సమ్మె ఎవరికి కావాలంటే..
ఉద్యోగులు సమ్మె చేయాలని ఎవరూ కోరుకోరు. చంద్రబాబు సీఎం కాలేదన్న బాధ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే సమ్మె కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి కావాలి.. చంద్రబాబు దత్తపుత్రుడికి కావాలి.. మీడియా ముసుగులో వ్యక్తుల పరంగా నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కే సమ్మె కావాలి. ఉద్యోగుల సమ్మె జరుగుతోందంటే వారికి పండగే. కానీ సంధి జరగడంతో ఏడుపు ముఖం పెట్టారు. సమ్మె విరమించారని తెలియగానే పచ్చజెండాల ముసుగులో ఉన్న ఎర్ర సోదరులను ముందుకు తోశారు. ఎదుట ఎర్రజెండా.. వెనుక పచ్చ అజెండా.. ఇదీ పరిస్థితి.
– సీఎం జగన్
సాక్షి, అమరావతి: కోవిడ్ వల్ల రాష్ట్రంలో రెండేళ్లు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉత్పన్నం కాగా ఇప్పుడు కొందరు టీచర్లను రెచ్చగొడుతూ రోడ్డెక్కిస్తే పిల్లల చదువులు ఏం కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆందోళనకు దిగుతున్న వారు తల్లిదండ్రులకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. మూడో ఏడాదీ చదువులను గాలికి వదిలేస్తారా? అని మండిపడ్డారు. రెచ్చగొట్టే నాయకులు, ఎల్లో మీడియా వీళ్లంతా నిజంగా మనుషులేనా? అని ధ్వజమెత్తారు. ఇంత మంచి చేస్తున్నా ప్రభుత్వంపై బురదజల్లడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ధర్మమేనా? అని ప్రజలంతా ఒకసారి ఆలోచన చేయాలని కోరారు. జగనన్న చేదోడు పథకం ద్వారా మంగళవారం లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేసిన అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. గత రెండేళ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు గణనీయంగా వేతనాల పెంపుతో పాటు నిరుద్యోగ యువతకు కొత్తగా ఇచ్చిన ఉద్యోగాల వివరాలను ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
ఒక్క విషయం...
ఇక్కడ ఒక విషయం ఆలోచించమని సవియనంగా కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కోరుకుంటారు? ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు కోరుకోరు. నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా కోరుకోరు. ఈ రెండున్నరేళ్లలో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా లంచాలు, వివక్షకు తావులేకుండా రూ.1.27 లక్షల కోట్లు అందుకున్న ఏ కుటుంబమూ కోరుకోదు. ఏ ఒక్క సామాజిక వర్గమూ కోరుకోదు.
సంతోషంగా సంతకాలు చేసి మళ్లీ..
ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారమయ్యాక ఆ ప్రక్రియలో భాగస్వాములైన వామపక్షాలకు సంబంధించిన సంఘాలు సంతకాలు చేసి సంతోషాన్ని వెలిబుచ్చాయి. కానీ మరుసటి రోజు వామపక్షాల యూనియన్లు, పచ్చ పార్టీల యూనియన్లు పోరుబాట పడతామని, రోడ్డెక్కుతామని అంటుంటే బాధనిపిస్తోంది.
చదువులు ఏం కావాలి?
కోవిడ్ వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహించలేదు. కేవలం పాస్ చేస్తూ పోతున్నాం. ఇది మూడో సంవత్సరం. పరీక్షల సమయం సమీపిస్తున్న వేళ ప్రభుత్వంపై రెచ్చగొట్టేందుకు కొంతమంది టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి?
వాటి బాధ ఏమిటంటే...
ఆశా కార్యకర్తలు రోడ్డు మీదకు వచ్చారని ఈరోజు ఈనాడులో ఫోటో వేశారు. వాళ్లను ఈడుస్తున్నట్లు ఫోటో వేశారు. ఇది ఆ అక్కచెల్లెమ్మల మీద ప్రేమ ఉందని చూపించుకునే అభూత కల్పన. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని ఈనాడు గుండెలు బాదుకోవడం వెనుక పచ్చ అజెండా దాగుంది. నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో చానళ్ల బాధ అంతా ఇంతా కాదు. ఎవరో ఒకరు ఏదో ఒక చోట ఆందోళన చేయండి.. మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి.. మా బాబు పాలనే బాగుందని చెప్పండి.. మీకు మెరుగైన జీతాలు ఇచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాలుగు జెండాలు పట్టుకోండి.. ఇదే వాటి బాధ.
వీడియోకాన్ఫరెన్స్‌లో లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్
ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్ ఇస్తాం. బాగా హైలెట్ చేస్తాం. సోషల్ మీడియాలో ఎవరైనా రాస్తే దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం. టీవీల్లో కూడా చూపిస్తాం.. ఇదీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ధోరణి. నిజంగా ఇవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగినా.. ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ బాధలోనుంచి నవ్వు కూడా వస్తుంది. ఈ స్ధాయికి వీళ్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని సంతోషంగా ఉంటుంది.
రెండున్నరేళ్లలో కొత్తగా 1,84,264 ప్రభుత్వ ఉద్యోగాలు
ఇవాళ మీద్వారా కొన్ని విషయాలు అందరికీ చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2019 వరకు అంటే మన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు 3.97 లక్షల మంది ఉన్నారు. ఈ రెండున్నరేళ్లలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిచ్చిన ఉద్యోగాలు మీరే చూడండి. మన కళ్లెదుటే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.25 లక్షల మంది కనిపిస్తున్నారు.
దశాబ్దాలుగా ఆర్టీసీ ఉద్యోగులు కన్న కలలను నెరవేరుస్తూ దాదాపు 51 వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇక మిగిలినవాటిని కలుపుకొంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,84,264 కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు 3.97 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉండగా ఈ రెండేళ్లలోనే మనం 1,84,264 ఉద్యోగాలు ఇచ్చామంటే ఏకంగా 50 శాతంపై చిలుకు ఉద్యోగాల పెరుగుదల కనిపించడం లేదా? నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్న వారికి, మాట్లాడుతున్న వాళ్లకి ఇవి కనిపించడం లేదా?
మెరుగైన, మంచి జీతాల కోసం ఆప్కాస్
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మోసపోకూడదు, జీతాల కోసం లంచాలిచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమీషన్లు లేకుండా వారికి మెరుగైన, మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి రావాలని ఆప్కాస్ పేరుతో కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. దాదాపు లక్షమందికి పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ బెనిఫిట్స్ అందిస్తున్న ప్రభుత్వం మనది.
ఇతర రాష్ట్రాల్లో పట్టించుకున్నారా?
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడంతో రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతున్నా చిరునవ్వుతో స్వీకరిస్తున్న ప్రభుత్వం మనది. పక్కనే తెలంగాణ, ఇతర రాష్ట్రాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మమ్మల్ని విలీనం చేసుకోవాలని కోరితే ఒక్క ప్రభుత్వం అయినా పట్టించుకుందా? అని అడుగుతున్నా. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగాలని కోరుతున్నా.
టైం స్కేల్‌పై బాబు వంచన..
చంద్రబాబు ఐదేళ్ల పాలన చూశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ ఇస్తామని ఆశ పెట్టారు కానీ ఒక్కరికైనా చేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తున్న ప్రభుత్వం మనది. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు ఏ ఉద్యోగులకు ఎంత జీతం ఇచ్చారో, ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంత ఇస్తుందో అందరికీ తెలిసినా మరోసారి గుర్తు చేస్తున్నా.
ఎక్కడ రూ.1,198 కోట్లు? ఎక్కడ రూ.3,187 కోట్లు?
మన ప్రభుత్వం రాకముందు వరకు 3.07 లక్షల మంది ఉద్యోగులకు సంవత్సరానికి జీతాల ఖర్చు రూ.1,198 కోట్లు అయితే ఈరోజు మన ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు రూ.3,187 కోట్లు. ఎక్కడ రూ.1,198 కోట్లు?... ఎక్కడ రూ.3,187 కోట్లు? ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే ఆందోళన బాట పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు కలసి రాజకీయాలను కల్మషం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలనే ప్రయత్నం జరుగుతోంది.
ఈరోజు ఇన్ని జరుగుతున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. ఆ బలాన్ని దేవుడు ఇవ్వాలని, మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో క్యాంపు కార్యాలయం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment