారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ కేసు నమోదు చేయడంతో సబిత మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ప్రసాద్ ఏకచక్రాధిపత్యానికి తెరలేచింది. గత పది నెలలుగా ఒకే ఒక్కడుగా జిల్లాలో పాలనా వ్యవహారాలను చక్కబెడుతూ వచ్చారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కోటరీలో కీలక సభ్యుడిగా ప్రసాద్ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో దూరం కూడా పెరిగింది. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేయడంతో నిరసనగా కిరణ్ తన పదవికి రాజీనామా చేయడంతో ప్రసాద్ కూడా మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగాల్సిన పరిస్థితి అనివార్యమైంది. -
మంత్రిగారికి కోపమొచ్చింది!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రొటోకాల్ పాటించని అధికారులపై మంత్రి ప్రసాద్‌కుమార్‌కు కోపం వచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు పాల్గొన్న కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. తన హక్కులను ఉల్లంఘించిన కలెక్టర్, ఎస్పీ సహా అటవీశాఖ అధికారులపై ఏపీ లెజిస్లేచర్ రూల్ 233(1) కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రికి ప్రసాద్‌కుమార్ లేఖ రాశారు. 19వ తేదీన వికారాబాద్‌లోని అనంతగిరి అటవీక్షేత్రంలో జింకలను వదిలే కార్యక్రమానికి డీజీపీ, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తనకు పిలుపు రాకపోవడాన్ని మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా పరిగణించారు. స్థానిక ఎమ్మెల్యే తానేననే విషయాన్ని గుర్తించకపోవడం, అత్యున్నత అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి త నను పిలువకుండా అవమానపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడంతోనే అధికారయంత్రాంగం తన పట్ల వివక్ష చూపిందని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించకుండా తనను అగౌరవపరిచిన హైదరాబాద్ సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ బీఎస్ఎస్ ప్రసాద్, డీఎఫ్ఓ నాగభూషణం సహా కలెక్టర్ బి.శ్రీధర్, ఎస్పీ రాజకుమారిపై చర్యలు తీసుకునేందుకు.. ఈ అంశాన్ని హక్కుల కమిటీకి నివేదించాలని సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
అర్హులందరికీ ప్రభుత్వ భూమి
ఆలంపల్లి, న్యూస్‌లైన్: అర్హులైన ప్రతి పేదకు ప్రభుత్వం భూమి పంపిణీ చేస్తుందని చేనేత, జౌళి శాఖా మంత్రి జి.ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ఏడో విడత భూ పంపిణీలో భాగంగా నాలుగు నియోజకవర్గాల లబ్ధిదారులకు సోమవారం వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్లో పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకునే లక్ష్యంతో ప్రభుత్వం విడతల వారీగా భూ పంపిణీ చేపడుతోందని చెప్పారు. గత ఆరు విడతల్లో 6,300 మంది లబ్ధిదారులకు 9,620 ఎకరాలను పంపిణీ చేశామని, ఏడో విడతలో 1,228 ఎకరాలను 1,009 మంది లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు చెప్పారు. పేదలకు పట్టాలివ్వడమే కాకుండా వారందరికీ బ్యాంకుల ద్వారా రుణాలు కూడా ఇచ్చేలా మంత్రుల సబ్‌కమిటీలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ అసైన్డ్ భూమిలేని గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా రూ.ఐదు లక్షలు వెచ్చించి భూములను కొనుగోలుచేసి అర్హులైన వారికి అందించనున్నట్టు చెప్పారు. ఆ భూముల్లో ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపట్టి అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆమ్రపాలిని మంత్రి ఆదేశించారు. వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి రూ.రెండు కోట్లు, ఎమ్మార్వో కార్యాలయ భవన నిర్మాణానికి రూ.60 లక్షలు, చేవెళ్ల, వికారాబాద్ ఆర్డీఓల నివాస గృహాలకు రూ.కోటి చొప్పున మంజూరయ్యాయని వెల్లడించారు. పొజిషన్ ఇచ్చి హద్దురాళ్లు పాతించాలి - ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి భూములు ఇవ్వడం కాదు.. వాటి ని సర్వే చేసి లబ్ధిదారులకు పొజిషన్‌ను ఇచ్చి హద్దురాళ్లు పాతేలా చూడాలని అధికారులకు పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సూచించారు. హద్దులు లేక గ్రామాల్లో తగాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఉపాధి హామీ ద్వారా భూముల్ని అభివృద్ధిపర్చి సాగుకు అనుకూలంగా మలచాలని మంత్రిని కోరారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను కొందరు అమ్ముకున్నారని.. కొన్నవారు అన్ని విధాలా అభివృద్ది చేసుకున్న తర్వాత భూములు తమవంటూ ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. లబ్ధిదారులు భూములు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని జేసీని ఆయన ఆదేశించారు. జిల్లాలో వరదలతో నష్టపోయిన రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. కబ్జాలో ఉన్నవారికి పట్టాలు ఇవ్వాలి - ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి బషీరాబాద్, పెద్దేముల్ మండలాల్లోని అటవీ భూముల్లో కబ్జాలో ఉన్న వారందరికీ భూ పట్టాలు ఇవ్వాలని తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సూచించారు. గ్రామాల్లో అర్హులైన పేదలకు భూములు కేటాయించాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఆయన కోరారు. అనంతరం లబ్ధిదారులకు పట్టా సర్టిఫికెట్లు, పాసు పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ధారూరు, మర్పల్లి, వికారాబాద్ మార్కెట్ కమిటీల చైర్మన్లు సంగమేశ్వర్, ప్రతాప్‌రెడ్డి, శశాంక్‌రెడ్డి, వికారాబాద్, మర్పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు కిషన్‌నాయక్, ప్రభాకర్ గుప్తా, జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, చేవెళ్ల ఆర్డీఓ చంద్రశేఖర్, ఎమ్మార్వో గౌతంకుమార్, కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మీరు కొట్లాడుకుంటుంటే నేనెందుకిక్కడ?
ధారూరు, న్యూస్‌లైన్: మంత్రి సాక్షిగా ధారూరు మండలం మైలారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఆహ్వానించారు. మంత్రి గ్రామానికి చేరుకున్న వెంటనే స్థానిక సర్పంచ్ శంకర్, వికారాబాద్ మార్కెట్ కమిటీ డెరైక్టర్ పెండ్యాల అనంతయ్యలు తమ అనుచరులతో రెండు వర్గాలుగా విడిపోయి స్వాగతం పలికారు. ఆ తర్వాత అనంతయ్య ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మంత్రిని తీసుకెళ్తుండగా సర్పంచ్ వర్గం అభ్యంతరం చెప్పింది. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా మంత్రి అనంతయ్య వెంటే వెళ్లారు. దీంతో సర్పంచ్ వర్గం ప్రధాన వేదిక వద్దకు చేరుకుని ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మంత్రి వెనుదిరిగి ప్రధాన వేదిక వద్దకు వచ్చారు. అయితే ముందే ఇక్కడికి రాకుండా పెండ్యాల వర్గంలో వెళ్లడంపై ఆగ్రహంతోఉన్న సర్పంచ్ వర్గం నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఈ ఆధిపత్య పోరుతో విసిగిన మంత్రి వేదికపైకి వెళ్లకుండా కిందే నిల్చుండి పోయారు. ‘మీరు కొట్లాడుకుంటుంటే నేనెందుకిక్కడ, వెళ్లిపోతా..’ నంటూ హెచ్చరించారు. కాసేపటి తర్వాత శంకర్, అనంతయ్యలు మంత్రిని బతిమలాడినా శాంతించలేదు. చివరకు ఇద్దరూ మంత్రి చేతులు పట్టుకుని.. క్షమించండి, మేమిద్దరం రాజీ పడ్డాం.. అని వేడుకున్నారు. దీంతో మంత్రి శాంతించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, 108, 104 వంటి వాటిని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన లయ న్స్ క్లబ్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. పార్టీలో గ్రూపులు మంచిది కాదని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని హితవు చెప్పారు. యువకులు సంఘటితంగా ఉండి గ్రామాల్లో మద్యం, సారా విక్రయించకుండా చూడాలన్నారు. ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ సంగమేశ్వర్రావు, వైస్‌చెర్మైన్ బాలునాయక్, డెరైక్టర్లు సాయిరెడ్డి, అనంతయ్య, ధారూరు పీఏసీఎస్ చెర్మై న్ జె.హన్మంత్‌రెడ్డి, డెరైక్టర్ సత్యనారాయణగౌడ్, లయన్స్ క్లబ్ ప్రతి నిధులు జోగేందర్శర్మ, రవికుమార్, కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, వైద్యులు డాక్టర్ సరిత, శ్రీధర్, మౌనిక, మాధవి, సాయికృష్ణ, శ్రీకాంత్, మాన్సింగ్ పాల్గొన్నారు. శిబిరంలో దంత, కంటి సంబంధ సాధారణ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. -
తెలంగాణ రాష్ట్రంలోనూ రచ్చబండ: ప్రసాద్‌కుమార్
పెద్దేముల్, న్యూస్‌లైన్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రచ్చబండ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. సోమవారం ఆయన పెద్దేముల్‌లోని ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన మూడో విడత రచ్చబండలో పాల్గొని మాట్లాడారు. ప్రజల వద్దకే అధికారులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రచ్చబండకు శ్రీకారం చుట్టారని, దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. రచ్చబండ ద్వారా జిల్లాలో 40,353 ఇందిరమ్మ ఇళ్లు, 10,567 రేషన్ కార్డులు మంజురు చేసినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్‌ను చట్టబద్ధం చేసి రూ.12వేల కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పటికి వికారాబాద్ నియోజకవర్గానికి రూ.18కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. గతంలో పంట నష్టపోయిన రైతులకు రుణాలు ఇచ్చేందుకు రూ.ఏడు కోట్లు సిద్ధంగా ఉన్నాయని, తుపానుకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, 60 ఏళ్లు దాటిన వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలని కోరారు. అనంతరం రూ.30 లక్షలతో నిర్మించిన స్త్రీశక్తి భవనాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి, ఉపాధి పీడీ చంద్రకాంత్‌రెడ్డి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్, డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు ధారాసింగ్, అనంత్‌రెడ్డి, మాజీ మున్సిఫల్ చైర్మన్ విశ్వనాథంగౌడ్, మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి, ఎంపీడీఓ సంధ్య, తహసీల్దార్ రామహరిప్రసాద్, గ్రామ సర్పంచ్ పద్మ, పలు పార్టీల నాయకులు అంజయ్య, నారాయణరెడ్డి, రాములు, మైపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌చారి, చందర్‌నాయక్, విష్ణువర్ధన్‌రెడ్డి, అంబరయ్య, రియాజ్, వెంకటరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘బంగారు తల్లుల’కు తిప్పలు
మంచాల, న్యూస్‌లైన్: బంగారుతల్లి పథకానికి ఎంపికైన మహిళలు రచ్చబండ కార్యక్రమంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచాల మండల కేంద్రంలో శుక్రవారం రచ్చబండ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం 11.00 గంటలకే మంత్రి ప్రసాద్‌కుమార్ వస్తారని చెప్పడంతో మహిళలంతా గంట ముందుగానే ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. చిన్నపిల్లలను చంకన వేసుకుని 91మంది మహిళలు పడిగాపులు కాశారు. పిల్లలు ఆకలి బాధ తట్టుకోలేక ఏడుస్తున్నారని, ఏంచేయాలో తోచడం లేదని కొంతమంది అధికారులకు తమ ఇబ్బందులను తెలియజేశారు. మంత్రిగారు వచ్చేదాకా ఎక్కడికీ వెళ్లడానికి వీల్లేదని అధికారులు చెప్పడంతో ఏడుస్తున్న పిల్లలను సముదాయిస్తూ మహిళలు అలాగే కూర్చుండిపోయారు. మంత్రిగారు తీరిగ్గా మధ్యాహ్నం 1.30గంటలకు వచ్చారు. తర్వాత మరో రెండుగంటల సేపు ప్రసంగాలు అవీ కొనసాగాయి. ఈ మధ్యలో సీపీఎం నాయకులు కాసేపు ఆందోళన చేయడంతో గొడవ జరుగుతుందేమోనని భయపడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత మహిళలకు బంగారుతల్లి పథకం మంజూరుపత్రాలు అందజేశారు. -
వైఎస్ ఆశయం మేరకే రచ్చబండ: ప్రసాద్‌కుమార్
మంచాల, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. వైఎస్ ఆశయం మేరకు పేదలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. శుక్రవారం మంచాలలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. దేశ సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్, అలాగే బాలికల కోసం బంగారుతల్లి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చురుకుగా చర్యలు తీసుకుంటోందన్నారు. మైనింగ్ జోన్ రద్దు చేయాలి... కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ జోన్‌తో రైతులు, ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రి ప్రసాద్‌కుమార్ లింగంపల్లి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే రూ.40లక్షలతో మంచాల-లింగంపల్లి రోడ్డు నిర్మా ణ పనులకు, తాళ్లపల్లిగూడలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 758మందికి రేషన్‌కార్డులు, 633మందికి పింఛన్లు, 844 స్వ యం సహాయక సంఘాలకు రూ.42.31 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులు, 91మందికి బంగారుతల్లి పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. సీపీఎం నిరసన... రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు ఫొటో లేకపోవడంతో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభమవుతుండగా సీపీఎం జిల్లా నాయకులు పి.యాదయ్య, కె.జగన్, కె.శ్రీనివాస్ నాయక్, ఆర్.జంగయ్య, మండల పార్టీ కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీన్ని గమనించిన మంత్రి ప్రసాద్‌కుమార్ వెంటనే లేచి ఎమ్మెల్సీ ఫొటో ఉంచనందుకు చింతిస్తున్నామని చెప్పడంతో సీపీఎం నాయకులు శాంతిం చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీఆర్డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఆర్డీఓ సూర్యారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నాగమణి, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
నిరుపేదల సంక్షేమం కోసమే ‘రచ్చబండ’
శంషాబాద్, న్యూస్‌లైన్: నిరుపేదల సంక్షేమం కోసమే ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని బేగం ఇండియా గార్డెన్లో సోమవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమానికి ఆయన ము ఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన లబ్ధిదారులందరికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నిజమైన లభ్ధిదారులకు న్యాయం చేకూరేలా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ కింద ఏటా రూ.12 వేల కోట్ల నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు. దళితుల ఉన్నత విద్య కోసం ఇందులోంచి నిధుల కేటాయింపు జరుగుతుందన్నారు. అనంతరం లభ్ధిదారులకు పింఛన్లు, రేషన్‌కార్డులు, హౌసింగ్ పత్రాలను అందజేశారు. తెలంగాణవాదుల లొల్లి రచ్చబండ వేదికపై ఉన్న బ్యానర్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫొటో ను తొలగించాలంటూ తెలంగాణవాదులు నినాదాలు చేశారు. మంత్రి ప్రసాద్‌కుమార్ ప్రసంగం కొనసాగుతుండగా నినాదాలు చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడారు.. శంషాబాద్‌లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని, మంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. రేషన్‌కార్డులున్నా ఆధార్ కార్డులు లేనివారికి సరుకులు ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా 820 ఫించన్లు, 54 రేషన్ కార్డు లు, 540 హౌసింగ్పత్రాలను అందజేశారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారి నుంచి రేషన్‌కార్డులు, హౌసింగ్, పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించారు. 24 గ్రామపంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలతో ఫంక్షన్‌హాలు కిక్కిరిసిపోయింది. దరఖాస్తులు ఇచ్చేందుకు జనం నానా ఇబ్బందులు పడ్డారు. -
ఎంపీడీఓల బదిలీల్లో ‘మంత్రాగం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీలకు తెర వెనుక ‘మంత్రా’ంగం నడుస్తోంది. బదిలీలపై ఆంక్షలున్నప్పటికీ, ఖాళీలను సాకుగా చూపి.. ఎంపీడీఓలకు స్థానచలనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పావులు కదుపుతోంది. మొయినాబాద్ ఎంపీడీఓగా పనిచేస్తున్న యాదయ్య ఇటీవల అపార్డ్‌కు బదిలీ అయ్యారు. దీంతో ఖాళీ అయిన ఈ పోస్టును దక్కించుకునేందుకు ఎంపీడీఓల మధ్య రేసు మొదలైంది. ఈ క్రమంలోనే జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ కనుసన్నల్లో పనిచేసే అధికారులను ఈ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా పలువురు ఎంపీడీఓలు ఈ ఇరువురి ప్రాపకం కోసం పైరవీలు మొదలుపెట్టారు. దీంతో ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ సిఫార్సు లేఖలతో ‘సమన్యాయం’ చేస్తున్నారు. హాట్ సీటు కోసం నగరానికి చేరువగా ఉన్న ఈ మండల ంపై కన్నేసిన గ్రామీణ ప్రాంత ఎంపీడీఓలు మంత్రి, మాజీ మంత్రి సిఫార్సు లేఖలతో సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మోమిన్‌పేట ఎంపీడీఓ సువిధ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉన్న మొయినాబాద్‌కు బదిలీ చేయాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌ను అభ్యర్థిం చడం.. ఆయన సానుకూలంగా స్పందించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఆమె పేరును సూచిస్తూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మాజీ మంత్రి సబితతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ పోస్టింగ్‌కు సిఫార్సు చేయించుకున్నారు. మొయినాబాద్ కుర్చీ కోసం ఇద్దరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అనూహ్యంగా పలువురు ఆశావహులు తెరమీదకు వచ్చారు. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్, గతంలో శంకర్‌పల్లిలో పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సుభాషిణి కూడా ఈ సీటు రేసులో ఉండడం గమనార్హం. కుర్చీలాట ఇదిలావుండగా పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మొయినాబాద్ సీటు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెది తనకు గుర్తెరిగిన కుటుంబం కావడంతో మాజీ మంత్రి సబిత ఆమె నియామకానికి మొగ్గుతున్నట్లు సమాచారం. మంత్రి ప్రసాద్ సిఫార్సు చేసిన సువిధ కు తన నియోజకవర్గంలోని మహేశ్వరం పోస్టు ను ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మండలంలోని గ్రామాలన్నీ నగర పంచాయతీలుగా మారడంతో సరూర్‌నగర్‌లో ఎంపీడీఓ పోస్టు రద్దు అనివార్యమవుతోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న శోభారాణిని మొయినాబాద్‌కు బదిలీచేసే అంశాన్ని పరిశీలించాలని సబిత సిఫార్సు చేసినట్లు తెలిసింది. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్‌ను మొయినాబాద్‌కు షిఫ్ట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్.రత్నం జిల్లా యంత్రాంగానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇలా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ఎంపీడీఓలు సచివాలయం, జెడ్పీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఉన్నతాధికారులకు చీరాకు తెప్పిస్తోంది. ఎవరికివారు కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని యంత్రాంగం భావిస్తోంది. ఇదీ మూలం హయత్‌నగర్ ఎంపీడీ ఓ అరుణను రాత్రికేరాత్రే కుత్బుల్లాపూర్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న జ్యోతిని ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి కొందరు ప్రత్యేక జీఓలు తెచ్చుకోవడం.. మొయినాబాద్ ఎంపీడీఓ కుర్చీ ఖాళీ కావడం తో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధికారుల మధ్య కుర్చీలాటకు దారితీసింది. దీంతో గత వారం పదిరోజులుగా బదిలీల వ్యవహారం అధికార వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. -
చెరువుల మరమ్మతుకు రూ.100కోట్లు
ధారూరు/ పెద్దేముల్, న్యూస్‌లైన్ : ‘నీటి బొట్టు ఒడిసి పట్టు అన్న విధంగా ప్రతి వర్షపు చుక్క కూడా వృథా కాకుండా జిల్లాలో అవసరమైన చోట్ల చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు కృషి చేస్తా’నని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డితో కలిసి కోట్‌పల్లి ప్రాజెక్టు కుడి కాలువ నుంచి నీటిని రైతుల పంట పొలాలకు వదిలారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జిల్లాలో చిన్న చెరువుల మరమ్మతులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం కోసం రూ 100కోట్ల నిధుల విడుదలకు కృషి చేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ప్రధానమైన కోట్‌పల్లి ప్రాజెక్టు ఆధునికీకరణకు జపాన్ దేశానికి చెందిన జైకా నుంచి రూ.25కోట్లు మంజూరు చేయించామని, పూర్తిస్థాయి మరమ్మతుల కోసం మరో రూ.25 కోట్లు విడుదల చేయించనున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు సందర్శనకు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నందున టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసి ఓ పార్కును నిర్మించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ప్రాజెక్టు కాల్వలు సరిగ్గా లేవని, వరి కాకుండా ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. వరి వేసి నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన చెందే పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేందుకు కృషి తుపాను వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, వరి, మొక్కజొన్న తదితర అన్ని పంటలు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.10వేల పరిహారం అందించేలా కృషి చేస్తానని మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. గతంలో పంట నష్టం అంచనాలు సరిగ్గా రూపొందించకపోవడం వల్ల ఎకరాకు రూ.వెయ్యి, రూ.2వేలు మాత్రమే అందిందని గుర్తు చేశారు. ఈ సారి అలాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు వేసిన అంచనాలను పంచాయతీలలో పరిశీలించి ఆమోదించాకే పంట నష్టపోయిన రైతుల జాబితాను ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. దీనివల్ల అర్హులైన రైతులకు ఎకరాకు రూ.10వేల పరిహారం లభించే వీలుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్, వైస్ చైర్మన్లు పి.సంగమేశ్వర్రావు, బాలునాయక్, ధారూరు పీఏసీఎస్ చైర్మన్ జె.హన్మంత్‌రెడ్డి, ఇరిగేషన్ ఈఈ వెంకటేశం, డీఈ నర్సింహ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల రాములు, యాదగిరి, జి.హన్మయ్య, జి. నారాయణరెడ్డి, చాకలి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
వరద ప్రాంతాల్లో నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వరద ప్రభావిత ప్రాంతాల్లోని చేనేత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఆ శాఖ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. వరదలతో నష్టపోయిన నేత కార్మికుల కుటుంబాలకు ఉచితంగా 20 కేజీల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్‌ను అందించనున్నామని వెల్లడిం చారు. వరద ప్రాంతాల్లో నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు చెప్పారు. బుధవారం తన నివాసంలో విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్... చేనేత రంగాన్ని కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నేత పనిని సులభతరం చేసేలా మరమగ్గాల ఆధునికీకరణకు రూ.200 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు కూడా మరమగ్గాల అప్‌గ్రేడేషన్‌కు నిధులు కేటాయించేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారని ప్రసాద్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రంగారెడ్డి జిల్లా సహా తెలంగాణ ప్రాంతంలో అపార పంటనష్టం జరిగిందని, నీలం తుపాను సమయంలో చెల్లించినట్లు హెక్టారుకు రూ.10వేల నష్ట పరిహారం అందించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. జిల్లాలోని అగ్గనూర్-బషీరాబాద్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, తాండూరు-కోట్‌పల్లి, కోట్‌పల్లి-సదాశివ్పేట్ మార్గాల అభివృద్ధికి అవసరమైన రూ.60 కోట్లు విడుదల చేయాలనే ప్రతిపాదనలకు కేంద్ర రవాణా, రహదారి శాఖ సహాయ మంత్రి సర్వే సత్యనారాయణ సుముఖత చూపినట్లు ప్రసాద్ వెల్లడించారు. జైత్రయాత్ర వాయిదా? షెడ్యూల్ ప్రకారం నవంబర్ 10న జరగాల్సిన తెలంగాణ జైత్రయాత్ర సభ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వికారాబాద్‌లో ఈ సభ నిర్వహించాలని సూత్రప్రాయంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అయితే, అంతకుముందు రోజు (నవంబర్ 9న) వరంగల్‌లో జైత్రయాత్ర సభ ఉన్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సభకు ముఖ్యనేతలు హాజరుకాకపోతే బాగుండదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. టీ ప్రజాప్రతినిధులకు నేతృత్వం వహిస్తున్న పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డితో సంప్రదించిన తర్వాత సభ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి ప్రసాద్ కుమార్ విలేకర్లకు తెలిపారు. -
నష్టం అంచనాకు గ్రామాలకు వెళ్లండి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారీ వర్షాలతో జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి ప్రసాద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో జరిగిన నష్టంపై శనివారం మంత్రి కలెక్టరేట్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖ ల అధికారుల బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించాలని నష్టం వివరాలను సేకరించాలన్నారు. పంటనష్ట పరిహారంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో రోడ్లు చాలా ధ్వంసమయ్యాయని, వాటి మరమ్మతులకు రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్షాలతో రోడ్లు ఏ మేరకు దెబ్బతిన్నాయో అంచనా వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంట నష్టాన్ని ఆదర్శ రైతులతో కాకుండా రెవెన్యూ అధికారులతో అంచనా వేయించాలని పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి సూచించారు. రైతులకు సకాలంలో పరిహారం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి కోరారు. గతంలో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆయన గుర్తు చేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రత్నం, కూన శ్రీశైలంగౌడ్, కలెక్టర్ శ్రీధర్, జేసీలు చంపాలాల్, ఎంవీ రెడ్డి, డీఆర్వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
దామస్తాపూర్‌లో మళ్లీ ప్రకంపనలు
మర్పల్లి, న్యూస్‌లైన్ : భూకంప భయం దామస్తాపూర్ గ్రామస్తులను వీడటం లేదు. శనివారం రాత్రి 7.10గంటలకు మళ్లీ బాంబులు పేల్చినట్లు భూమిలోంచి శబ్దాలు రావడంతో పిల్లాపాపల సహా రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ నెల 13వ తేదీ నుంచి తరచు భూగర్భంలో శబ్దాలు వస్తుండటంతో ఎక్కడ భూకంపం బారినపడతామేమోనని గ్రామస్తులంతా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో శనివారం రాత్రి పెద్దశబ్దాలతో భూమి కంపించినట్లు కావడంతో తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా జాగారం చేశారు. మంత్రి ఆదేశాలు బేఖాతర్... దామస్తాపూర్‌లో భూ ప్రకంపనల విషయం తెలుసుకున్న రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ ఈ నెల 15న గ్రామాన్ని సందర్శించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. గ్రామంలో టెంట్లు ఏర్పాటు చేయించి, అన్ని వసతులు సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అలాగే రెండు రోజుల్లో జాతీయ భూ భౌతిక పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలను గ్రామానికి రప్పించి భూ ప్రకంపనల విషయం తెలుసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతవరకూ అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లలోనే ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ మేరకు 21వ తేదీన భూ భౌతిక పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.కె.చంద్ర, శ్రీనాగేష్లు దామస్తాపూర్‌ను సందర్శించి సెస్మోగ్రాఫిక్ పరికరాలతో భూ ప్రకంపనల తీవ్రతను పరిశీలించారు. మరికొన్ని రోజులు టెంట్లలోనే ఉండాలని గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు రెండు రోజుల పాటు టెంట్ల కింద నిద్రలేని రాత్రులు గడిపారు. కాగా, ఇటీవలి వర్షాలకు గ్రామంలో అధికారులు ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో గ్రామస్తులు మళ్లీ ఇళ్లకు వెళ్దామనుకున్న సమయంలో శనివారం రాత్రి మళ్లీ భూమి కంపించినట్లు కావడంతో మళ్లీ రోడ్లపైకి చేరుకున్నారు. వసతులు కల్పించాలన్న మంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా, కనీసం టెంట్లు తిరిగి వేయించడంలో కూడా అధికారులు నిర్లక్ష్యం చూపారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఒక్క అధికారి కూడా గ్రామాన్ని సందర్శించి ధైర్యం చెప్పలేదని, ఇక భగవంతుడిపైనే భారం వేసి గడుపుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
నష్టం.. అపారం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విస్తారంగా కురిసిన వర్షాలు రైతాంగాన్ని నీట ముంచాయి. శనివారం వరుణుడు కాసింత శాంతించినా... ఎడతెరిపిలేని వానలతో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అన్నదాతలను ఆందోళనలకు గురిచేస్తోంది. వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే కాకిలెక్కలుగా రూపొందించిన నష్ట పరిహారం లెక్కలపై శనివారం జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 1,983 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. వీటిలో అత్యధికంగా 935 హెక్టార్లలో వరిపైరు దెబ్బతినగా.. పత్తి 718 హెక్టార్లలో, 330 హెక్టార్లలో మొక్క జొన్నకు నష్టం జరిగిందని స్పష్టం చేసింది. అలాగే జిల్లాలో భారీ వర్షాలకు 828 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీటిలో 91 గృహాలు నేలమట్టం కాగా, 737 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తేల్చింది. వరద ముంచెత్తడంతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 16 మండలాల్లో సుమారు 2501.60 హెక్టార్లలో కూరగాయలు, పండ్లు, పూల తోటలకు నష్టం జరిగింది. పొలాల్లో ఇసుక మేట, నీరు నిలిచిపోవడంతో టమాటా, క్యారెట్, బంతి, చామంతి తదితర తోటలకు నష్టం చేకూరింది. ఇదిలాఉండగా, ఏకధాటిగా కురిసిన వానలతో గ్రామీణ రోడ్లు కొట్టుకుపోయాయి. చాలా రహదారులు కోతలకు గురికాగా, ఆనేక మార్గాలకు గండ్లు పడ్డాయి. వీటి నష్టాన్ని లెక్కగట్టే పనిలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ ఇంజనీర్లు తలమునకలయ్యారు. వర్షపాతం నమోదు ఇలా.. జిల్లావ్యాప్తంగా సగటున 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా బాలానగర్‌లో 9.8, రాజేంద్రనగర్‌లో 7.3, ఘట్కేసర్లో 7, హయత్‌నగర్‌లో 7.2, ఇబ్రహీంపట్నంలో 5.3, మంచాల, కందుకూరులో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఏకధాటిగా కురిసిన వ ర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన చెరువులు అలుగులు పారుతుండగా... ఇబ్రహీంపట్నం చెరువుకు రెండోరోజు కూడా వరద పోటెత్తింది. గ్రామాల్లో కుంటలు, చెరువులకు జలకళ రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలతో ఆపారంగా పంటనష్టం జరిగినా.. కరువుతీరా వానలు కురియడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.