ఎన్నికల అధికారులకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశం
ఎన్నికల అధికారులకు కలెక్టర్ శ్రీధర్ ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం కావాల్సిన 36 లక్షల బ్యాలెట్ పేపర్ల ముద్రణను బాధ్యతగా స్వీకరించి చేపట్టాలని ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులను కలెక్టర్ బీ.శ్రీధర్ ఆదేశించారు. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై ఎంపీడీఓలు, ప్రత్యేకాధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాదేశిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ పూర్తయినందున బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించాల్సి ఉందన్నారు.
ఈనెల 30లోగా ఆయా మండలాలకు కేటాయించిన తేదీల్లో బ్యాలెట్ పేపర్ల ముద్రణను పూర్తిచేసి పోలీసు బందోబస్తు మధ్య మండల కేంద్రాలకు తరలించిన అనంతరం పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేయాలని సూచించారు. మండల స్థాయిలో ఈనెల 26న, ఏప్రిల్ 1న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామని, వంద శాతం సిబ్బంది తరగుతులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జెడ్పీటీసీ అభ్యర్థి ఎన్నికల ఖర్చు రూ.రెండు లక్షలు, ఎంపీటీసీకి రూ.లక్ష నిర్ధారించినందున అంతకుమించి ఖర్చుచేయకుండా ప్రత్యేక కమిటీలు పర్యవేక్షిస్తాయని చెప్పారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఫిర్యాదులువస్తే 24 గంటలలోగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జేసీ చంపాలాల్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్‌రెడ్డి, డీపీఓ సురేష్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.