సాక్షి, రంగారెడ్డి జిల్లా :అధికారులు వారంలో కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆయా పథకాల అమలు తీరును తెలుసుకోవాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ సూచించారు. శనివారం ఖైరతాబాద్‌లోని జెడ్పీ కార్యాలయంలో ఆధునికీకరించిన సమావేశ మందిరాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ జిల్లా అభివృద్థి పథంలో నడవాలంటే అధికారుల కృషి అవసరమన్నారు. అందుకు క్షేత్రస్థాయి పర్యటనలు దోహదం చేస్తాయని చెప్పారు. త్వరలో ప్రభుత్వం మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టనుందని, అందులో అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి, కలెక్టర్ బి.శ్రీధర్, జెడ్పీ సీఈఓ రవీందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.