గృహ నిర్మాణాల్లో నిర్లక్ష్యం | Prakasam Collector Video Conference | Sakshi
Sakshi News home page

గృహ నిర్మాణాల్లో నిర్లక్ష్యం

Published Fri, Mar 16 2018 9:33 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Prakasam Collector Video Conference - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వినయ్‌చంద్‌

ఒంగోలు టౌన్‌: ‘2016 నుంచి 2018 వరకు వివిధ రకాల పథకాల కింద జిల్లాలో 9,692 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించాం. ఇప్పటి వరకు కేవలం 1298 గృహాలు మాత్రమే పూర్తి చేశారు. గృహ నిర్మాణాల్లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. నెలాఖరుకు పెండింగ్‌లో ఉన్న 8394 గృహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి. పనితీరు మెరుగుపరచుకొని లక్ష్యాలను సాధించకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటాం’ అని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి అన్ని మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిర్దేశించిన గృహ నిర్మాణాల లక్ష్యాలను పంచాయతీ స్థాయిలో మిషన్‌ మోడ్‌లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంపీడీఓలు వారి పరిధిలో సమర్ధవంతంగా నాయకత్వం వహించి లక్ష్యాలను సాధించాలన్నారు. తహసీల్దార్లు గృహ నిర్మాణసంస్థ ఇంజినీర్లను సమన్వయం చేసుకోవాలన్నారు.

గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రతిరోజూ రెండు గంటలు గృహ నిర్మాణాలకు కేటాయించి పురోగతి సాధించాలన్నారు. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ప్రతిరోజూ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఎంఎస్‌ఓలు, గృహ నిర్మాణసంస్థ ఇంజినీర్లతో సమీక్షించాలన్నారు. చీరాల, యర్రగొండపాలెం వంటి మండలాలు లక్ష్యసాధనలో వెనుకబడ్డాయన్నారు. చురుకుగా ఉన్న లబ్ధిదారులను ఎంíపిక చేసి వారిచేత ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయించాలన్నారు. సాధికార మిత్రలను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. ఉగాది తర్వాత మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమం ద్వారా గృహ నిర్మాణాలను అందరి భాగస్వామ్యంతో పెద్దఎత్తున చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన సిమెంట్, తదితర సామగ్రితోపాటు మేస్త్రిలు, బేల్దారులు కూడా సిద్ధం చేసుకోవాలన్నారు.

పించన్ల జాబితాలు పంపని ఎంపీడీఓలను సస్పెండ్‌ చేస్తా
జన్మభూమి – మాఊరు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గానికి రెండు వేల చొప్పున పింఛన్లు మంజూరయ్యాయని, పింఛన్ల జాబితాను ఈనెల 16వ తేదీ నాటికి ప్రభుత్వానికి పంపించాలని, ఏ మండలం నుంచి పూర్తి స్థాయిలో జాబితాలు రాకుండా ఉంటాయో ఆ ఎంపీడీఓను సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం పింఛన్లను ఈనెల 13వ తేదీ వరకు పంపిణీ చేశారని, వచ్చే నెలలో 5వ తేదీ నాటికి నగదు కొరత లేకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి పంపిణీ చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 20,158 మంది పింఛన్‌దారుల పేర్లు ఇప్పటి వరకు ప్రజాసాధికార సర్వేలో నమోదు కాలేదని, పేరు లేకుంటే ఎటువంటి ప్రయోజనం చేకూరదన్నారు. వెంటనే ఆర్డీవోలు, తహసీల్దార్లు పింఛన్‌దారుల పేర్లను ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయించాలని ఆదేశించారు.

భూ సేవకు ప్రత్యేక వాట్సాప్‌: రెవెన్యూ రికార్డుల స్వచ్ఛత కార్యక్రమానికి కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలతో భూసేవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు  కలెక్టర్‌ వెల్లడించారు. భూ సేవకు సంబంధించి ప్రత్యేక వాట్సాప్‌ను రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్‌ ఏర్పాటు చేస్తున్నారన్నారు. నూరుశాతం పారదర్శకత ఉండేలా భూధార్‌ సిద్ధమవుతోందన్నారు. అడంగల్, ఆర్‌ఎస్‌ఆర్‌లో ఉన్న తేడాలను సరిచేస్తారన్నారు. తహసీల్దార్లు తమవద్ద ఉన్న డిజిటల్‌ కీని జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అడంగల్, ఆర్‌ఎస్‌ఆర్‌కు ఉన్న తేడాలను గుర్తించి ఈనెల 19 నుంచి నెలాఖరు వరకు రెవెన్యూ రికార్డులు సరిచేసే కార్యక్రమం చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 6.95 లక్షలకు పైగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఉండగా, ఇప్పటి వరకు 1.20 లక్షల పాస్‌ పుస్తకాలు టైటిల్‌ డీడ్లు ఇచ్చారని, మిగిలినవి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇష్టానుసారంగా భూమి మార్పులు చేసి ఆన్‌లైన్‌లో చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ప్రభుత్వ భూములకు రెవెన్యూ అధికారులు రక్షణ కల్పించాలని, ఎక్కడైనా అక్రమాలు జరిగితే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 1427 ఫసలీ జమాబందీ నెలాఖరులోగా పూర్తి చేయాలని  కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్‌ ఎన్‌ ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement