ఏపీ అభివృద్ధిపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక ఆదాయ వృద్ధి 12 శాతం
రెవెన్యూ రాబడిలో 11% సంక్షేమ పథకాలకు వ్యయం
ఏటా 47 లక్షలమంది పిల్లలకు జగనన్న విద్యా కానుక
అమ్మ ఒడితో తల్లుల ఖాతాల్లోకి ఏటా రూ.6,450 కోట్లు
వైఎస్సార్ చేయూతతో మహిళలకు ఏటా రూ.5,060 కోట్లు
పొదుపు మహిళలకు సున్నా వడ్డీ కింద రూ.4,969 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పౌరుల ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రశంసించింది. ఏపీతో పాటు మహారాష్ట్ర, కేరళ, కర్నాటక తమ ఆదాయ రాబడుల్లో సంక్షేమ పథకాల కోసం గణనీయంగా వ్యయం చేశాయని పేర్కొంది. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలకు చేసిన వ్యయాలపై రీసెర్చ్ నివేదికను ఎస్‌బీఐ సోమవారం విడుదల చేసింది. దేశం సంక్షేమ రాజ్యంగా మారుతున్నట్లు కనిపిస్తోందని తెలిపింది. వైఎస్ జగన్ ప్రభుత్వం మహిళలు, పిల్లల విద్య, ఆరోగ్యంతో పాటు సాధికారత దిశగా సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేసినట్లు నివేదిక విశ్లేషించింది.
⇒ ఏపీలో గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను రీసెర్చ్ నివేదిక వ్యయంతో సహా ప్రముఖంగా ప్రస్తావించింది. ఏటా 47 లక్షల మంది పిల్లలకు జగనన్న విద్యా కానుక కింద యూనిఫాం, బ్యాగ్, బూట్లు, పాఠ్యపుస్తకాలు తదితరాలను ఉచితంగా అందచేశారని పేర్కొంది. జగనన్న అమ్మ ఒడి కింద పిల్లల తల్లుల ఖాతాల్లో పారదర్శకంగా నగదు జమ చేశారని, ఇవన్నీ మహిళలు, పిల్లల విద్యతో ముడిపడి రూపొందించిన సంక్షేమ పథకాలని తెలిపింది. మహిళల ఆర్ధికాభివృద్ధే లక్ష్యంగా అర్హత కలిగిన ప్రతి మహిళకూ వైఎస్సార్ చేయూత పథకాన్ని అందించారని, పేద మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారని వెల్లడించింది.
జగనన్న గోరు ముద్ద ద్వారా సుమారు 43 లక్షల మంది స్కూలు పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పౌష్టికాహారాన్ని అందించారని, చిన్నారుల్లో పౌష్టికాహార లోపాలను నివారించడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించింది. పొదుపు సంఘాల మహిళల (ఎస్‌హెచ్‌జీ) సాధికారతే లక్ష్యంగా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేశారని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత లక్ష్యంగా రూపొందించిన ఈ పథకాలు దేశ ఆర్ధికాభివృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొంది.
⇒ ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 12 శాతం వృద్ధి నమోదు కాగా అందులో 11 శాతం మేర సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు రీసెర్చ్ నివేదిక తెలిపింది. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు 10 శాతం వృద్ధి చెందగా అందులో 11 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. ఒడిశాలో ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల్లో వృద్ధి 13 శాతం కాగా అందులో 8.10 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేసినట్లు తెలిపింది.
కేరళలో గత ఐదేళ్లలో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం నమోదు కాగా అందులో 8 శాతం సంక్షేమ పథకాలకు వ్యయం చేశారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి కంటే సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. కర్నాటకలో సగటు వార్షిక రెవెన్యూ రాబడులు వృద్ధి 8 శాతం ఉండగా పధకాలకు కేటాయింపులు 15 శాతం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో సగటు వార్షిక రెవెన్యూ రాబడుల వృద్ధి 8 శాతం ఉండగా పథకాలకు కేటాయింపులు 10 శాతంగా ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment