‘పుర’ పోరులో ‘దేశం’ విజయం
సాక్షి, రాజమండ్రి :పుర సమరంలో తెలుగుదేశం విజయం సాధించింది. రాజమండ్రి నగరపాలక సంస్థలోని 50 డివిజన్‌లతో పాటు, ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలలోని 255 వార్డులకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం జరిగింది. రాజమండ్రి కార్పొరేషన్, అమలాపురం, తుని, మండపేట, రామచంద్రపురం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం మున్సిపాలిటీల్లో టీడీపీ గెలిచింది. ముమ్మిడివరం, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో హంగ్ ఏర్పడగా, ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వార్డులకు 10 వార్డులు టీడీపీయే గెలుచుకున్నా..ఎస్సీ మహిళకు కేటాయించిన చైర్‌పర్సన్ పదవికి ఆ పార్టీకి అభ్యర్థి లేని విచిత్ర పరిస్థితి నెలకొంది.రాజమండ్రి తప్ప మిగిలిన మున్సిపాలిటీల్లో లెక్కింపే ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాజమండ్రిలో 50 డివిజన్‌లకు 30 టేబుళ్లు వేయడంతో తొమ్మిదింపావు వరకూ లెక్కింపు ప్రారంభం కాలేదు. మున్సిపాలిటీల్లో 11 గంటలలోపు, రాజమండ్రిలో మధ్యాహ్నం 12 గంటల కల్లా ఫలితాలు వెల్లడించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆ రెండు చోట్లా ఎమ్మెల్యేలే కీలకం..!
ముమ్మిడివరం నగర పంచాయతీలోని 20 వార్డుల్లో ముగ్గురు ఇదివరకే ఏకగ్రీవం కాగా 17 వార్డులకు ఎన్నిక లు జరిగాయి. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ చెరో ఎనిమిది గెలుచుకోగా, ఒక స్థానంలో ఇండిపెండెంట్ నెగ్గారు. ఏకగ్రీవం అయిన వారిలో ఇద్దరు తమ వారే అని టీడీపీ చెప్పుకొంటుండగా ఒకరు మాత్రం వైఎస్సార్ సీపీ మద్దతు దారు. గొల్లప్రోలు నగర పంచాయతీలోని 20 వార్డుల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ చెరో 10 వార్డులు గెలుచుకున్నాయి. ఈ రెండు చోట్టా చైర్మన్ ఎన్నికలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎక్స్ అఫీషియో సభ్యులయ్యే ఎమ్మెల్యేల పాత్ర కీలకం అయ్యే అవకాశం ఉంది. ఏలేశ్వరం నగర పంచాయతీలో 20 వార్డులకు 9 వైఎస్సార్ సీపీ, 10 టీడీపీ, ఒకటి కాంగ్రెస్ గెలుచుకున్నాయి. టీడీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినా.. ఎస్సీ మహిళకు కేటాయించిన చైర్‌పర్సన్ పదవికి అభ్యర్థి ఆ పార్టీ తరఫున గెలవలేదు. దీంతో వైఎస్సార్ సీపీని ఆశ్రయించడం తప్పనిసరి కానుంది.
గెలిచిన మేయర్, చైర్మన్ అభ్యర్థులు..
రాజమండ్రి మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థిగా నిలిచిన రజనీ శేషసాయి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షర్మిలారెడ్డి గెలుపొందారు. చైర్మన్ అభ్యర్థులుగా టీడీపీ నుంచి నిలిచినవారిలో మండపేటలో చుండ్రు శ్రీహరిరావు, తునిలో ఇనగంటి సత్యనారాయణ, సామర్లకోటలో మన్యం చంద్రరావు, పిఠాపురంలో కరణం చిన్నారావు, అమలాపురంలో యాళ్ల మల్లేశ్వరరావు, పెద్దాపురంలో రాజా సూరిబాబు, ముమ్మిడివరంలో శాంతకుమారి, గొల్లప్రోలులో శీరం మాణిక్యం గెలిచారు. వైఎస్సార్‌సీపీ నుంచి అధ్యక్ష అభ్యర్థులుగా పిఠాపురంలో గండేపల్లి రామారావు, ముమ్మిడివరంలో బాల మణికుమారి, గొల్లప్రోలులో తెడ్లపు చిన్నారావు గెలుపొందారు.
కాగా రామచంద్రపురంలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి ఎస్‌ఆర్‌కే గోపాల్ బాబు, వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి జగన్నాథవర్మ ఓటమి పాలయ్యారు. మండపేటలో వైఎస్సార్ సీపీ చైర్మన్ అభ్యర్థి వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి 4 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తుని, సామర్లకోటల్లో కూడా వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థులు ఓడిపోయారు.