అమ్మే చోట.. అంతా అలుసే! | Drought in the Storage of grain purchase centers | Sakshi
Sakshi News home page

అమ్మే చోట.. అంతా అలుసే!

Published Sat, May 5 2018 3:54 AM | Last Updated on Mon, Oct 1 2018 2:19 PM

Drought in the Storage of grain purchase centers - Sakshi

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మార్కెట్‌లో ధాన్యపు రాశులు

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. గన్నీ సంచులు సరిపోకపోవడం, రవాణా సమస్య నుంచి హమాలీల కొరత, టార్పాలిన్‌లు లేకపోవడం దాకా అంతా గందరగోళం నెలకొంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఈసారి ధాన్యం కొనుగోలు విధానం మొత్తంగా గాడి తప్పింది. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. మరోవైపు మిల్లర్లు ఏవో సాకులు చెబుతూ కేంద్రాల నుంచి ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి దాపురించింది. ఇదే సమయంలో అకాల వర్షాలు, గాలి దుమారం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ఎండకు ఎండి, వానకు నానిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించటంలో, వానకు తడవకుండా రక్షించే చర్యల్లో అధికార యంత్రాంగం విఫలమైంది.

అన్నీ సమస్యలే..
రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. ధాన్యం నింపడానికి సంచులు లేవంటూ చాలా చోట్ల కొనుగోళ్లు నిలిపివేయడం గమనార్హం. గతంలో గన్నీ సంచులను ఉచితంగా సరఫరా చేయగా ఈసారి కొన్నిచోట్ల రూ.5 చొప్పున డిపాజిట్‌ చేయించుకుంటున్నారు. అయినా సంచులు అందడం లేదు. ఇక హమాలీలు సరిపడా లేకపోవడంతోనూ ధాన్యం తూకాల్లో జాప్యం జరుగుతోంది. మొత్తంగా ధాన్యం తెచ్చిన రైతులు నాలుగైదు రోజులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. కొన్ని జిల్లాలో కాంటాలు, తేమ శాతం కొలిచే యంత్రాల కొరత కారణంగా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. చాలా జిల్లాల్లో నిర్దేశిత లక్ష్యం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.

తెగనమ్ముకుంటున్న రైతులు
కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి వేచి చూడాల్సి రావడం, అకాల వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరికి మద్దతు ధర కంటే తక్కువకు బయట దళారులకు, వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. ధాన్యం కాంటా వేసినా లోడింగ్‌ అయ్యే వరకు సంబంధిత రైతుదే బాధ్యత అని చెబుతుండటంతో.. ధాన్యం బస్తాలను తడవకుండా కాపాడుకోవడానికి తంటాలు పడాల్సి వస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తేమ శాతం పేరిట తిరస్కరణ
పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ తిరస్కరిస్తున్నారని రైతులు ఫిర్యాదు చేస్తున్నారు. దాంతో కొందరు కొనుగోలు కేంద్రాల ఆవరణలో ఆరబోస్తుండగా.. మరికొందరు వెనక్కి వెళుతున్నారు. ప్రభుత్వం క్వింటాలు ధాన్యం గ్రేడ్‌ ‘ఏ’రకానికి రూ.1,590, కామన్‌ రకానికి రూ.1,550 మద్దతు ధరగా చెల్లిస్తోంది. ధాన్యం అమ్మిన 48 గంటల్లో చెల్లింపులు చేస్తామని ప్రకటిం చింది. కానీ ఎక్కడాఇది అమలు కావడం లేదని అంటున్నారు.

హమాలీల కొరత అని చెప్పి.. 
ఈ చిత్రంలోని రైతు పేరు మార్క శ్రీకాంత్‌. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ఇప్పల్‌ నర్సింగాపూర్‌కు చెందిన ఆయన.. గత నెల 22న హుజూరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు 110 బస్తాల ధాన్యం తెచ్చారు. కానీ హమాలీల కొరత కారణంగా ఇప్పటికీ ధాన్యం తూకం వేయ లేదు. అధికారులు సంచులు మాత్రం ఇచ్చా రు. రెండు మూడు రోజుల నుంచి గాలి దుమారం, వర్షం పడేలా ఉండటంతో ఆం దోళన చెందుతున్నారు.  
 
ధాన్యం కొంటలేరు 
‘‘ధాన్యాన్ని మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చి.. ఆరు రోజులవుతున్నా ఇంకా కొనలేదు. మొదట రెండు రోజులు బస్తాలు లేవన్నరు. తర్వాత ధాన్యం చూసి తేమ శాతం ఎక్కువగా ఉందన్నరు. ఇప్పటికే వానలతో బస్తాల కింద నీరు నిలిచి ధాన్యం తడిసిపోయింది. కొందరు రైతులకు మాత్రమే టార్పాలిన్లు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నాం..’’    
– తమ్మినేని వెంకటయ్య,ఖమ్మం జిల్లా ఏన్కూరు


టార్పాలిన్లు లేవంటున్నరు.. 
‘‘ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మూడు రోజులైంది. టార్పాలిన్లు లేవంటున్నారు. వర్షం వస్తే రెక్కల కష్టం మొత్తం నీటిపాలయ్యేలా ఉంది..’’
– అత్తి చిన్నయ్య, మంచిర్యాల జిల్లా కొండాపూర్‌

సంచులు లేవని కొంటలేరు.. 
‘‘వరికోతలైన వెంటనే ధాన్యం అమ్ముదామని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లిన. వారం రోజులైంది. కుప్పగా పోసి ఉంచిన. సంచులు లేవంటూ తూకం వేస్తలేరు. సంచులు సరిపడా తెప్పించి తొందరగా కొనుగోలు చేయాలె. వానలు పడుతున్నయ్‌. రైతులను ఇబ్బంది పెట్టొద్దు’’
– ముద్దసాని భీమయ్య, మంచిర్యాల జిల్లా కొర్విచెల్మ

సకాలంలో తూకం వేయక..
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి మండలం రేవనపల్లికి చెందిన మహిళా రైతు సుర్కంటి జ్యోతి రెండు వారాల కింద ఐకేపీ కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చింది. ఆమెకు ఇచ్చిన టోకెన్‌ ప్రకారం 97 సీరియల్‌ వచ్చింది. ఆమె వంతు వచ్చేసరికి పది రోజులకుపైగా సమయం పడుతుంది. దాంతో రోజూ వచ్చి ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తోంది. ధాన్యాన్ని తూర్పార పట్టడానికి 12 మంది కూలీలను పెట్టింది. వారికి ఒక్కొక్కరికి రూ.400 చొప్పున రూ.4,800 చెల్లించింది. అలాగే ఒక్కో రోజుకు రూ.15 చొప్పున 10 టార్పాలిన్‌ కవర్లను కిరాయికి తీసుకొచ్చింది. వీటికి ఇప్పటివరకు రూ.3 వేలకు పైగా ఖర్చు వచ్చింది. ఇక పెరిగిన ఎండలకు ధాన్యంలో 17 తేమ శాతం బాగా తగ్గిపోయి బరువు కోల్పోయే పరిస్థితి నెలకొంది. సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఆమె నష్టపోయింది.

వారం రోజులు వడ్లు కేంద్రంలోనే ఉండే..  
ఎకరం వరి పెడితే బోరులో నీళ్లు లేక సగం ఎండిపోయింది. మా ఊరిలోనే కొనుగోలు కేంద్రం పెట్టడంతో వడ్లు తీసుకొచ్చిన. గురువారం సాయంత్రం తూకం వేయాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా వచ్చిన గాలివానతో అడుగు ఎత్తున నీళ్లు పారి ధాన్యం తడిసి పోయింది. ఇప్పుడా వడ్లు కొనాలంటే.. ఆరబెట్టుకుని తేవాలని అంటున్నరు. వడ్లు ఎండబెట్టినా.. మళ్లీ ఎప్పుడు వాన వస్తదో తెలవడం లేదు..’’
– రంగు రవి, పొట్లపల్లి, హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement