co-operative
-
సభ్యత్వం తీసుకోండి
- రుసుము మేమే భరిస్తాం: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు: దారిద్ర రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాల్లో కనీసం ఒక్కరైనా ఏదో ఒక సహకార సంఘంలో సభ్యులుగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకు సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్పించడానికి అయ్యే సభ్యత్వ లేదా షేర్ రుసుం ప్రభుత్వమే భరించనుందన్నారు. ఇందుకు సంబంధించి పూర్తిస్థాయిలో త్వరలో అధికారిక ప్రకటన వెలువరించనున్నామని ఆయన పేర్కొన్నారు. బెంగళూరులో నూతనంగా నిర్మించబడనున్న ‘సహకార సౌధ’ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. సహకార సంఘాల్లోని సభ్యులందరికీ ఆరోగ్యబీమా కోసం అమలు చేస్తున్న ‘యశస్విని పథకం’ ఎంతో ప్రయోజనకంగా ఉంటోందన్నారు. ఈ పథకం రాష్ట్రంలోని అన్ని బీపీఎల్ కుటుంబాలకు కూడా అందాలనేది తమ ఉద్దేశమన్నారు. అందువల్లే బీపీఎల్ కుటుంబంలో కనీసం ఒక్కరినైనా సహకార సంఘ సభ్యుడిగా చేర్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోని దాదాపు 1.08 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని సిద్ధరామయ్య వివరించారు. ఒక్క యశస్వినీ పథకమే కాకుండా సహకార సంఘాల్లోని ప్రతి సభ్యుడికీ రూ.3 లక్షల వరకూ వడ్డీరహిత రుణాలు అం దిస్తున్నామన్నారు. ఇటువంటి ఎన్నో ప్రయోజనాలు కూడా నూతనంగా చేరబో యే సభ్యులకు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 33 వేల సహకార సంఘాలు, 2.22 కోట్ల సహకారసంఘ సభ్యులు ఉన్నారని సిద్ధరామ య్య తెలిపారు. ప్రభుత్వ నూతన నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు కూడా ప్రయోజనం పొందగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర సహకార శాఖ మంత్రి హెచ్.ఎస్ మహదేవ ప్రసాద్ మాట్లాడుతూ... నూతననంగా చేపడుతున్న సహకారసౌధ భవన నిర్మాణానికి రూ.8.60 కోట్లు ఖర్చు చేయనున్నామన్నారు. ఏడాదిన్నరలోపు భవనాన్ని పూర్తి చేస్తామని తె లిపారు. మంత్రులు రామలింగారెడ్డి, దినేశ్‌గుండూరావ్ పాల్గొన్నారు. -
అధికార పార్టీలో ‘సహకార’ పోరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అధికార పార్టీలో ‘సహకార’ పోరు మళ్లీ షురువైంది. జిల్లా మంత్రి ప్రసాద్, మాజీ మంత్రి సబిత వర్గపోరుతో వాయిదాపడిన జిల్లా సహకార మార్కెటింగ్ సంస్థ (డీసీఎంఎస్) ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 31న డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఎన్నుకునేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికలతో రాజుకున్న చిచ్చు కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టించింది. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ అభ్యర్థుల ఖరారుపై జిల్లా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ మధ్య తలెత్తిన వివాదం ఆ పార్టీలో పెను దుమారమే రేపింది. చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఇరుపక్షాలూ ఆధిపత్య పోరుకు దిగడంతో డీసీఎంఎస్ ఎన్నిక వాయిదా పడిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే తాజాగా డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఇరువర్గాలూ పావులు కదుపుతున్నాయి. డీసీఎంఎస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను దక్కించుకునేందుకు స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, తన వర్గం అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేయడం ద్వారా మెట్టు దిగారు. ఈ నేపథ్యంలో వాయిదా పడ్డ డీసీఎంఎస్‌కు నెలాఖరున ఎన్నికలు జరుగనున్నాయి. గత పరిణామాల దృష్ట్యా వైరివర్గంపై పైచేయి సాధించేందుకు ఇరువర్గాలూ ఎత్తుగడలు వేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఇలా.. డీసీఎంఎస్ చైర్మన్ పదవిని తన మద్దతుదారులకు దక్కకుండా సబిత వర్గం శ్రావణ్ కుమార్‌తో నామినేషన్ దాఖలు చేయించడంపై మంత్రి ప్రసాద్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. పదవుల కేటాయింపుల్లో సామాజిక న్యాయంపాటించాలని సీఎం, పీసీసీ చీఫ్ స్పష్టం చేసినా వారి ఆదేశాల్ని సబిత ఉల్లంఘించారని ఆక్రోషించారు. ఇదే విషయంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని భావించిన ప్రసాద్.. ఆమె వ్యవహార శైలిపై ఏకంగా సీఎం కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సకు ఫిర్యాదు చేశారు. డీసీఎంఎస్ అధ్యక్ష పదవిని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన దారాసింగ్‌కు కట్టబెట్టేలా చూడాలని కోరారు. అయితే దారాసింగ్ అభ్యర్థిత్వంపై అప్పటి మంత్రి సబిత అభ్యంతరం వ్యక్తంచేయడం వివాదానికి దారితీసింది. ఆఖరికి అధిష్టానం పెద్దల మాటలకు కట్టుబడి సబిత శ్రావణ్‌కుమార్ నామినేషన్‌ను విత్‌డ్రా చేయించారు. అయితే దారాసింగ్‌ను కనీసం ప్రతిపాదించేందుకు కూడా సభ్యులెవరూ లేకపోవడంతో అప్పట్లో ఎన్నిక వాయిదా పడింది. ఇప్పుడెలా..! మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో డీసీఎంఎస్ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి. అప్పట్లో హోంమంత్రిగా జిల్లా రాజకీయాలను శాసించిన సబిత ప్రాభవం ఇప్పుడు తగ్గిపోయినప్పటికీ, అధికారపార్టీలో మాత్రం ఆమె హవా ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా సహకార ఎన్నికల్లో ఆమె బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ సొసైటీలను చేజిక్కించుకున్నారు. అప్పట్లో హైకమాండ్ ఆదేశాలకు తలొగ్గి తన అనుచరుడితో నామినేషన్ ఉపసంహరింపజేసిన సబిత వారం రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాలి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన దారాసింగ్ అభ్యర్థిత్వానికే మంత్రి ప్రసాద్‌కుమార్ మొగ్గు చూపుతున్నారు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం సబిత వర్గం తమతో కలిసి రావాల్సిందేనని ఆయన అంటున్నట్లు తెలిసింది. ఇదిలావుండగా.. చైర్మన్‌గిరిపై కన్నేసిన ఇరువర్గాలూ డెరైక్టర్లను రహస్య క్యాంపులకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యాయి. -
నాబార్డు ‘సహకారం’ లేదు
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు నిర్వీర్యం కానున్నాయి. ఇప్పటివరకు రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్న సంఘాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇక పై సంఘాలు కేవలం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు బిజినెస్ కరస్పాండెంట్‌గా మాత్రమే కొనసాగనున్నాయి. ఈ మేరకు నాబార్డు గత నెల చివరలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం సమైక్య ఉద్యమం కారణంగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంఘాలను నిర్వీర్యం చేసే నాబార్డు ఉత్తర్వులపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వైద్యనాథన్ కమిటీ సూచన మేరకు నాబార్డు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నగదు బదిలీ పథకం అమలైతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించి ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం అమలవుతున్న మూడు అంచెల విధానం (ఆప్కాబ్, డీసీసీబీ, సహకార సంఘాలు) నుంచి సహకార సంఘాలను తొలగించి రెండంచెల విధానం ప్రవేశ పెట్టవచ్చని తెలుస్తోంది. నాబార్డు ఉత్తర్వులు ఏమి చెబుతున్నాయంటే... సహకార సంఘాలకు స్వయం ప్రతిపత్తి ఉండదు. సంఘాల ఆస్తులు, డిపాజిట్లు, షేర్ క్యాపిటల్, అప్పులు డీసీసీబీకి బదిలీ అవుతాయి. సంఘాలకు డీసీసీబీ ఎలాంటి బడ్జెట్ ఇవ్వదు. రైతులకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాలు ఇచ్చే అధికారం సంఘాలకు ఉండదు. డిపాజిట్లు కూడా సేకరించరాదు. నేరుగా రుణాలు మంజూరు చేయనున్న డీసీసీబీ. రైతులకు రూపే కార్డు ద్వారా సేవలు. ఇవి చేసుకోవచ్చు... సహకార సంఘాలు వివిధ వ్యాపారాలు చేసుకుని రుణాలు ఇచ్చుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారాలతో పాటు పర్సనల్ రుణాలు, గోల్డ్ లోన్లు ఇచ్చుకోవచ్చు. సహకార సంఘాల ద్వారా జిల్లాలో 90 వేల మంది రైతులకు ఏటా రూ.400 కోట్లు రుణాలు అందుతున్నాయి. అయితే సహకార సంఘాలు డీసీసీబీ రైతులకు ఇచ్చిన రుణాలు వసూలు చేస్తే సంఘానికి కమీషన్ రూపంలో ఆదాయం వస్తుంది.