తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ  | YSR Congress Party as an unstoppable force | Sakshi
Sakshi News home page

తిరుగులేని శక్తిగా వైఎస్సార్‌సీపీ 

Published Fri, Dec 31 2021 5:50 AM | Last Updated on Fri, Dec 31 2021 4:32 PM

YSR Congress Party as an unstoppable force - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి 2021 సంవత్సరం అఖండ విజయాలను అందించింది. పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో వరుస విజయాలతో విజయదుందుభి మోగించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వాగ్దానాల్లో 95 శాతం హామీలను ముఖ్యమంత్రి అయిన తొలి ఏడాదిలోనే ఆయన అమలుచేశారు. ఫలితంగా.. సీఎం వైఎస్‌ జగన్‌ అమలుచేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. అందిస్తున్న సుపరిపాలనతో వైఎస్సార్‌సీపీపై ప్రజాదరణ నానాటికీ పెరుగుతోంది.

సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతం ఓట్లతో 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాలను (88 శాతం) దక్కించుకున్న వైఎస్సార్‌సీపీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడమే అందుకు తార్కాణం. 1983 ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో ఘోరంగా ఓడిపోయిన చంద్రబాబు.. 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. దొంగ ఓట్లు.. దౌర్జన్యాలు, ప్రలోభాలతో మూడు దశాబ్దాలకు పైగా చంద్రబాబు కుప్పంను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. కానీ.. పంచాయతీ, పరిషత్, మున్సిపల్‌ ఎన్నికల్లో అక్కడ ఆయన ఆటలు సాగలేదు. టీడీపీని వైఎస్సార్‌సీపీ చావుదెబ్బ తీసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ ద్వారా ఏడాదిపాటూ స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు అడ్డుకున్నప్పటికీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు ఆయన్ను చావుదెబ్బ తీశారు. 

వంద శాతం కార్పొరేషన్లు వైఎస్సార్‌సీపీకే.. 
చివరకు ఈ ఏడాది మార్చి, నవంబర్‌లలో రెండు విడతలుగా 13 కార్పొరేషన్‌లు (నగర పాలక సంస్థలు), 86 నగర పంచాయతీ, మున్సిపాల్టీలకు ఎన్నికలను ఎస్‌ఈసీ నిర్వహించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం అంటే.. 13 కార్పొరేషన్‌లను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది. 87 నగర పంచాయతీ, మున్సిపాల్టీల్లో 84 నగర పంచాయతీ, మున్సిపాల్టీల (98 శాతం)ను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కేంద్రంలోని కుప్పం మున్సిపాల్టీలో సైతం వైఎస్సార్‌సీపీ ఆఖండ విజయం సాధించడం గమనార్హం. 


గ్రామ పంచాయతీల్లోనూ పాగా 
మొత్తం 13,092 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తే.. 10,536 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అంటే 80.4 శాతం గ్రామ పంచాయతీలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుందన్న మాట. అదే కుప్పం నియోజకవర్గంలో 89 పంచాయతీలకుగానూ 74 పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులే విజయం సాధించి.. టీడీపీ కోటను బద్దలుకొట్టారు.   

100% జిల్లా పరిషత్‌లు వైఎస్సార్‌సీపీకే.. 
రాష్ట్రంలో 652 జిల్లా పరిషత్‌ ప్రాదేశిక స్థానాలు (జెడ్పీటీసీ), 9,717 మండల పరిషత్‌ ప్రాదేశిక స్థానాల (ఎంపీటీసీ)కు ఎన్నికలు జరిగితే.. 642 జెడ్పీటీసీ స్థానాల (98.46 శాతం)ను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుని అఖండ విజయాన్ని సాధించింది. అలాగే, మొత్తం 13 జెడ్పీ చైర్మన్‌ పదవులనూ ఆ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. ఇక 9,717 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే.. 8,380 స్థానాలు (86.24 శాతం) స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 96 శాతం మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని మొత్తం నాలుగు జెడ్పీటీసీ స్థానాలు, 68 ఎంపీటీసీ స్థానాలకుగానూ 63 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజిక్కించుకుంది.  

‘మండలి’లో సంపూర్ణ ఆధిక్యం 
శాసన మండలిలో 58 స్థానాలు ఉన్నాయి.  నిన్న మొన్నటి వరకూ మండలిలో టీడీపీ ఆధిక్యంలో ఉంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించడం, పలువురు టీడీపీ సభ్యుల పదవీ కాలం ముగియడంతో ఇటీవల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో మండలిలో వైఎస్సార్‌సీపీ బలం 18 నుంచి 32కు ఒక్కసారిగా పెరిగి సంపూర్ణ ఆధిక్యత సాధించినట్లయింది.

దేశ చరిత్రలో రికార్డు..: 
గ్రామ పంచాయతీ నుంచి రాష్ట్రస్థాయి వరకూ ఒకే పార్టీ అధికారంలో ఉండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 80 శాతానికి పైగా గ్రామ పంచాయతీలతోపాటు 13 జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు.. ఇలా అన్నింటా వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తీసుకునే సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందని వారు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement