సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: విస్తారంగా కురిసిన వర్షాలు రైతాంగాన్ని నీట ముంచాయి. శనివారం వరుణుడు కాసింత శాంతించినా... ఎడతెరిపిలేని వానలతో పంటలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. మరోవైపు మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది అన్నదాతలను ఆందోళనలకు గురిచేస్తోంది. వర్షాలతో నష్టపోయిన పంటల వివరాలను జిల్లా యంత్రాంగం సేకరించే పనిలో నిమగ్నమైంది. క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే కాకిలెక్కలుగా రూపొందించిన నష్ట పరిహారం లెక్కలపై శనివారం జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జిల్లావ్యాప్తంగా 1,983 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. వీటిలో అత్యధికంగా 935 హెక్టార్లలో వరిపైరు దెబ్బతినగా.. పత్తి 718 హెక్టార్లలో, 330 హెక్టార్లలో మొక్క జొన్నకు నష్టం జరిగిందని స్పష్టం చేసింది. అలాగే జిల్లాలో భారీ వర్షాలకు 828 ఇళ్లు దెబ్బతిన్నాయని, వీటిలో 91 గృహాలు నేలమట్టం కాగా, 737 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయని తేల్చింది. వరద ముంచెత్తడంతో ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 16 మండలాల్లో సుమారు 2501.60 హెక్టార్లలో కూరగాయలు, పండ్లు, పూల తోటలకు నష్టం జరిగింది. పొలాల్లో ఇసుక మేట, నీరు నిలిచిపోవడంతో టమాటా, క్యారెట్, బంతి, చామంతి తదితర తోటలకు నష్టం చేకూరింది. ఇదిలాఉండగా, ఏకధాటిగా కురిసిన వానలతో గ్రామీణ రోడ్లు కొట్టుకుపోయాయి. చాలా రహదారులు కోతలకు గురికాగా, ఆనేక మార్గాలకు గండ్లు పడ్డాయి. వీటి నష్టాన్ని లెక్కగట్టే పనిలో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ ఇంజనీర్లు తలమునకలయ్యారు.
వర్షపాతం నమోదు ఇలా..
జిల్లావ్యాప్తంగా సగటున 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా బాలానగర్‌లో 9.8, రాజేంద్రనగర్‌లో 7.3, ఘట్‌కేసర్‌లో 7, హయత్‌నగర్‌లో 7.2, ఇబ్రహీంపట్నంలో 5.3, మంచాల, కందుకూరులో 5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఏకధాటిగా కురిసిన వ ర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన చెరువులు అలుగులు పారుతుండగా... ఇబ్రహీంపట్నం చెరువుకు రెండోరోజు కూడా వరద పోటెత్తింది.
గ్రామాల్లో కుంటలు, చెరువులకు జలకళ రావడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలతో ఆపారంగా పంటనష్టం జరిగినా.. కరువుతీరా వానలు కురియడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.