సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మున్సిపల్, పరిషత్, సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో జాగ్రత్తగా ఉండాలని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య జిల్లా కాంగ్రెస్ నేతలకు సూచించారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షుడు, పరిషత్ అభ్యర్థులు, ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులు, ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.
అభ్యర్థులవారీగా విజయావకాశాలపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 12, 13, 16వ తేదీల్లో జరిగే కౌంటింగ్‌కు ఏజెంట్ల నియామకంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఓట్ల లెక్కింపు సందర్భంగా వారు చురుకుగా వ్యవహరించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకోసం ఈనెల 10న జిల్లా స్థాయిలో, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగర సమావేశం పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అర్బన్ అభ్యర్థి మహేశ్‌కుమార్‌గౌడ్ ఆధ్యర్యంలో, మున్సిపాలిటీల వారీ సమావేశాలు స్థానిక నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవాలని సూచించారు. ఇందులో చేసిన తీర్మానాలను టీపీసీసీకి పంపించాలని ఆదేశించారు.
విజయం మనదే
తెలంగాణలో అత్యధిక అసెంబ్లీ స్థానాలు సాధించి కాంగ్రెసే తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, లోక్‌సభ, పరిషత్ ఎన్నికలలోనూ తమదే గెలుపని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో ప్రజలు సోనియాకు కృతజ్ఞతలు తెలిపేందుకు కాంగ్రెస్‌కే ఓటు వేశారని, పై చేయి తమదే అవుతుందన్నారు. అందుకే కౌంటింగ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, ఏజెంట్లు ఏమరపాటుగా వ్యవహరించకుండా చూసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్, మాజీ మంత్రి పి. సుదర్శన్‌రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ షబ్బీర్ అలీ, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ విప్ ఈరవత్రి అనిల్‌కుమార్, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.