సాక్షి, రంగారెడ్డి జిల్లా: హమ్మయ్య...! జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగుపడింది. నాలుగు నెలలక్రితం జిల్లాలో సగటు భూగర్భ నీటి మట్టం 16.17 మీటర్లుగా నమోదు కాగా.. ప్రస్తుతం 4.36 మీటర్ల మేర పాతాళగంగ పైకొచ్చినట్లు భూగర్భ జల శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నీటిమట్టాలు క్రమంగా పైకొస్తున్నట్లు జిల్లా భూగర్భ జల శాఖ అధికారుల తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత సీజన్‌లో జిల్లాలో 58.7సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు 53.3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అయితే వర్షపాతం ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. భూగర్భ జలాలు మాత్రం ఆ స్థాయిలో మెరుగుపడలేదు.
పాత లెక్కలు.. అంచనాలు..
జిల్లాలో 37 మండలాలున్నాయి. ఈ మండలాల్లో భూగర్భ నీటి మట్టాలను తెలుసుకునేందుకుగాను భూగర్భ జల శాఖ మండలానికొక బోరును ఏర్పాటు చేసింది. వీటి ఆధారంగా ప్రతి నెల నీటి మట్టాలను అంచనా వేస్తుంది. ఆ ప్రాంతంలో వచ్చిన ఫలితాల ఆధారంగా మండలంలో భూగర్భ నీటిమట్టంగా అంచనా వేస్తున్న యంత్రాంగం.. వాస్తవ లెక్కలపై మాత్రం దృష్టి సారించడం లేదు. దీంతో నివేదికల్లోని వివరాలు.. వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ.. ఏళ్ల క్రితం నాటి బోర్ల ఆధారంగానే నీటిమట్టాలు కొలవడం ఆ శాఖ పనితీరును స్పష్టం చేస్తోంది. ఒక్కో మండలానికి కనీసం నాలుగు బోర్లు ఏర్పాటు చేస్తే కొంత మేరకైనా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
నివేదికల్లో ఆశాజనకంగా..
భూగర్భ జల వనరుల శాఖ ప్రతినెల నీటి మట్టాలపై నివేదికలు రూపొందిస్తుంది. ఇందులో భాగంగా గత నాలుగు నెలల్లో జిల్లాలోని భూగర్భ జలాల పరిస్థితి పరిశీలిస్తే.. మే నెలలో 16.17 మీటర్ల లోతులో జలాలు లభిస్తుండగా.. ప్రస్తుతం 11.81 మీటర్లుగా నమోదైంది. ఇటీవల కురిసిన వర్షాలకు భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయంలో జిల్లాలో సగటు నీటి మట్టం 11 మీటర్లుగా ఉంది. ఈ లెక్కన నీటి మట్టాలు మరింత లోతులోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.