సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) బదిలీలకు తెర వెనుక ‘మంత్రా’ంగం నడుస్తోంది. బదిలీలపై ఆంక్షలున్నప్పటికీ, ఖాళీలను సాకుగా చూపి.. ఎంపీడీఓలకు స్థానచలనం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం పావులు కదుపుతోంది. మొయినాబాద్ ఎంపీడీఓగా పనిచేస్తున్న యాదయ్య ఇటీవల అపార్డ్‌కు బదిలీ అయ్యారు. దీంతో ఖాళీ అయిన ఈ పోస్టును దక్కించుకునేందుకు ఎంపీడీఓల మధ్య రేసు మొదలైంది. ఈ క్రమంలోనే జిల్లా మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తమ కనుసన్నల్లో పనిచేసే అధికారులను ఈ స్థానంలో కూర్చోబెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇదే అదనుగా పలువురు ఎంపీడీఓలు ఈ ఇరువురి ప్రాపకం కోసం పైరవీలు మొదలుపెట్టారు. దీంతో ఎవరి మనసు నొప్పించకుండా అందరికీ సిఫార్సు లేఖలతో ‘సమన్యాయం’ చేస్తున్నారు.
హాట్ సీటు కోసం
నగరానికి చేరువగా ఉన్న ఈ మండల ంపై కన్నేసిన గ్రామీణ ప్రాంత ఎంపీడీఓలు మంత్రి, మాజీ మంత్రి సిఫార్సు లేఖలతో సచివాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. మోమిన్‌పేట ఎంపీడీఓ సువిధ ఐదేళ్ల పదవీకాలం ముగియడంతో ఖాళీగా ఉన్న మొయినాబాద్‌కు బదిలీ చేయాలని మంత్రి ప్రసాద్‌కుమార్‌ను అభ్యర్థిం చడం.. ఆయన సానుకూలంగా స్పందించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఈ మేరకు ఆమె పేరును సూచిస్తూ ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మాజీ మంత్రి సబితతో తన కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ పోస్టింగ్‌కు సిఫార్సు చేయించుకున్నారు. మొయినాబాద్ కుర్చీ కోసం ఇద్దరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అనూహ్యంగా పలువురు ఆశావహులు తెరమీదకు వచ్చారు. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్, గతంలో శంకర్‌పల్లిలో పనిచేసి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సుభాషిణి కూడా ఈ సీటు రేసులో ఉండడం గమనార్హం.
కుర్చీలాట
ఇదిలావుండగా పూడూరు ఎంపీడీఓ సుభాషిణి మొయినాబాద్ సీటు రేసులో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెది తనకు గుర్తెరిగిన కుటుంబం కావడంతో మాజీ మంత్రి సబిత ఆమె నియామకానికి మొగ్గుతున్నట్లు సమాచారం. మంత్రి ప్రసాద్ సిఫార్సు చేసిన సువిధ కు తన నియోజకవర్గంలోని మహేశ్వరం పోస్టు ను ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మండలంలోని గ్రామాలన్నీ నగర పంచాయతీలుగా మారడంతో సరూర్‌నగర్‌లో ఎంపీడీఓ పోస్టు రద్దు అనివార్యమవుతోంది. దీంతో అక్కడ పనిచేస్తున్న శోభారాణిని మొయినాబాద్‌కు బదిలీచేసే అంశాన్ని పరిశీలించాలని సబిత సిఫార్సు చేసినట్లు తెలిసింది. వికారాబాద్ ఎంపీడీఓ వినయ్‌కుమార్‌ను మొయినాబాద్‌కు షిఫ్ట్ చేయాలని స్థానిక ఎమ్మెల్యే కేఎస్.రత్నం జిల్లా యంత్రాంగానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఇలా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో ఎంపీడీఓలు సచివాలయం, జెడ్పీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఉన్నతాధికారులకు చీరాకు తెప్పిస్తోంది. ఎవరికివారు కోరుకున్న చోటుకు పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు సాగిస్తుండడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని యంత్రాంగం భావిస్తోంది.
ఇదీ మూలం
హయత్‌నగర్ ఎంపీడీ ఓ అరుణను రాత్రికేరాత్రే కుత్బుల్లాపూర్‌కు ప్రభుత్వం బదిలీ చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో పనిచేస్తున్న జ్యోతిని ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ ప్రభుత్వ స్థాయిలో తమ పలుకుబడిని ఉపయోగించి కొందరు ప్రత్యేక జీఓలు తెచ్చుకోవడం.. మొయినాబాద్ ఎంపీడీఓ కుర్చీ ఖాళీ కావడం తో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అధికారుల మధ్య కుర్చీలాటకు దారితీసింది. దీంతో గత వారం పదిరోజులుగా బదిలీల వ్యవహారం అధికార వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది.
ఎంపీడీఓల బదిలీల్లో ‘మంత్రాగం!
Published Mon, Nov 18 2013 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement