సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పల్స్’ ఉండదు
* ఆయా నియోజకవర్గాల మొత్తం ఓట్లకు, ఆ పరిధిలోని మున్సిపోల్స్‌లో పోలైన ఓట్లకు మధ్య వ్యత్యాసం వివరాలు
* సీమాంధ్ర మొత్తం ఓటర్లు 3.68 కోట్లు
* 92 మున్సిపాలిటీల్లోని ఓటర్లు 44.83 లక్షలే
* కేవలం పట్టణ ఓటరు మనోగతానికే పరిమితం
* స్థానిక అంశాలకే ఓటరు ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటమవుతాయా? లేక స్థానిక సమస్యలే ప్రధానాంశాలుగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలకు సార్వత్రిక ఫలితాలకు తేడా ఉంటుందా? సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో మొత్తం 3,67,62,975 ఓట్లుండగా... 44,82,714 ఓట్లు మాత్రమే ఉన్న 92 మున్సిపాలిటీల ఫలితాలను చూసి సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని పరిశీలకులు చెబుతున్నారు. అందులోనూ 33,49,076 ఓట్లు మాత్రమే పోలైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే మొత్తంగా స్థానిక అంశాలే ప్రధాన పాత్ర పోషించినట్టు అర్థమవుతోందని పేర్కొన్నారు. సీమాంధ్ర మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే సాగగా, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
* సీమాంధ్రలోని 13 జిల్లాల పరిధిలోని 92 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ 92 మున్సిపాలిటీలు 87 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. అలాగే ఏడు కార్పొరేషన్లు 12 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉన్నాయి. అంటే మొత్తం 99 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మాత్రమే మున్సిపాలిటీలున్నాయి. ఇవి కాకుండా 76 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ మున్సిపల్ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం లేదు.
* 92 మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 44,82,714 మాత్రమే. కానీ ఈ మున్సిపాలిటీలున్న 87 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,84,86,000. అంటే 87 నియోజకవర్గాల్లోని మొత్తం ఓటర్లలో మున్సిపల్ ఓటర్లు 24 శాతమే. మిగతా 76 శాతం(1,40,03,286) మందిని పరిగణించకుండా మొత్తం ఫలితాలను విశ్లేషించడం సాధ్యం కాదు.
* వైఎస్సార్ కాంగ్రెస్ బలంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటరు మనోగతాన్ని ప్రతిబింబించని మున్సిపల్ ఎన్నికల సరళినే మొత్తం ఫలితాల సరళిగా భావించడంలో అర్థం లేదని పరిశీలకులు విశ్లేషించారు. పైగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంది. మొత్తం 92 మున్సిపాలిటీల్లో కలిపి వైఎస్సార్‌సీపీకన్నా టీడీపీకి 1,55,211 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయి. ఈ ఓట్లు ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోలయ్యే ఓట్లకన్నా తక్కువే. మరోవైపు 21 మున్సిపాలిటీల్లో ఒకటి రెండు ఓట్లతో చైర్‌పర్సన్‌లు దక్కే పార్టీ మారే అవకాశాలున్నాయి.
* రాష్ట్రస్థాయి అంశాలు కానీ, పార్టీల సిద్ధాంతాలు, ఆయా పార్టీల నాయకత్వాలపై ఉండే విశ్వసనీయత తదితర అంశాలు కాకుండా స్థానికాంశాలే ఎక్కువ ప్రభావం చూపించాయి.గతంలో కాంగ్రెస్ లేదా టీడీపీ సాధారణ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వంలోకి వచ్చినా ఆ తరువాత జరిగే స్థానిక ఎన్నికల్లో ఘోరంగా పరాభవం పాలైన సందర్భాలున్నాయని వారు గుర్తుచేస్తున్నారు.