సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక రేపు(గురువారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ స్థానం కోసం వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. కాగా, ప్రసాద్ కుమార్‌కు బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలుమద్దతు ఇవ్వడం విశేషం.
స్పీకర్ నామినేషన్ పత్రాలపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన అనంతరం.. ఆయన నామినేషన్ వేశారు. ఆయన పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. దీంతో, ప్రసాద్ కుమార్ బుధవారం నామినేషన్ వేశారు. ఇక, ప్రసాద్ కుమార్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సహా పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మరోవైపు.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. ఈ క్రమంలో స్పీకర్ నామినేషన్ పత్రాలపై బీఆర్ఎస్ తరుపున మద్దతు తెలుపుతున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకం చేశారు. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవ ఎన్నికకు మద్దతు తెలిపారు. ఇక, కేటీఆర్ సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుని మద్దతు ప్రకటించారు. అలాగే, ఎంఐఎం తరఫున మాజిద్ ఉస్సేన్ మద్దతు తెలిపారు.
ఇదిలా ఉండగా.. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment