వర్ష బాధితులకు తక్షణ సాయం | CM YS Jagan Mandate To District Collectors That Immediate relief to rain victims | Sakshi
Sakshi News home page

వర్ష బాధితులకు తక్షణ సాయం

Published Fri, Nov 12 2021 2:30 AM | Last Updated on Fri, Nov 12 2021 10:23 AM

CM YS Jagan Mandate To District Collectors That Immediate relief to rain victims - Sakshi

సాక్షి, అమరావతి: భారీ వర్షాల బాధితులను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయ, పునరావాస చర్యలను చేపట్టాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయ శిబిరాల్లోని బాధితులకు మంచి ఆహారం అందించడంతో పాటు వారికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని  ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తడ, సూళ్లూరుపేట, మరికొన్ని ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు నెల్లూరుకు, మరో రెండు బృందాలు చిత్తూరుకు చేరుకున్నాయని, కర్నూలులో ఇంకో రెండు బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మంగళగిరిలో కూడా అదనపు బృందాలను సిద్ధం చేశామని, పరిస్థితులను బట్టి వారి సేవలను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
వివిధ జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

సహాయ పునరావాస కేంద్రాలు 
► అవసరమైన చోట సహాయ శిబిరాలను, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. సహాయ శిబిరాల్లో ఉంచిన వారిని బాగా చూసుకోవాలి. వారికి మంచి ఆహారం అందించడంతోపాటు బాధితులకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా వ్యవహరించాలి.
► ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలి.  అవసరమైన మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలి. పీహెచ్‌సీల్లో, ఏరియా ఆస్పత్రుల్లో, జిల్లా ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. 
► బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వారి కోసం ఒక ఫోన్‌ నంబర్‌ను అందుబాటులో ఉంచాలి. బాధితులను ఆదుకోవడంతో పాటు సహాయక చర్యల అమలు కోసం వివిధ విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. ఇందుకు అనుగుణంగా లైన్‌ డిపార్ట్‌మెంట్లను సిద్ధం చేయాలి. ఎస్‌ఓపీల ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వర్షాల అనంతరం కూడా పారిశుధ్యం విషయంలో చర్యలు తీసుకోవాలి.
► ఆహారం, తాగునీటి ప్యాకెట్లను బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేయాలి. అవసరమైన మేరకు వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.

రిజర్వాయర్లు, చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి 
► భారీ వర్షాల కారణంగా రిజర్వాయర్లు, చెరువులకు గండ్లు పడకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
► వర్షాలు, నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ.. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా నీటిని విడుదల చేయాలి. ఇదే సమయంలో తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకోవాలి. ప్రధానంగా రిజర్వాయర్లు, డామ్స్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
► రోడ్లు ఇతరత్రా మౌలిక సదుపాయాలకు ఎక్కడ నష్టం వాటిల్లినా వెంటనే మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. తీవ్ర ప్రభావిత మండలాల్లో అగ్నిమాపక కేంద్రాలను, సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి.
► ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ.. జిల్లాల నుంచి ఆ వివరాలను వెంటనే పంపించాలి. ఫోన్‌కాల్‌కు మేం అందుబాటులో ఉంటాం.. ఇంకా ఏం కావాలన్నా వెంటనే తెలియజేయండి.
► బంగాళాఖాతంలో ఏర్పడ్డ మరో అల్పపీడనం తుపానుగా మారి దక్షిణ కోస్తాంధ్రాలో తీరందాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈనెల 17న ఇది తీరం దాటే అవకాశాలున్నాయని వివరించారు. దీనివల్ల దక్షిణ కోస్తాంధ్రలో మరో విడత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 
► ఈ సమీక్షలో సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి (మైనార్టీ శాఖ) ఎస్‌ బి అంజాద్‌ బాషా, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటే.. వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. అత్యవసర సేవలకు అంతరాయం రాకుండా ముందు జాగ్రత్తగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలి. ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా అధికారులు వెంటనే సంప్రదించాలి. వర్షం ప్రభావిత ప్రాంతాల్లో అన్ని రకాల సహాయ కార్యక్రమాలు వేగంగా అమలయ్యేలా చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement