సాక్షి, రంగారెడ్డి జిల్లా : అన్నదాత శ్రమ వరుణుడిపాలైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట దిగుబడి చేతికొచ్చే సమయంలో వరుసగా కురుస్తున్న వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనంతో ఏర్పడిన తుఫాను ప్రభావంతో రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు రబీ సీజన్‌కు ఉపకరించేవే అయినప్పటికీ.. ఖరీఫ్ దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పత్తి, వరి పంటలు చేతికి వస్తున్న తరుణంలో తాజా వర్షాలు రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పలు చోట్ల వరిపైరు నేలరాలింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధాన్యం మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోనున్నారు. మరోవైపు పత్తి పంటకూ పెను ప్రమాదం వచ్చింది. ఇప్పటికే పత్తి కాయలు పగిలి పత్తి బయటకు వస్తోంది. వీలైనంత త్వరలో పత్తిని వేరుచేయాలి. కానీ తాజా వర్షాలతో పత్తి పూర్తిగా తడవడంతో చీడ వచ్చే అవకాశం ఉంది.
విస్తారంగా వర్షం..
రెండ్రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జిల్లాలో సగటు వర్షపాతం 1.84సెంటీమీటర్లుగా నమోదైంది. అత్యధికంగా మహేశ్వరం మండలంలో 6.4సెంటీమీటర్ల వర్షం కురిసింది. కందుకూరు మండలంలో 5సెంటీమీటర్లు, యాలాల మండలంలో 4.6సెంటీమీటర్లు, పూడూరులో 4.3సెంటీమీటర్లు, ధారూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో 3.2సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో సాధారణ వర్షపాతం రికార్డైంది. బుధవారం కూడా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షంకురిసింది.
రెండు రోజులుగా ఎడతెరిపిలేని వర్షం
Published Thu, Oct 24 2013 4:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement