సీమాంధ్రలో టీడీపీ పైచేయి
* మున్సిపోల్స్‌లో కేవలం 4.64 % ఓట్ల తేడాతో వెనుకబడిన వైఎస్సార్‌సీపీ
* 92 మున్సిపాలిటీల్లో 2,571 వార్డులకు ఎన్నికలు
* టీడీపీ-1,428, వైసీపీ-941
* పోలైన ఓట్లలో టీడీపీకి 45.18%, వైసీపీకి 40.54%
* 5 కార్పొరేషన్లలో సైకిల్.. కడప, నెల్లూరులో ఫ్యాన్
* పలు వార్డుల్లో స్వల్ప మెజార్టీతో నెగ్గిన టీడీపీ
* సీమాంధ్రలో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ ముందంజలో నిలిచింది. సీమాంధ్రలోని మొత్తం 92 మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 2,571 వార్డుల్లో టీడీపీ 1,428 వార్డులను గెలుచుకుని అగ్రభాగంలో నిలిచింది. ఆ తర్వాత 941 వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ విజయం సాధించింది. మున్సిపాలిటీల వారీగా పరిశీలిస్తే 60 మున్సిపాలిటీల్లో టీడీపీ అత్యధిక వార్డులను గెలుచుకుంది. మరో 22 మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది.
మరో 109 వార్డుల్లో స్వతంత్రులు గెలుచుకుని కీలకంగా మారారు. కాంగ్రెస్ కేవలం 53 వార్డులను మాత్రమే గెల్చుకోగా, ఒక్క మున్సిపాలిటీ కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లో సీపీఎం 8 వార్డులు, సీపీఐ 15 వార్డులు, బీజేపీ 12 వార్డులను దక్కించుకున్నాయి. సీమాంధ్ర 13 జిల్లాల్లో సోమవారం ఓట్ల లెక్కింపు జరగ్గా వాటిల్లో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడానికి వీలైన స్థాయిలో డివిజన్లు, వార్డులను టీడీపీ గెలుచుకుంది. మొత్తం వార్డుల్లో ఓట్ల మధ్య స్వల్ప తేడాతో మెజారిటీ వార్డుల్లో ఫలితాలు తారుమారయ్యాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీలో బీఎస్పీ 5 వార్డులను గెల్చుకోవడం విశేషం.
7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ ముందంజలో నిలిచింది. 5 కార్పొరేషన్లను టీడీపీ కైవసం చేసుకోగా మరో రెండింటిలో వైఎస్సార్‌సీపీ గెలిచింది. కడప, నెల్లూరు కార్పొరేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకోగా, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, అనంతపురం, చిత్తూరు కార్పొరేషన్లను టీడీపీ దక్కించుకుంది. పార్టీ ఆవిర్భవించాక తొలిసారి పురపాలక, నగర పాలక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పోటీ పడింది. మొత్తం ఏడు కార్పొరేషన్ల పరిధిలో 363 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. 202 డివిజన్లను టీడీపీ గెలుచుకోగా 124 డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఏడు కార్పొరేషన్లలో కలిపి కాంగ్రెస్ 2 డివిజన్లలో మాత్రమే నెగ్గింది. బీజేపీ నాలుగు డివిజన్లలోనూ, సీపీఎం మూడు డివిజన్లలోనూ, బీఎస్పీ ఒక్క డివిజన్‌లోనూ గెలిచింది.