మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యం | My target is bring medical college :Prasad kumar | Sakshi
Sakshi News home page

మెడికల్ కాలేజీ ఏర్పాటే లక్ష్యం

Published Tue, Sep 17 2013 1:21 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

My target is bring medical college :Prasad kumar

వికారాబాద్‌రూరల్, న్యూస్‌లైన్: వికారాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ఎల్లప్పుడూ  కృషిచేస్తానని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ మార్కెట్‌లో రూ.2కోట్లతో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాలు, మార్కెట్ స్వాగత గేట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వికారాబాద్‌ను అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు కృషిచేస్తానన్నారు.వికారాబాద్‌ను జిల్లాకేంద్రంగా చేయడతోపాటు మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతామన్నారు. కాంగ్రెస్‌లో కార్యకర్తగా పనిచేయడం ఎంతో గర్వకారణమన్నారు.
 
 సీమాంధ్ర లో ఎన్ని ఉద్యమాలు చేస్తున్నా కేంద్రం లెక్కచేయకుండా టీ నోట్ తయారుచేస్తుందని పేర్కొన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజల ఉద్యమం కాదన్నారు. వికారాబాద్ మార్కెట్‌లో రైతులకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ ప్రాంత రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. రూ. 49.50లక్షలతో రైతుబజార్‌ను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. రూ.6లక్షలతో మార్కెట్‌కు నలువైపులా స్వాగతబోర్డులను ఏర్పాటుచేశామన్నారు. ఈ స్వాగత బోర్డులకు ఉండేకారి నర్సయ్య, ముద్దమల్లప్ప గేట్లుగా వీటికి నామకరణం చేసినట్లు వెల్లడించారు. త్వరలో వీరి విగ్రహాలను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. వికారాబాద్ మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. 
 
 వికారాబాద్ పట్టణంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేయడం కోసం  ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ కూడా పూర్తిసహకారం అందించనున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు మెడికల్ కళాశాలలు ఏర్పాటు కానున్నాయన్నారు. మొదటిది నల్లగొండ జిల్లాలోని బీబీనగర్, రెండోవది వికారాబాద్‌లో ఏర్పాటవుతుందన్నారు. జిల్లాల రీ-ఆర్గనైజేషన్ కమిటీ సమావేశంలో వికారాబాద్ జిల్లా కేంద్రం ఏర్పాటు ప్రస్తావన తీసుకువస్తానన్నారు. వికారాబాద్ సబ్‌కలెక్టర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. రైతులు ఇక్కడి వసతులను సరైనవిధంగా వినియోగించుకుని అభివృద్ధి సాధించాలన్నారు. మార్కెట్‌కమిటీ చైర్మన్ లంకాల శశాంక్‌రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి కృషిచేసింది మంత్రి ప్రసాద్‌కుమారేనని కొనియాడారు. అనంతరం మార్కెట్ కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు.  కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి సత్యనారాయణ, పీఏసీఎస్ చైర్మన్ రత్నారెడ్డి, గుడిసె రుక్మయ్య, బస్వరాజ్, అనంత్‌రెడ్డి, శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి, నర్సింహులు, మాధవి, మార్కెట్ కమిటీ డెరైక్టర్లు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement