జిల్లాలో ఈ నెల 13 నుంచి 26 వరకు మూడోవిడత రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఈ నెల 13 నుంచి 26 వరకు మూడోవిడత రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బి.శ్రీధర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులకు పింఛన్లు, రేషన్ కూపన్లు, ఇందిరమ్మ ఇళ్లు తదితర సంక్షేమ పథకాల ఫలాలు అందించనున్నట్లు చెప్పారు. మొదట మోమిన్‌పేట మండల కేంద్రంలో ఈ నెల 13న కార్యక్రమం ప్రారంభమవుతుందని, రచ్చబండ కార్యక్రమంపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా సమాచార శాఖ ద్వారా పంపిణీ చేశామన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, మున్సిపాల్టీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, నిర్దేశించిన తేదీల వారీగా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.