ధారూరు, న్యూస్‌లైన్: మంత్రి సాక్షిగా ధారూరు మండలం మైలారంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఆహ్వానించారు. మంత్రి గ్రామానికి చేరుకున్న వెంటనే స్థానిక సర్పంచ్ శంకర్, వికారాబాద్ మార్కెట్ కమిటీ డెరైక్టర్ పెండ్యాల అనంతయ్యలు తమ అనుచరులతో రెండు వర్గాలుగా విడిపోయి స్వాగతం పలికారు. ఆ తర్వాత అనంతయ్య ఏర్పాటు చేసిన వేదిక వద్దకు మంత్రిని తీసుకెళ్తుండగా సర్పంచ్ వర్గం అభ్యంతరం చెప్పింది.
దీంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా మంత్రి అనంతయ్య వెంటే వెళ్లారు. దీంతో సర్పంచ్ వర్గం ప్రధాన వేదిక వద్దకు చేరుకుని ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న మంత్రి వెనుదిరిగి ప్రధాన వేదిక వద్దకు వచ్చారు. అయితే ముందే ఇక్కడికి రాకుండా పెండ్యాల వర్గంలో వెళ్లడంపై ఆగ్రహంతోఉన్న సర్పంచ్ వర్గం నాయకులు కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. ఈ ఆధిపత్య పోరుతో విసిగిన మంత్రి వేదికపైకి వెళ్లకుండా కిందే నిల్చుండి పోయారు. ‘మీరు కొట్లాడుకుంటుంటే నేనెందుకిక్కడ, వెళ్లిపోతా..’ నంటూ హెచ్చరించారు. కాసేపటి తర్వాత శంకర్, అనంతయ్యలు మంత్రిని బతిమలాడినా శాంతించలేదు. చివరకు ఇద్దరూ మంత్రి చేతులు పట్టుకుని.. క్షమించండి, మేమిద్దరం రాజీ పడ్డాం.. అని వేడుకున్నారు. దీంతో మంత్రి శాంతించడంతో కార్యక్రమం ప్రారంభమైంది.
ప్రజా ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని మంత్రి ప్రసాద్‌కుమార్ వెల్లడించారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి ప్రసంగించారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్, 108, 104 వంటి వాటిని ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన లయ న్స్ క్లబ్ ప్రతినిధులను మంత్రి అభినందించారు. పార్టీలో గ్రూపులు మంచిది కాదని, విభేదాలు పక్కన పెట్టి పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలని హితవు చెప్పారు. యువకులు సంఘటితంగా ఉండి గ్రామాల్లో మద్యం, సారా విక్రయించకుండా చూడాలన్నారు. ధారూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చెర్మైన్ సంగమేశ్వర్‌రావు, వైస్‌చెర్మైన్ బాలునాయక్, డెరైక్టర్లు సాయిరెడ్డి, అనంతయ్య, ధారూరు పీఏసీఎస్ చెర్మై న్ జె.హన్మంత్‌రెడ్డి, డెరైక్టర్ సత్యనారాయణగౌడ్, లయన్స్ క్లబ్ ప్రతి నిధులు జోగేందర్‌శర్మ, రవికుమార్, కాంగ్రెస్ రాష్ట్ర ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, వైద్యులు డాక్టర్ సరిత, శ్రీధర్, మౌనిక, మాధవి, సాయికృష్ణ, శ్రీకాంత్, మాన్‌సింగ్ పాల్గొన్నారు. శిబిరంలో దంత, కంటి సంబంధ సాధారణ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు.
మీరు కొట్లాడుకుంటుంటే నేనెందుకిక్కడ?
Published Mon, Dec 23 2013 12:22 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM
Advertisement
Advertisement