బాజిరెడ్డిని పరామర్శిస్తున్న కవిత, ధ్వంసమైన కారు అద్దాలు ఇన్‌సెట్‌లో..
నిజామాబాద్ రూరల్, న్యూస్‌లైన్ :నిజామాబాద్ రూరల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం ఆయన మండలంలోని ఎల్లమ్మ కుంట గ్రామానికి కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలను తీసుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.
అయితే ఎల్లమ్మకుంటకు చెందిన మాజీ జడ్‌పీటీసీ కెతావత్ మోహన్, అతని అనుచరులు (కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు) తమ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించవద్దని అడ్డుకున్నారు. కర్రలు, రాళ్ల తో దాడి చేసి బాజిరెడ్డి ప్రయాణిస్తున్న కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
మంచిప్ప మాజీ ఎంపీటీసీ రఘు, కిషన్, సరి యా నాయక్, విఠల్, డా.చిన్నారెడ్డి సహా పది మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలకు స్వల్పంగా గాయాలయ్యాయి. కెతావత్ మోహన్ కూడా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తర లించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
విషయం తెలిసిన వెంటనే ప్రొబేషనరీ ఎస్‌పీ (రూరల్ ఠాణా ఎస్‌హెచ్‌ఓ) విజ య్ కుమార్, నిజామాబాద్ డీఎస్‌పీ అనిల్‌కుమార్, సీఐ ఆదిరెడ్డి హుటాహుటిన ఎల్లమ్మకుంట గ్రామానికి తరలివచ్చారు.గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చే శారు. గాయపడినవారిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించా రు. ఈ సంఘటనకు బాధ్యులైనవారిపై కేసు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
బాజిరెడ్డిని పరామర్శించిన కవిత
సంఘటన గురించి తెలిసిన వెంటనే నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఎల్లమ్మకుంట గ్రామానికి తరలివచ్చారు. బాజిరెడ్డి గోవర్ధన్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే కాంగ్రెస్ అభ్యర్థి డి.శ్రీనివాస్ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుందని, అధైర్య పడవద్దన్నారు.వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. సంఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. గురువారం జిల్లా ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.