పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన సభకు హాజరైన విద్యార్థులు, ప్రజలు
పిల్లల బంగారు భవిష్యత్ కోసం తప్పనిసరిగా మీ పిల్లలను బడికి పంపించాలని ప్రతి తల్లినీ కోరుతున్నా. మన పిల్లల బాగు కోరే ప్రభుత్వంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మన పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇందులో భాగంగా తొలి దశలో పిల్లల భవిష్యత్ కోసం వారిని బడికి పంపించినందుకు ప్రోత్సాహ కంగా ఈ నాలుగేళ్లలో ఏకంగా రూ.26 వేల కోట్లు తల్లుల ఖాతాల్లో వేశాం. ఇలా దేశంలోని 28 రాష్ట్రాల్లో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే జరిగింది. ఇకపై కూడా కొనసాగుతుంది. బటన్ నొక్కడం అంటే తెలియని బడుద్దాయిలకు ఈ విషయం అర్థం అయ్యేలా చెప్పండి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వర్గాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రతి ఇంటి నుంచి సత్య నాదెళ్ల రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. తమది చదువుల సంకల్పమని స్పష్టం చేశారు. విదేశీ కాలేజీల్లో సీటు తెచ్చుకుంటే ఫీజు రూ.1.25 కోట్లయినా భరిస్తామని హామీ ఇచ్చారు. జగనన్న అమ్మఒడి నాలుగో సంవత్సరానికి సంబంధించి 42,61,965 మందికి లబ్ధి చేకూరుస్తూ రూ.6,392.94 కోట్ల ఆర్థిక సాయాన్ని బటన్ నొక్కి విడుదల చేశారు.
ఈ సందర్భంగా బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన బహిరంగ సభలో అశేష జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమ పిల్ల లు తమకంటే గొప్పగా ఉండాలని, తాము పడిన కష్టాలు పిల్లలకు రాకూడదని తల్లిదండ్రులందరూ కోరుకుంటారన్నారు. పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడాలని, ప్రపంచాన్నే ఏలే పరిస్థితిలోకి పిల్లలు రావాలనే గట్టి సంకల్పంతో ఈ నాలుగేళ్లుగా మీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేసిందని చెప్పారు.
అందులో భాగంగానే అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తున్నామని, నాలుగో ఏడాది కార్యక్రమాన్ని కురు పాం వేదికగా ప్రారంభిస్తున్నామన్నారు. పది రోజులపాటు ప్రతి మండలంలోనూ పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని, విద్యార్థులతో ప్రజా ప్రతినిధులంతా మమేకమవుతారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి 12వ తరగతి దాకా పిల్లలను చదివిస్తున్న 42 లక్షల 62 వేల మంది అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నా మని చెప్పారు.
తద్వారా 83 లక్షల 15 వేల మంది విద్యార్థులకు మంచి చేస్తున్నామని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియ ర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా తల్లులకు అమ్మఒడి వర్తింపజేస్తున్నామని, ఈ ఒక్క పథకం ద్వారా నాలుగేళ్లలో ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
కళ్లెదుటే మార్పు కనిపిస్తోంది
► గవర్నమెంట్ బడులన్నింటిలో ఇంగ్లిష్ మీడి యం ప్రవేశపెట్టాం. బడులు ప్రారంభం కాగానే మెరుగైన విద్యాకానుక కిట్లను ప్రతి పిల్లాడు, ప్రతిపాప చేతిలో పెడుతున్నాం. క్లాస్ టీచర్లకే దిక్కులేని పరిస్థితి గతంలో చూశాం. ఈ నాలుగేళ్ల కాలంలో మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీ చర్లు ఉండేలా అడుగులు పడ్డాయి. 3వ తర గతి నుంచే పిల్లలకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ టోఫెల్ కరిక్యులమ్ తీసుకొచ్చింది కూడా ఈ ప్రభుత్వంలోనే. పిల్లలకు చక్కగా అర్థమయ్యేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలు మొట్టమొదటిసారిగా ఇస్తున్నాం. బైజూస్ కంటెంట్‌ను కూడా మన పాఠాలతో అనుసంధానం చేయడం మీ జగన్ మామ ప్రభుత్వంలోనే జరిగింది.
► 6వ తరగతి నుంచే ప్రతిక్లాస్ రూమ్‌ను డిజిటలైజ్ చేశాం. ఐఏఎఫ్‌తో డిజిటల్ బోధనను స్కూల్స్‌లోకి తీసుకొచ్చాం. రోజుకొక మెనూతో చిక్కీ, రాగిజావ కూడా గోరుముద్దగా ఇస్తున్నాం. పౌ ష్టికాహారం అందించేలా అంగన్‌వాడీల్లోనూ మా ర్పులు తెచ్చాం. గర్భిణులు, బాలింతలు, పిల్ల లకు సంపూర్ణ పోషణ అమలు చేస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషణ ప్లస్ కూడా అమలు చేస్తున్నాం.
► నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాం. 8వ తరగతి పిల్లలకు, టీచర్లకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా విద్యను అందించేలా ట్యాబ్స్ అందిస్తున్నదీ మీ మేనమామ ప్రభుత్వమే. ఆడపిల్లల కోసం స్వేచ్ఛ అనే పథ కాన్ని అమలు చేస్తున్నాం. పెద్ద చదువుల కోసం వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జగనన్న విద్యా దీవెన ఇస్తోంది మీ మేనమామ ప్రభుత్వంలోనే. మెస్, హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కార్యక్రమాన్నీ అమలు చేస్తున్నాం.
ఇంకా గొప్పగా చదవాలి
► పిల్లలు ఇంకా గొప్పగా చదవాలి. ప్రతి కుటుంబం నుంచి సత్యనాదెళ్ల రావాలి. విదేశాల్లో చదవాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందులు ఉండకూ డదనే విదేశీ విద్యా దీవెన పథకం తీసుకొచ్చాం. ప్రపంచంలోనే టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టిస్‌లో ఎక్కడ..ఏ సీటు వచ్చినా రూ.1.25 కోట్ల ఫీజు వరకు పూర్తిగా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. జీవితంలో చదువు అవసరాన్ని చెప్పేందుకే పదో తరగతి పూర్తి చేసి ఉండాల్సిందే అన్న నిబంధనతో వైఎస్సార్ కల్యాణమస్తు–షాదీ తోఫా అమలు చేస్తున్నాం. ఈ నాలుగేళ్లలోనే కేవలం విద్యా రంగంలో సంస్కరణల కోసం రూ.66,722 కోట్లు ఖర్చు చేశాం.
గవర్నమెంట్ బడి వెలుగుతోంది..
► గత ప్రభుత్వం దాదాపు కోటి మంది పిల్లలకు చేసిన అన్యాయం క్షమించగలమా? విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో చదువుల్లో అంటరానితనాన్ని తుదముట్టించడం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. ఒకప్పుడు పెత్తందార్లకు మాత్ర మే అందుబాటులో ఉన్న ఆ చదువుల కన్నా గొ ప్ప చదువులు పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులకు తీసుకొచ్చాం. ప్రైవేట్ బడులకు తీసిపోకుండా పోటీపడే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో వచ్చింది. పెత్తందారీ విధానా న్ని బద్దలుగొట్టి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదల పిల్లలు గొప్ప చదువులకు వెళ్లేలా చేశాం. గవర్నమెంట్ బడుల్లో ఆణిముత్యాలుంటాయని, వజ్రాలు, రత్నాలు మెండుగా పుట్టే విద్యా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నాలుగేళ్లలో మీ మేనమామ ప్రభుత్వంలోనే.
► పేదల కుటుంబాల్లో వెలుగులు నింపేలా గవర్నమెంట్ బడి వెలుగుతోంది. టెన్త్ పరీక్షల్లో గవర్నమెంట్ స్కూళ్ల నుంచి టాప్ 10 ర్యాంకులు గతేడాది 25 రాగా, ఈ ఏడాది ఏకంగా 64కు పెరిగాయి. 75%కి పైగా మార్కులతో డిస్టింక్షన్ సాధించిన విద్యార్థుల సంఖ్య గత ఏడాది 63,275 ఉంటే, ఈ ఏడాది ఆ సంఖ్య 67,114కు పెరిగింది. 66.50% ఫస్ట్ క్లాస్‌లో పాసైతే ఈసారి 70.16%కి పెరిగారు. 67 మంది పిల్లలకు ఐఐటీ, ఎన్‌ఐటీ, నిఫ్ట్, సెంట్రల్ వర్సిటీల్లో అడ్మిషన్లు దొరికే అవకాశం ఈ సంవత్సరం రాబోతోంది.
► బాబు హయాంలోని 2018–19లో ప్ర భుత్వ స్కూళ్లలో చేరిన విద్యార్థుల సంఖ్య గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో 84.48% తో ఏపీ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉండింది. ఇప్పుడు 100.80%తో మెరుగైంది. జాతీయ సగటు 100.13% కంటే ఎక్కువగా ఉన్నాం. ఇది విద్యా రంగంలో మనం చూపించిన శ్రద్ధకు దక్కిన ఫలితం.
ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
► గిరిజన ప్రాంతంలో ఒకప్పుడు వైద్యానికి దిక్కులేని పరిస్థితి. ఇప్పుడు ఐదు ఐటీడీఏల పరిధిలో ఐదు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు కడుతున్నాం. కురుపాం నియోజకవర్గంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని వేగంగా నిర్మిస్తున్నాం. ఇదే నియోజకవర్గంలో మరో మెడికల్ కాలేజీ రాబోతోంది.
► ఉత్తరాంధ్రకు సంబంధించిన గిరిజన ప్రాంతంలో కొత్తగా కురుపాం, పాడేరు, నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు రాబోతున్నాయి. నాలుగోది విజయనగరంలో నిర్మాణంలో ఉంది. వచ్చే నెలలో ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయబోతున్నాం.
గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నాం
► గిరిజనులను గుండెల్లో పెట్టుకున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులుంటే వారిలో మొట్టమొదటి గిరిజన డిప్యూటీ సీఎంగా ఈ రాష్ట్రంలో పనిచేసిన చరిత్ర నా సోదరి, కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణిది. ఇప్పుడు మరో గిరిజనుడు పీడిక రాజన్నదొర డిప్యూటీ సీఎంగా పని చేస్తున్నారు. ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని సకాలంలో వేసిన చరిత్ర మనదే.
► నవరత్నాలను మారుమూల గిరిజన గ్రామాలకు చేర్చాలని తపన పడుతున్నాం. ఒక్క కురుపాం నియోజకవర్గంలోనే 118 టవర్లను ఒక్కొక్కటి రూ.80 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేశాం. గిరిజనుల్లో ఏకంగా 1,47,242 కుటుంబాలకు మేలు చేస్తూ ఆర్వోఎఫ్‌ఆర్ డీకేటీ పట్టాలు ఇచ్చాం. వారికి 3,62,737 ఎకరాలను పంచి పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే.
► కురుపాం నియోజకవర్గంలోనే 21,311 కుటుంబాలకు 38,798 ఎకరాలు పంపిణీ చేశాం. వాళ్లందరికీ వైఎస్సార్ రైతు భరోసా సొమ్మును గత నాలుగేళ్లుగా ఇస్తున్నాం. నామినేటెడ్ పదవి అయినా, కాంట్రాక్ట్ అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కచ్చితంగా 50 శాతం కేటాయించాలని చట్టం చేశాం. మన కళ్లెదుటే గ్రామ సచివాలయాల్లో 1.30 లక్షల మంది ఉద్యోగులుగా ఉన్నారు. వారిలో నా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు 84 శాతం మంది కనిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment