అయినకాడికి పంట అమ్ముకుంటున్న దైన్యం
మరోపక్క మార్కెట్‌లో పేలుతున్న ధరలు
గిట్టుబాటు ధరలపై గుడ్లప్పగించి చూస్తున్న సర్కారు
అటు అన్నదాతలకు ఇటు వినియోగదారులకు ఊరట లేదు
గరిష్టంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడి
వైఎస్సార్ జిల్లాలో సగటున క్వింటా రూ.1,000.. కర్నూలులో సగటున క్వింటాకు రూ.1,500–రూ.3,000
దళారీల పాలవుతున్న రైతు కష్టం..
వేధిస్తున్న కూలీలు, కాటాల కొరత..
సరిపడా వాహనాలు లేక రోజుల తరబడి పడిగాపులు
రోజు విడిచి రోజు క్రయవిక్రయాలకు అనుమతి
ఫలితంగా టన్నుకు 100 కిలోలు
నష్టపోతున్న అన్నదాతలు.. గతంలో ఈ దుస్థితి ఎప్పుడూ లేదంటున్న ఉల్లి రైతన్నలు
ఐదేళ్లలో రికార్డు స్థాయిలో క్వింటా రూ.13 వేలకు పైగా..
సాక్షి, అమరావతి: ఉల్లి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు వరదలు, భారీ వర్షాలు లాంటి వైపరీత్యాలకు ఎదురొడ్డి సాగు చేసిన పంటను దళారులు అడిగిన రేటుకు విక్రయించాల్సి రావడం... ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో హతాశులవుతున్నారు.
ఒకపక్క బయట మార్కెట్‌లో ఉల్లి ధరలు దిగి రావడం లేదు. మరోపక్క రైతన్నలు గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్నాడు. వెరసి అటు వినియోగదారులకు ఇటు అన్నదాతలకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉల్లి పంటకు పేరుపొందిన కర్నూలు జిల్లాలో సౌకర్యాలు లేక నష్టపోతుంటే వైఎస్సార్ కడప జిల్లాలో గిట్టుబాటు ధర లభించక నష్టాల పాలవుతున్నారు.
1.72 లక్షల ఎకరాల్లో సాగు..
రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు కాగా, ఈ ఏడాది 1.72 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో 70 శాతానికి పైగా కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. ఈ ఒక్క జిల్లాలోనే ఈ ఏడాది 1.12 లక్షల ఎకరాల్లో ఉల్లి సాగైంది. ఆ తర్వాత వైఎస్సార్, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగులో ఉంది. మూడు నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి వ్యయం అవుతుంది.
ఖరీఫ్‌లో 8–10 టన్నులు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొస్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఖరీఫ్ సీజన్‌లో కర్నూలు, అనంతపురం జిల్లాలలో మినహా మిగిలిన చోట్ల అధిక వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాస్త ఆశాజనకంగా ఎకరాకు 100 క్వింటాళ్ల దిగుబడులొచ్చాయి.
అలాగే ఎన్నడూ లేని విధంగా మార్కెట్‌లో కిలో రూ.50 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. దీంతో రైతులు తమకు మంచి ధర వస్తుందని ఆశగా ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఉల్లి సాగుచేశారు. తీరా పంట మంచిగా ఎదిగే సమయంలో వర్షాభావంతోపాటు భారీ వర్షాలు, వరదల ప్రభావానికి గురై 30 నుంచి 40 శాతం వరకు దెబ్బతిన్నది.
అయినా మార్కెట్‌లో రికార్డు స్థాయిలో ధర ఉండటంతో మిగిలిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందని ఆశగా ఎదురు చూశారు. పంట చేతికొచ్చే సమయంలో దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తుండటం, సౌకర్యాల లేమితో మార్కెట్‌కు తీసుకువెళ్లిన పంట దెబ్బతినడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.
కోతలు మొదలైనప్పటి నుంచి కష్టాలు
కోతకొచ్చిన పంట మార్కెట్‌కు రావడం మొదలైన దగ్గర నుంచి ఉల్లి రైతుకు కష్టాలు మొదలయ్యాయి. పెరిగిన విస్తీర్ణం, దిగుబడులను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈనామ్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలకు తోడు కాటాలు, కూలీల కొరత ఉల్లి రైతుల ఆశలను దెబ్బతీసింది. కర్నూలు మార్కెట్ యార్డుకు రోజుకు 26 వేల క్వింటాళ్ల పంట వస్తుండగా ఆ స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు రోజుల తరబడి మార్కెట్‌లో పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
సర్వర్ సమస్యల కారణంగా టెండర్లలో తీవ్ర జాప్యం చోటు చేసుకోవడంతో టన్నుకు 50–100 కేజీల వరకు ఉల్లి దెబ్బతినడంతో ఆ మేరకు నష్టపోయారు. కర్నూలు యార్డు పరిధిలో ఈ సీజన్‌లో గరిష్టంగా క్వింటాకు రూ.4,300 ధర లభించగా, సగటున రూ.1,500 నుంచి రూ.3 వేల చొప్పున ధర లభించింది.
రోజు విడిచి రోజు విక్రయాలు
ఈనామ్‌లో సాంకేతిక సమస్యను అధిగమించేందుకు వారం పట్టింది. అదేవిధంగా వాహనాలు, కాటాలు సమకూర్చలేక తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రోజు విడిచి రోజు ఉల్లి విక్రయాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైఎస్సార్ జిల్లాలో 15 వేల ఎకరాలకు పైగా ఉల్లి సాగవుతోంది. వర్షాల వల్ల పంట దెబ్బతింది. క్వాలిటీ లేదనే సాకుతో ఇక్కడ క్వింటాకు గరిష్టంగా రూ.1,500 ధర లభించగా, సగటున రూ.వెయ్యికి మించి దక్కడం లేదు.
ఉల్లి రైతుకు అండగా జగన్ సర్కారు
ఒక జిల్లాలో ఒక పంట పథకం కింద ఉల్లి ఎక్కువగా సాగయ్యే జిల్లాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 25 టన్నుల సామర్థ్యంతో ఒక్కొక్కటి రూ.1.75 లక్షల అంచనా వ్యయంతో మల్టీ యుటిలిటీ కేంద్రాలను నిర్మించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 600కి పైగా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉల్లి ఉత్పత్తిదారుల సంఘాలకు 75% సబ్సిడీతో సోలార్ పాలీ డ్రయర్లు, వాహనాలు, 50% సబ్సిడీపై ఉల్లి డీ టాపింగ్ మిషన్లు, ఉల్లి సీడ్ డిబ్లర్స్‌తో 40% సబ్సిడీపై సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లను గత ప్రభుత్వం సమకూర్చింది.
దేశంలో ఎక్కడా లేని విధంగా క్వింటాకు రూ.770 కనీస మద్దతు ధర ప్రకటించింది. ధర తగ్గిన సందర్భాల్లో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకుంది. ధరలు పెరిగిన సందర్భాల్లో షోలాపూర్ మార్కెట్ నుంచి ఉల్లిని కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగదారులపై భారం పడకుండా అండగా నిలిచింది.
గత ప్రభుత్వ హయాంలో క్వింటాకు రికార్డు స్థాయిలో రూ.13 వేలకు పైగా ధర లభించింది. కిలో రూ.2 నుంచి రూ.4 మించి ధర లేని సమయంలో కిలో రూ.6 నుంచి రూ.10 మధ్య ధర చెల్లించి రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ లెక్కన టన్నుకు రూ.6 వేల నుంచి రూ.10 వేల దాకా వెచ్చించింది. ఇలా ఐదేళ్లలో రూ.64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని కొనుగోలు చేయగా, 2014–19 మధ్య టీడీపీ హయాంలో కేవలం రూ.6.38 కోట్లు వెచ్చించి 4,900 టన్నుల ఉల్లిని మాత్రమే కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment