పేరేదైతేనేం.. పెట్టెయ్ పార్టీ! | New parties enrolled more National wide | Sakshi
Sakshi News home page

పేరేదైతేనేం.. పెట్టెయ్ పార్టీ!

Published Tue, Mar 25 2014 1:30 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

పేరేదైతేనేం.. పెట్టెయ్ పార్టీ! - Sakshi

పేరేదైతేనేం.. పెట్టెయ్ పార్టీ!

దేశవ్యాప్తంగా నమోదైన పార్టీల సంఖ్య
1,593 చిత్ర విచిత్రమైన పేర్లు, కాగితాలపైనే ఉనికి

 
 మేఘదేశం.. టిప్పు సుల్తాన్.. జై మానవతా.. ఆప్‌కా హమారా...  (స్వాతి): ఎన్నికల వేళ సమీపిస్తూనే కొత్త పార్టీలు పుట్టుకు రావడం సహజం. పలు కారణాలతో తెరపైకి వచ్చిన పార్టీలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నున్నాయో తెలుసా? ఏకంగా 1,593! అయితే వీటిలో కేవలం 6 మాత్రమే జాతీయ పార్టీలు. మరో 54 పార్టీలకు రాష్ట్ర స్థాయి గుర్తింపుంది. మిగతావన్నీ కేవలం నమోదైన రాజకీయ పార్టీలు మాత్రమే. మరి ఇన్ని పార్టీలకు పేర్లు దొరకాలంటే మాటలా?! అందుకే... విమెనిస్ట్, జాగ్తే రహో లైఫ్ పీస్‌ఫుల్, అఖిల భారతీయ భారత్‌మాతా-పుత్రపక్ష, లేబర్ అండ్ జాబ్ సీకర్స్, భారతీయ మొహబ్బత్, పిరమిడ్, సర్వే భవంతి సుఖినః, నేషనల్ వరల్డ్ లైఫ్ పంచతత్వ, చిల్డ్రన్ ఫస్ట్, జగత్ తెలుగు మున్నేట్ర కజగం, మనువాద, నేషనల్ టైగర్, బోల్షివిక్, అలీ సేన, థర్డ్ వ్యూ, ఆలిండియా గరీబ్ కాంగ్రెస్... ఇలాంటి చిత్ర విచిత్రమైన పేర్లకు చివర్లో ‘పార్టీ’ అని తగిలించేసుకు న్నాయి. చివరికి పబ్లిక్, ఓటర్స్ పేరుతో కూడా పార్టీలు న్నాయి! కాకపోతే వీటిలో చాలావరకు డమ్మీ పార్టీలే.
 
 జాతీయ పార్టీ హోదా ఇలా...
 అసెంబ్లీ లేదా లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 4 రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలిపి, 6 శాతానికి తగ్గకుండా ఓట్లు సాధించిన పార్టీలకే జాతీయ పార్టీలుగా గుర్తింపు దక్కుతుంది. లేదా కనీసం 3 రాష్ట్రాల నుంచి లోక్‌సభలో 2 శాతం సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా జాతీయ పార్టీగా గుర్తింపు ఇస్తారు. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, పార్లమెంటు ఎన్నికల్లో కానీ సదరు పార్టీ అభ్యర్థులంతా చెల్లుబాటైన మొత్తం ఓట్లలో 8 శాతానికి తక్కువ కాకుండా తెచ్చుకోవాలి. లేదా మొత్తమ్మీద పోలైన ఓట్లలో ఆ పార్టీ కనీసం 6 శాతం ఓట్లు సాధించాలి. జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఉమ్మడి ఎన్నికల గుర్తు కేటాయిస్తారు. వాటికి ప్రభుత్వ ప్రసార మాధ్యమాలలో ఉచితంగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అంతేగాక ఎన్నికల సంఘం నిర్వహించే అఖిలపక్ష సమావేశాలకు కూడా వాటిని ఆహ్వానిస్తారు. ఏ ఎన్నికల్లోనైనా నిర్దిష్ట శాతం ఓట్లు రాకపోతే సదరు పార్టీకి ఉన్న జాతీయ, రాష్ట్ర గుర్తింపును ఈసీ రద్దు చేస్తుంది. జాతీయ హోదా పోగొట్టుకున్న రాష్ట్రీయ జనతాదళ్ ఇందుకు ఉదాహరణ. అయితే గుర్తింపుకు ఉప ఎన్నికలు ప్రాతిపదిక కావు.
 
 రాష్ట్రంలో 54 పార్టీలు
 రాష్ట్రంలో కూడా ఈసారి సార్వత్రిక ఎన్నికల బరిలో దిగేందుకు పలు పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. వీటిలో చాలావరకు తెలంగాణ లేదా సమైక్యాంధ్ర పేర్లతో వచ్చినవే. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్య సమితి, ఆంధ్రనాడు, ఆంధ్ర  రాష్ట్ర ప్రజాసమితి, తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ, జై తెలంగాణ పార్టీ, మా తెలంగాణ పార్టీ, యువ తెలంగాణ పార్టీ... ఇలా ఉన్నాయి పేర్లు.
 
 ప్రస్తుత లోక్‌సభలో 38 పార్టీలకు ప్రాతినిధ్యముంది. వీటిలో 12 పార్టీలకు ఒక్కొక్క సభ్యుడున్నారు. 7 పార్టీలకు ఇద్దరేసి, 10 పార్టీలకు 3 నుంచి 10 మంది వరకు సభ్యులున్నారు. కాంగ్రెస్, బీజేపీలకు మాత్రమే 5 శాతం
 (27 సీట్లు) కంటే ఎక్కువ సీట్లున్నాయి.
 
 పార్టీలు.. పదనిసలు...

 1,027: 2009 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా  ఎన్నికల సంఘం వద్ద నమోదైన పార్టీల సంఖ్య. 2004లో ఈ సంఖ్య 173 మాత్రమే.
 
 363: 2009 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీల సంఖ్య. వీటిలో 7 జాతీయ పార్టీలు (తర్వాతి కాలంలో ఆర్జేడీకి జాతీయ పార్టీ గుర్తింపు గల్లంతైంది), 34 రాష్ట్ర పార్టీలు, 242 నమోదవని, గుర్తింపు పొందని పార్టీలున్నాయి. 3,831 మంది స్వతంత్రులుగా పోటీ చేశారు.
 
 54: మన రాష్ట్రంలో ఇప్పుడు పార్టీల సంఖ్య ఇది. 2004లో పార్టీలు 36 కాగా, 2009 నాటికి అవి 40కి పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement