సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో ‘సహకార’ పోరు మళ్లీ షురువైంది. జిల్లా మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబిత వర్గపోరుతో వాయిదాపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 31న డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఎన్నుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికలతో రాజుకున్న చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థుల ఖరారుపై జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ మధ్య తలెత్తిన వివాదం ఆ పార్టీలో పెను దుమారమే రేపింది. చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఇరుపక్షాలూ ఆధిపత్య పోరుకు దిగడంతో డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఇరువర్గాలూ పావులు కదుపుతున్నాయి. డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, తన వర్గం అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేయడం ద్వారా మెట్టు దిగారు. ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ డీసీఎంఎస్‌కు నెలాఖరున ఎన్నికలు జరుగనున్నాయి. గత పరిణామాల దృష్ట్యా వైరివర్గంపై పైచేయి సాధించేందుకు ఇరువర్గాలూ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది.
అప్పట్లో ఇలా..
డీసీఎంఎస్ చైర్మన్ పదవిని తన మద్దతుదారులకు దక్కకుండా సబిత వర్గం శ్రావణ్ కుమార్‌తో నామినేషన్ దాఖలు చేయించడంపై మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. పదవుల కేటాయింపుల్లో సామాజిక న్యాయంపాటించాలని సీఎం, పీసీసీ చీఫ్ స్పష్టం చేసినా వారి ఆదేశాల్ని సబిత ఉల్లంఘించారని ఆక్రోషించారు. ఇదే విషయంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని భావించిన ప్రసాద్.. ఆమె వ్యవహార శైలిపై ఏకంగా సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు ఫిర్యాదు చేశారు. డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దారాసింగ్‌కు కట్టబెట్టేలా చూడాలని కోరారు. అయితే దారాసింగ్ అభ్యర్థిత్వంపై అప్పటి మంత్రి సబిత అభ్యంతరం వ్యక్తంచేయడం వివాదానికి దారితీసింది. ఆఖరికి అధిష్టానం పెద్దల మాటలకు కట్టుబడి సబిత శ్రావణ్‌కుమార్ నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. అయితే దారాసింగ్‌ను కనీసం ప్రతిపాదించేందుకు కూడా సభ్యులెవరూ లేకపోవడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది.
ఇప్పుడెలా..!
మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో డీసీఎంఎస్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి. అప్పట్లో హోంమంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన సబిత ప్రాభవం ఇప్పుడు తగ్గిపోయినప్పటికీ, అధికారపార్టీలో మాత్రం ఆమె హవా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా సహకార ఎన్నికల్లో ఆమె బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సొసైటీలను చేజిక్కించుకున్నారు. అప్పట్లో హైకమాండ్ ఆదేశాలకు తలొగ్గి తన అనుచరుడితో నామినేషన్ ఉపసంహరింపజేసిన సబిత వారం రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన దారాసింగ్ అభ్యర్థిత్వానికే మంత్రి ప్రసాద్‌కుమార్ మొగ్గు చూపుతున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సబిత వర్గం తమతో కలిసి రావాల్సిందేనని ఆయన అంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా.. చైర్మన్‌గిరిపై కన్నేసిన ఇరువర్గాలూ డెరైక్టర్లను రహస్య క్యాంపులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యాయి.
అధికార పార్టీలో ‘సహకార’ పోరు!
Published Thu, Aug 22 2013 11:49 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement
Advertisement