నేడు రెండో ఏడాది జగనన్న అమ్మ ఒడి | CM Jagan To Deposit Amma Vodi Scheme Funds To Beneficiaries On 11th Jan | Sakshi
Sakshi News home page

అమ్మలకు అండగా.. జగనన్న అమ్మ ఒడి

Published Mon, Jan 11 2021 3:16 AM | Last Updated on Mon, Jan 11 2021 9:17 AM

CM Jagan To Deposit Amma Vodi Scheme Funds To Beneficiaries On 11th Jan - Sakshi

సాక్షి, అమరావతి: ‘నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..’ అంటూ పాదయాత్రలో చెప్పిన ప్రతిమాటను అక్షరాలా అమలు చేసి చూపిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా రెండో ఏడాది కూడా విజయవంతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మాట ఇచ్చారంటే నెరవేర్చడమే లక్ష్యంగా ప్రతి అడుగూ ముందుకేస్తున్నారు. నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన జగనన్న అమ్మ ఒడి రెండో ఏడాది చెల్లింపులను సోమవారం నెల్లూరులో ప్రారంభించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమ్మఒడి పథకానికి ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ పథకాన్ని ముందుగా 1–10 తరగతుల విద్యార్థులకు ప్రవేశపెట్టినా, అనంతరం ఇంటర్‌ వరకూ వర్తింపజేశారు. మొత్తంగా గతేడాది జనవరి 9న దాదాపు 43 లక్షల మంది తల్లుల ఖాతాల్లో సుమారు రూ.6336.45 కోట్లు జమ చేశారు. 

ఈ ఏడాది మరింత మందికి ప్రయోజనం 
– ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా ఈ ఏడాది ప్రభుత్వం నిబంధనలు సడలించింది. కోవిడ్‌–19 పరిస్థితుల్లో విద్యార్థులకు 75 శాతం హాజరు నిబంధనకు మినహాయింపు ఇచ్చింది.
– కుటుంబ ఆదాయ పరిమితి గతంలో గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6,250 ఉంటే, ఈ ఏడాది గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు చేశారు.
– గతంలో రెండున్నర ఎకరాల మాగాణి, మెట్ట భూమి 5 ఎకరాలలోపు పరిమితి ఉండగా, ఈ ఏడాది మాగాణి 3 ఎకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలుగా మార్పు చేశారు.
– విద్యుత్‌ వినియోగానికి సంబంధించి నెలకు గతంలో 200 యూనిట్లలోపు వాడే వాళ్లను అర్హులుగా గుర్తిస్తే.. ఈ దఫా 300 యూనిట్ల వినియోగమున్నవాళ్లను కూడా అర్హులుగా గుర్తించారు. 
– గతంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పథకాన్ని వర్తింపజేయలేదు. ఈ దఫా పారిశుద్ధ్య కార్మికులను అందులో నుంచి మినహాయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఈ ఏడాది అమ్మఒడి వస్తుంది. 
– గతంలో ఫోర్‌ వీలర్‌ (కారు) ఉన్న కుటుంబాల్లో టాక్సీ కలిగి ఉన్న వారికే మాత్రమే మినహాయింపు నివ్వగా, ఈ దఫా ట్రాక్టర్లు, ఆటోలున్నవారినీ ఈ పథకం కింద లబ్ధిదారులుగా గుర్తిస్తున్నారు. 
– గతంలో మున్సిపాల్టీలలో 750 చదరపు అడుగుల లోపు స్థిరాస్థి ఉన్న వారిని పథకంలో అర్హులుగా గుర్తించగా, ఈ దఫా 1,000 చదరపు అడుగుల స్థలం ఉన్న వారిని కూడా అర్హులుగా గుర్తిస్తున్నారు. 
– వీటన్నింటి దృష్ట్యా ఈ ఏడాది అమ్మఒడి ద్వారా 44 లక్షల 48 వేల 865 మంది తల్లులకు లబ్ధి చేకూరనుంది. నెల్లూరులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.6,673 కోట్లు జమ చేయనున్నారు. 

కోవిడ్‌ 19 నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు
– కోవిడ్‌ విపత్తు నేపథ్యంలో అమ్మఒడి పేదల పాలిట కవచంలా నిలిచింది. రాష్ట్రంలో సుమారు 43 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 వేలు చొప్పున జమ చేయడం ద్వారా ఆయా కుటుంబాల్లో వెలుగులు నింపింది.  
– కోవిడ్‌ ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. 9, 10 తరగతులకు నవంబర్‌ 23 నుంచి.. 7, 8 తరగతులకు డిసెంబర్‌ 14 నుంచి తరగతులు మొదలయ్యాయి. 
– జనవరి 18 నుంచి ఆరో తరగతి విద్యార్థులకు తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. అప్పటి పరిస్థితులను బట్టి ఒకటో తరగతి నుంచి 5 వరకు తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే విద్యార్థులకు వివిధ రకాల ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫాంల సహకారంతో పాఠ్యాంశాల బోధనకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది.

మనబడి నాడు–నేడు
– పాఠశాలల్లో విద్యా వాతావరణాన్ని సమూలంగా మార్పు చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం మనబడి నాడు–నేడుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో సుమారు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 151 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 3,287 ప్రభుత్వ హాస్టళ్లు, 55,607 అంగన్‌వాడీ కేంద్రాల రూపు రేఖలు మూడేళ్లలో సమూలంగా మారనున్నాయి. 
– ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.14 వేల కోట్లు ఖర్చు చేయనుంది. తొలివిడతలో భాగంగా 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద గత నవంబర్‌ 14న పనులు ప్రారంభించింది. 
– రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యంతో పరిశుభ్రమైన మరుగుదొడ్లు,  ట్యూబులైట్లు, ఫ్యాన్లతో విద్యుదీకరణ, మంచినీటి సరఫరా.. ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు ఫర్నిచర్,  పాఠశాలకు పూర్తి స్థాయిలో పెయింటింగ్, అన్ని రకాల మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డ్స్, ఇంగ్లిష్‌ ల్యాబ్, పాఠశాల చుట్టూ ప్రహరీ, కిచెన్‌ షెడ్స్‌ను ఏర్పాటు చేస్తారు. పాఠశాల విద్యా కమిటీలు ఈ పనులన్నింటినీ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. 
– ఫలితంగా ఈ ఏడాది ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా 6 లక్షల మంది విద్యార్థులు చేరారు. మొత్తంగా విద్యార్థుల సంఖ్య 84 లక్షలకు చేరింది.   

ఇంగ్లిష్‌ మీడియం విద్య
పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో రాణించేందుకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్ధాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియంలో విద్యా బోధన దిశగా అడుగులు వేసింది. 

జగనన్న గోరుముద్ద
– ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 45,484 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో దాదాపు 37 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం, ప్రతిరోజూ మెనూ మార్చి రుచికరమైన, ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనం అందిస్తోంది. 
– కోవిడ్‌ సమయంలో కూడా వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే డ్రై రేషన్‌ పంపిణీ చేశారు. గత ప్రభుత్వం ఏటా దాదాపు రూ.520 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్‌ ప్రభుత్వం రూ.1,456 కోట్లు ఖర్చు చేసింది. 

జగనన్న విద్యా కానుక
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటి నుంచి పదవ తరగతి వరకు చదువుతున్న ప్రతి విద్యార్థికి బడులు తెరిచే సమయానికి కుట్టుకూలితో సహా 3 జతల యూనిఫారాలు, స్కూల్‌ బ్యాగ్, టెక్టŠస్‌ బుక్స్, నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్, బెల్ట్, సాక్స్, షూస్‌ అందించింది.

పాఠశాలల్లో పారిశుద్ధ్యం
– నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం టాయిలెట్ల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించింది. 
– ఇందులో భాగంగా అమ్మ ఒడి లబ్ధిదారులకు అందించే రూ.15 వేలు నుంచి రూ.1,000ని జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని టాయిలెట్‌ నిర్వహణ ఫండ్‌కు జమ చేస్తుంది. ఈ సామ్ము ఆయా పాఠశాలల్లో టాయిలెట్‌ నిర్వహణ ఫండ్‌ కోసం వాడతారు.

వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలు
ఫిబ్రవరి 1 నుంచి మొత్తం 55,607 అంగన్‌వాడీల్లో ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2, ప్రీ ఫస్ట్‌ క్లాసు తరగతులు ఉంటాయి. పౌష్టికాహారం, ఆట పాటలు.. ఇంగ్లిష్‌ మీడియంలో బోధనతో 8.5 లక్షల మంది చిన్నారుల  మానసిక వికాసానికి గట్టి పునాది వేయనున్నారు.  

జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన
– పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా డిగ్రీ, మెడిసిన్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ, పేద విద్యార్థులకు రూ.4,101 కోట్ల వ్యయంతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తోంది. 
– ఈ విద్యార్థులందరి వసతి, భోజనం కోసం ఒక్కొక్కరికి రూ.20 వేల వరకు జగనన్న వసతి దీవెన పథకం కింద ఏటా రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తోంది.  
 
ఏడాదిగా విద్యా రంగంపై చేసిన వ్యయం 
– జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా 44,48,865 మంది లబ్ధిదారులకు రూ,13,023 కోట్లు
– జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా 18,51,043 లబ్ధిదారులకు రూ.4,101 కోట్లు 
– జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మంది లబ్ధిదారులకు రూ.1,220.99 కోట్లు 
– జగనన్న విద్యా కానుక ద్వారా 42,34,322 మంది లబ్ధిదారులకు రూ.647.85 కోట్లు 
– జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మంది లబ్ధిదారులకు రూ.1,456 కోట్లు  
– పాఠశాలల్లో నాడు–నేడు తొలిదశ కింద ఇప్పటి వరకు రూ.2,248 కోట్లు  
– వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద 30,16,000 మంది లబ్ధిదారులకు రూ.1863.13 కోట్లు 
మొత్తంగా 1,87,95,804 మంది లబ్ధిదారులకు గత 12 నెలల కాలంలో జగన్‌ ప్రభుత్వం రూ.24,559.97 కోట్లు ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఏటా బకాయిలు పెడుతూ.. మొత్తంగా ఖర్చు చేసిన వ్యయం కేవలం రూ.3,875.93 కోట్లు మాత్రమే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement