సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సాధారణ ఎన్నికల ముంగిట్లో అనూహ్యంగా తెరపైకి వచ్చిన మున్సిపల్ ఎన్నికలు రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న క్రమంలో ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఆయా పార్టీల నేతలను ఆత్మరక్షణలో పడేసింది. శాసనసభ ఎన్నికల బరిలో నిలవాలనే తపనతో ఏడాది కాలంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్న ఆశావహులకు తాజా పరిణామాలు తలనొప్పిగా మారాయి.
వారం, పదిరోజుల్లో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారపర్వాన్ని భుజానెత్తుకోవడం వారి జేబులకు కత్తెర వేయనుంది. రిజర్వేషన్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది.
ఊహించని విధంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఒకే వార్డుకు పలువురు పోటీపడుతుండడం, వీరిని బుజ్జగించడం వారిని తలకుమించిన భారం కానుంది. ఈ నేపథ్యంలో ఏమాత్రం తేడా వచ్చిన రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమ గెలుపుపై ప్రభావం చూపుతుందనే బెంగ వారిని వెంటాడుతోంది.
పట్టణ ఎన్నికలు కావడం.. సాధారణ ఎన్నికల ఫలితాలకు ఇవి సంకేతాలని విశ్లేషిస్తున్న తరుణంలో... ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఆరు నెలల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనే అడ్డగోలుగా డబ్బులు వెదజల్లిన స్థానిక నేతలు.. ఈ ఎన్నికల్లోనే అదే ధోరణిని కొనసాగించేందుకు పావులు కదుపుతున్నారు. మున్సిపాలిటీల్లేని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు/ఆశావహులు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, వీటి ప్రభావం ఉన్నవారు మాత్రం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు నగర పంచాయతీలున్నా యి. కొత్త మున్సిపాలిటీలుగా అవతరించిన పెద్ద అంబర్‌పేట, ఇబ్రహీంపట్నంలో అధిపత్యాన్ని కొనసాగించడ ం ఆయా రాజకీయపార్టీలకు సవాలుగా పరిణమించింది. అదే సమయంలో ఇక్కడ బీజేపీ కూడా బలంగా ఉండడం.. అధికార, ప్రతిపక్ష పార్టీలను కలవరపెడుతోంది.
తాండూరు మున్సిపాలిటీ ఎన్నికలు స్థానిక శాసనసభ్యుడు మహేందర్‌రెడ్డిని ఇరకాటంలో పడేశాయి. ఇటీవలే టీడీపీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న ఆయనకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. తన ప్రాభవాన్ని కాపాడుకునేందుకు.. రాజకీయ అస్థిత్వం నిలుపుకునేందుకు ఇవి ప్రామాణికంగా మారనున్నాయి. ప్రత్యర్థి పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటి మహేందర్ హవాకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి.
వికారాబాద్ పట్టణ ఎన్నికలు తాజా మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రసాద్ పలుకుబడిని దెబ్బతీయడం నైతికంగా బలహీనపరచాలనే ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రకటనతో మంచి ఊపు మీద ఉన్న టీఆర్‌ఎస్‌కు సీట్లు దక్కకుండా చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
మహేశ్వరం సెగ్మెంట్ పరిధిలోని బడంగ్‌పేట్ నగర పంచాయతీల్లో ఆధిక్యతను కనబరచడం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి జీవన్మరణ సమస్యగా మారింది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి కూడా ఈ పురపోరు సవాల్‌గా మారింది. దీంట్లో సత్తా చూపితేనే కేడర్‌లో ఉత్సాహం వస్తుందని, ఇప్పటికీ టీ ప్రకటనతో కుంగిపోయిన పార్టీ శ్రేణులు.. ఓటమి పాలైతే నైరాశ్యంలో కూరుకుపోవడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
సాధారణ ఎన్నికల వేళ.. ‘పుర’పోరు గోల
Published Mon, Mar 3 2014 11:30 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement