మూడో ‘దళ’ పోరుకు రెడీ | 10 state elections to be held today | Sakshi
Sakshi News home page

మూడో ‘దళ’ పోరుకు రెడీ

Published Thu, Apr 10 2014 2:38 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

10 state elections to be held today

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు దేశచరిత్రలోనే నిర్ణయాత్మకమైనవి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో సుపరిపాలన, అభివృద్ధి మంత్రంతో గుజరాత్ ఎజెండాను ఎత్తుకున్న నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ కాంగ్రెస్‌తో తీవ్రస్థాయిలో పోటీ పడుతోంది. ధరల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న నిరుద్యోగం తదితరాలను ఎదుర్కోవడంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం ఎన్‌డీఏకు కలిసొస్తోంది. ఏప్రిల్ 7, ఏప్రిల్ 9 తేదీల్లో జరిగిన మొదటి, రెండో దశ ఎన్నికలు ‘వార్మ్ అప్’ రౌండ్ లాంటివి. కానీ, నేడు(ఏప్రిల్ 10న) జరిగే మూడో దశ ఎన్నికలు మొత్తం ప్రక్రియలో కీలకం కానున్నాయి. గురువారం దేశవ్యాప్తంగా 92 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
 - ప్రవీణ్ రాయ్
 సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్
 సొసైటీస్ (సీఎస్‌డీఎస్)

 
10 రాష్ట్రాల్లో నేడే ఎన్నికలు
ఎన్నికలు జరగనున్న ప్రాంతాలు
10 రాష్ట్రాలు: ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్, జమ్మూ, కాశ్మీర్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఢిల్లీ, జార్ఖండ్.
 
 3 యూటీలు
 చండీగఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్
 
92  నియోజకవర్గాలు
2009లో ఎవరికి ఎన్ని?
యూపీఏ    51 (కాంగ్రెస్ 46)
ఎన్‌డీఏ    17 (బీజేపీ 13)
వామపక్షాలు 4
బీఎస్పీ 6
ఇతరులు 14
ఢిల్లీ, హర్యానా, కేరళల్లో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతాయి
 
 ఢిల్లీ
 ఢిల్లీలో ఆప్ ప్రభావం ఎక్కువగా ఉంది. 2009లో ఇక్కడి మొత్తం 7 స్థానాలను కాంగ్రెసే గెలుచుకుంది. కానీ ఈ సారి పరిస్థితి మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల పరాజయం నుంచి కాంగ్రెస్ ఇంకా తేరుకోలేదు. అయితే, 49 రోజుల్లోనే అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలడం, ఆప్ సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వలేకపోవడంతో కాంగ్రెస్‌కు కొంత కలిసొచ్చే అవకాశముంది. పార్టీ కోల్పోయిన ఓటుబ్యాంకును కొంతయినా వెనక్కు తెచ్చుకునే అవకాశం దాంతో ఏర్పడింది. ఢిల్లీ స్థానాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూడు పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, ఆప్‌లు బలమైన అభ్యర్థులను బరిలో దింపాయి. చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ స్థానాల్లో 20% పైగా ముస్లింలున్నారు. ముస్లింలంతా కాంగ్రెస్‌కే మద్దతివ్వాలంటూ ఢిల్లీలోని జామా మసీదు ఇమాం బుఖారీ ఇచ్చిన పిలుపుతో ఆ రెండు స్థానాల్లో కాంగ్రెస్ గెలుపునకు అవకాశాలు మెరుగయ్యాయి. ముస్లింల ఓట్లన్నీ గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడటం వల్ల బీజేపీ విజయావకాశాలు దెబ్బ తింటాయి. మొత్తంమీద 3 నుంచి 4 స్థానాల్లో బీజేపీ, 2-3 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఆప్ గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఒకవేళ ముస్లిం ఓట్లు కాంగ్రెస్, ఆప్‌ల మధ్య చీలితే మాత్రం బీజేపీ కనీసం 5 స్థానాల్లో గెలుస్తుంది.
 
 హర్యానా
2009 ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ 10 స్థానాలకు గానూ 9 స్థానాల్లో విజయం సాధించింది. హర్యానా జనహిత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కుల్దీప్ బిష్ణోయి హిస్సార్ నుంచి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సోనియాగాంధీ కుటుంబానికి లబ్ధి చేకూరేలా భూ కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు కాంగ్రెస్‌పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. దాంతోపాటు బీజేపీ, హెచ్‌జేసీల కూటమి గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత విభేదాలు బీజేపీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశముంది. ఆప్ కూడా బరిలో దిగడంతో పలు స్థానాల్లో త్రిముఖ పోటీ తప్పడంలేదు. కురుక్షేత్ర(నవీన్ జిందాల్), రోహ్‌తక్(దీపేందర్ సింగ్ హుడా), భీవానీ(శ్రుతి చౌధరీ) స్థానాలను కాంగ్రెస్ నిలుపుకునే అవకాశముంది. ముస్లిం ఓట్లు కలిసొస్తే మరో రెండు స్థానాల్లోనూ గెలిచే అవకాశముంది. గుర్గావ్ స్థానంలో బహుముఖ పోటీ ఉంది. ఇక్కడ యోగేంద్రయాదవ్(ఆప్), రావు ఇంద్రజిత్‌సింగ్(బీజేపీ), రావు ధర్మపాల్(కాంగ్రెస్), జాకిర్‌హుస్సేన్(ఐఎన్‌ఎల్‌డీ)లు హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే, ఇక్కడ  20%పైగా ఉన్న ముస్లిం ఓటర్లు జాకిర్ హుస్సేన్ వైపు మొగ్గు చూపితే ఐఎన్‌ఎల్‌డీ గెలుపు సులభసాధ్యమవుతుంది.
 
 ఒడిశా
 ఒడిశాలో గురువారం 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 5, బీజేడీ 4, బీజేపీ 1 స్థానంలో గెలుపొందాయి. బీజేడీతో తెగతెంపులు బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. అత్యధిక స్థానాల్లో బీజేడీనే విజేతగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది.
 
 బీహార్
 బీహార్‌లోని 6 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 2009లో జేడీయూ 3, కాంగ్రెస్, బీజేపీలు ఒక్కో స్థానం గెలుచుకున్నాయి. ఈ ఆరు నియోజకవర్గాల్లో మూడు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు. గత ఎన్నికల్లో ఈ మూడింటినీ జేడీయూ, కాంగ్రెస్, బీజేపీలు పంచుకున్నాయి. జేడీయూ, బీజేపీలు గత పదిహేడేళ్ల అనుబంధాన్ని తెంచుకుని ఈ సారి వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. బీజేపీకి దూరం కావడం కొంతవరకు జేడీయూ విజయావకాశాలను దెబ్బతీయనుంది. రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్‌జేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ బలపడింది. అయితే, ఈ ఆరు నియోజకవర్గాల్లోని నాలుగింటిలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఈ స్థానాల్లో దాదాపు 10% నుంచి 20% వరకు ముస్లిం ఓటర్లు బీజేపీ విజయావకాశాలను ప్రభావితం చేయగలరు. బీజేపీ, ఆర్జేడీ కూటమి ముస్లిం ఓట్లను మొత్తంగా సాధించగలిగితే వారికి విజయావకాశాలు మెరుగవుతాయి. 15వ లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సాసారాం నుంచి పోటీ చేస్తున్నారు.
 
కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో పోరు ఆసక్తికరంగా సాగనుంది. ఆప్, బీజేపీల నుంచి బాలీవుడ్ నటీమణులు గుల్‌పనగ్, కిరణ్ ఖేర్‌లు బరిలో ఉండగా.. కాంగ్రెస్‌కు పట్టున్న ఈ ప్రాంతాన్ని నిలబెట్టుకునేందుకు పవన్ కుమార్ బన్సల్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే, ఇటీవలి రైల్వే స్కామ్ ఈ మాజీ  కేంద్రమంత్రిని ఇబ్బంది పెడుతోంది.

ఉత్తరప్రదేశ్
రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోని 10 లోక్‌సభస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో వీటిలో బీఎస్పీ 5, బీజేపీ 2, అజిత్‌సింగ్ నేతృత్వంలోని ఆరెల్డీ 2, ఎస్పీ 1 స్థానంలో విజయం సాధించాయి. గత ఏడాది జరిగిన ముజఫర్‌నగర్ మత కలహాలు, వాటిని సర్కారు సమర్థంగా అదుపుచేయలేకపోవడం.. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. 10 స్థానాల్లో 9 స్థానాలు ముస్లిం ఓట్లు భారీగా ఉన్నవే కావడం గమనార్హం. గాజియాబాద్ మినహా మిగిలిన 9 నియోజకవర్గాల్లో 20% పైగా ముస్లిం ఓటర్లున్నారు. దాంతో ఈ 10 స్థానాల్లోనూ ఎస్పీ ఏ ఒక్క స్థానంలోనూ గెలిచే అవకాశాల్లేవు. ముస్లింలు బీఎస్పీ, కాంగ్రెస్‌ల్లో దేని వైపు మొగ్గితే ఆ ఆ పార్టీ  ఈ స్థానాల్లో విజయం సాధిస్తుంది.
 
అయితే, బీజేపీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలోని జాట్ సహా హిందూ ఓట్లన్నీ తమ పార్టీకే పడేలా పావులు కదుపుతోంది. అదే జరిగితే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుపొందుతుంది. టికెట్ ఖాయం అయ్యాక, ఎన్నికలకు వారం ముందు గౌతమ్‌బుద్ధనగర్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ చంద్ తోమర్ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పుడక్కడ కాంగ్రెస్‌కు అభ్యర్ధే లేని పరిస్థితి నెలకొంది. దాంతో ఆ స్థానంలో బీజేపీ, బీఎస్పీల మధ్యే ప్రధానంగా పోటీ ఏర్పడింది. గాజియాబాద్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంది. ఎవరు గెలిచినా అతి తక్కువ మెజారిటీతోనే గెలుస్తారు. బిజ్నోర్, మీరట్‌లలో  సినీ తారలు జయప్రద, నగ్మాలు పోటీలో ఉండటంతో అక్కడి పోరుకు గ్లామర్ తోడైంది.
 
 కేరళ
 20 స్థానాలున్న కేరళలో 2009లో యూడీఎఫ్ 16 (కాంగ్రెస్ 13,  కేరళ కాంగ్రెస్(మణి) 1, ఐయూఎంఎల్ 2), ఎల్‌డీఎఫ్ 4 స్థానాల్లో గెలుపొందాయి. ఈ ఎన్నికల్లో ఆప్, బీజేపీలు యూడీఎఫ్ ఓట్లకు గండికొట్టే పరిస్థితి కనిపిస్తోంది. అయినా, గత స్థానాలను కాంగ్రెస్ నిలుపుకునే అవకాశాలున్నాయి. ముస్లింలు ఎక్కువగా ఉన్న మలబార్, క్రైస్తవ జనాభా అధికంగా గల కొచ్చిన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. దక్షిణ కేరళలో మాత్రం ఎల్‌డీఎఫ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.
 
 మహారాష్ట్ర
 మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలోని 10 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 10న ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 6 తూర్పు విదర్భ ప్రాంతంలో, 4 పశ్చిమ విదర్భ ప్రాంతంలో ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ 4, బీజేపీ 2, శివసేన 2, ఎన్సీపీ 1 స్థానంలో గెలుపొందాయి. మహారాష్ట్రలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకున్న ప్రాంతం విదర్భ. ఇక్కడ రైతు వ్యతిరేకతతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ఎదుర్కొంటోంది. దాంతోపాటు మోడీ గాలి బలంగా వీస్తుండటంతో ఈ ప్రాంతంలో ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కూటమి కనీసం 7 స్థానాల్లో గెలిచే అవకాశముంది.
 
మధ్యప్రదేశ్, జార్ఖండ్

మధ్యప్రదేశ్, జార్ఖండ్‌లలోనూ బీజేపీ వైపే మొగ్గు కనిపిస్తోంది. మూడో దశలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 9 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో మహాకోశల్ ప్రాంతంలో 5, వింధ్య ప్రాంతంలో 4 నియోజకవర్గాలు ఉన్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు చెరో 4 స్థానాల్లో పాగా వేయగా, ఒకస్థానాన్ని బీఎస్పీ గెలుచుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇమేజ్, మోడీ ప్రభావంతో ఈ సారి 7కు పైగా స్థానాలను బీజేపీ గెలిచే పరిస్థితి ఉంది. జార్ఖండ్‌లో నేడు ఎన్నికలు జరగనున్న 5 స్థానాల్లో కనీసం రెండు సీట్లను బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది.
 
మూడో దశలో ప్రముఖులు
మీరా కుమార్ (కాంగ్రెస్)  సాసారాం, బీహార్
గుల్ పనగ్ (ఆప్) చండీగఢ్
కిరణ్ ఖేర్ (బీజేపీ) చండీగఢ్
కరుణ శుక్లా (కాంగ్రెస్) వాజ్‌పేయి అన్న కూతురు
బిలాస్‌పూర్ ఛత్తీస్‌గఢ్
నవీన్ జిందాల్ (కాంగ్రెస్)
కురుక్షేత్ర, హర్యానా
జయప్రద (ఆరెల్డీ)
బిజ్నోర్, యూపీ
రాజ్‌బబ్బర్ (కాంగ్రెస్)
గాజియాబాద్, యూపీ
సందీప్ దీక్షిత్ (కాంగ్రెస్)
తూర్పు ఢిల్లీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement