trs candidate
-
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే.. కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ తనను ప్రకటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ప్రగతి భవన్లో సీఎం నుంచి బీ ఫామ్ అందుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేది టీఆర్ఎస్సే అని జోస్యం చెప్పారు. 'కేసీఆర్ నా మీద నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చారు. నాలుగు సార్లు నాకు బీ ఫామ్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉన్నా. తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు. కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి వమ్ము చేశాడు. బీజేపీ ప్రతిపక్ష పార్టీ కదా.. ఎలా అభివృద్ధి చేస్తుందో రాజగోపాల్ చెప్పాలి. ఇప్పటివరకు అభివృద్ధి కోసం ఆ పార్టీ ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. తన కాంట్రాక్టుల కోసం రూ.22వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నమ్మిస్తున్నాడు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మునుగోడులో మూడో స్థానానికే పరిమితం అవుతుంది. జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటమి ఖాయమని తేలిపోయింది. ఒక్క ఓటుకు బీజేపీ రూ.30 వేలు పంచుతామని చెప్తోంది. నాయకుడు కాదు గెలిచేది, మునుగోడు ప్రజలే' అని పేర్కొన్నారు. -
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
-
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. 2014లో మునుగోడు ఎమ్మెల్యేగా కూసుకుంట్ల గెలిచారు. 2018 ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.. మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా ప్రభాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి పోటీ చేస్తున్నారు. చదవండి: మునుగోడు బరిలో గద్దర్.. ఆ పార్టీ నుంచే పోటీ! -
టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్?
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరును పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. శ్రీనివాస్ పేరును బుధవారం అధికారికంగా ప్రకటించే అవకాశముందని సమాచారం. సాగర్ ఉపఎన్నిక తరహాలోనే నామినేషన్ల సమయంలోనే అభ్యర్థిని ప్రకటిస్తారని భావిస్తున్నా.. హుజూరాబాద్‌లోని ప్రత్యేక పరిస్థితుల్లో అభ్యర్థిని ఎన్నిక షెడ్యూల్‌కు ముందే ప్రకటించాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, టీఆర్ఎస్ ఉపఎన్నిక ఇన్చార్జ్, మంత్రి హరీశ్ తొలిసారిగా బుధవారం నియోజకవర్గానికి వెళ్లనుండటంతో భారీగా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. -
హుజురాబాద్ ఉపఎన్నిక: కౌన్ బనేగా టీఆర్ఎస్ క్యాండిడేట్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిపై నెలకొన్న ఉత్కంఠ వీడడం లేదు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూనే చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారం ఫోన్ సంభాషణల రూపంలో బహిర్గతం కావడం అధికార పార్టీని ఇరకాటంలో పెట్టింది. ఫోన్ సంభాషణ లీక్ అనంతర పరిణామాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం టీఆర్ఎస్లో చేరుతారని భావించినప్పటికీ, ఏవో కారణాల వల్ల వీలు కాలేదు. ఈనెల 21న భారీ ర్యాలీగా హైదరాబాద్ వెళ్లి పార్టీలో చేరాలని ఆయన భావిస్తున్నారు. శుక్రవారం ఎల్.రమణతోపాటు టీఆర్ఎస్లో చేరితే తనకు ప్రాధాన్యత ఉండదని భావించిన కౌశిక్ రెడ్డి.. 21వ తేదీని ఎంచుకున్నట్లు సమాచారం. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా కౌశిక్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తారా? అనే అంశం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డికి హుజూరాబాద్ టికెట్టు ఇవ్వాలని కేసీఆర్ భావిస్తేనే స్వయంగా తానే పార్టీ కండువా కప్పి పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంది. లేదంటే ఈ సస్పెన్స్ మరికొంత కాలం కొనసాగుతుందని పార్టీ వర్గాల అంచనా. కౌశిక్ అభ్యర్థిత్వంపై తర్జనభర్జన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతూ ‘హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాకే’ అని పాడి కౌశిక్ రెడ్డి మాజీ టీఆర్ఎస్ నాయకుడితో జరిపిన ఫోన్ సంభాషణ రచ్చకెక్కడంతో గులాబీ నేతలు విస్తుపోయారు. దీంతో కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్ అధిష్టానం పార్టీ టికెట్టుపై కచ్చితమైన హామీ ఇచ్చిందనే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. అదే సమయంలో కౌశిక్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీఆర్ఎస్కు కోవర్టుగా వ్యవహరించారనే అపవాదు కూడా వచ్చింది. టీఆర్ఎస్లో చేరిన వెంటనే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఒక్కొక్కరికి రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఇచ్చి లాగాలని, మద్యం, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని లీకైన ఫోన్ సంభాషణల్లో ఉండడంతో టీఆర్ఎస్ నేతలు నోరు మెదపలేదు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత మంత్రులు, ముఖ్య నాయకులు ప్రచారానికి కూడా హుజూరాబాద్ వైపు వెళ్లకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరినా, పార్టీ టికెట్టు ఇస్తారా అనే విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కౌశిక్ పార్టీలో చేరితే ఎలాంటి ఫలితం ఉంటుందనే విషయంలో టీఆర్ఎస్ ఇంటలిజెన్స్ విభాగం నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. కౌశిక్‌రెడ్డి ఫోన్ సంభాషణల లీక్‌తో పార్టీ ప్రతిష్టకు ఇబ్బంది కలిగిందా? ప్రజలు పార్టీని చూసి ఓటేస్తారా.. అభ్యర్థిని చూశా? అనే విషయమై అధిష్టానం దృష్టి పెట్టింది. కౌశిక్‌రెడ్డి కాకపోతే ఈటలను ఢీకొట్టే గట్టి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కూడా అధిష్టానానికి స్పష్టత ఉన్నట్లు తెలుస్తోంది. ఫోన్ సంభాషణతో టీఆర్ఎస్ అభ్యర్థి కాగల అవకాశాలకు కౌశిక్‌రెడ్డి స్వయంగా గండి కొట్టుకున్నట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఎల్.రమణపై కేసీఆర్ వ్యాఖ్యల్లో అంతరార్థం..? ‘రమణ టీఆర్ఎస్లో చేరడం వల్ల పార్టీకి చేనేత వర్గానికి చెందిన నాయకుడు లేడనే లోటు భర్తీ అయింది. గతంలో ఈ వర్గం నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా ఉండేవారు. గత ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రమణ విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ వింటారు. ఆయనకు తగిన పదవి ఇస్తా’ అని శుక్రవారం టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీలో చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చింత ప్రభాకర్ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చేతిలో ఓడిపోయిన తరువాత అసెంబ్లీలో ఈ వర్గానికి ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎల్.రమణకు హుజూరాబాద్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తారా! అనే చర్చ మొదలైంది. అయితే.. జగిత్యాలకు చెందిన ఎల్.రమణ స్థానికేతర అభ్యర్థి కావడం మైనస్ అవుతుందని, ఆయన ద్వారా చేనేత, బీసీ వర్గం ఓటర్లను ఆకర్షించాలని పార్టీ భావిస్తోందని టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇతర నాయకుల ప్రయత్నాలు కౌశిక్‌రెడ్డి వ్యవహారం రచ్చకెక్కిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలువురు నాయకులు ప్రయత్నిస్తున్నారు. 2009, 2010లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి, ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్న బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణ మోహన్ రావు తన అవకాశాలు సజీవంగా ఉన్నాయని భావిస్తున్నారు. బీసీ నాయకుడిగా, గతంలో రాజేందర్‌కు గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తిగా తనకు అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కూడా పార్టీ అభ్యర్థిత్వంపై ఆశతో ఉన్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి టీఆర్ఎస్ టికెట్టు ఇస్తే పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ, ఆయనతో సంప్రదింపులు జరగలేదు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కుటుంబాన్ని ఎంత మేర పరిగణలోకి తీసుకుంటారో తెలియదు. ఏదేమైనా.. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. పార్టీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ కూడా ఈ విషయంలో ఏమీ మాట్లాడకుండా ‘పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమని’ అంటున్నారు. -
టీఆర్ఎస్ అభ్యర్థిగా ‘నోముల భగత్’
హైదరాబాద్: నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. భగత్‌కు పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో సోమవారం బీ ఫామ్‌ను అందజేయడంతో పాటు ఎన్నికల ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్కును కూడా కేసీఆర్ అందజేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు భగత్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మంగళవారంతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనున్న నేపథ్యంలో దివంగత శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య కుమారుడైన భగత్‌ను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. తెలంగాణ భవన్‌కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్న ముఖ్యమంత్రి.. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రావణ్‌కుమార్ రెడ్డి తదితరుల సమక్షంలో భగత్‌కు బీ ఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా భగత్ తల్లి, దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య భార్య లక్ష్మి, కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కేసీఆర్ సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. ‘నోముల నర్సింహయ్యతో ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కుమారుడికి అవకాశం ఇస్తున్నాం. గతంలో మాదిరిగా కాకుండా పార్టీ నేతలందరూ కలసికట్టుగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలి. నేను కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా’అని చెప్పారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో భేటీ సాగర్ టికెట్ ఆశించిన పార్టీ నేతలు ఎంసీ కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ప్రగతిభవన్‌కు వెళ్లారు. కోటిరెడ్డి, చిన్నపరెడ్డితో వేర్వేరుగా సమావేశమైన కేసీఆర్ వారిద్దరినీ బుజ్జగించినట్లు సమాచారం. ‘నాగార్జునసాగర్‌లో పార్టీ గెలిచేందుకు బాధ్యత తీసుకోండి. మీరు స్థానికంగా కష్టపడి పనిచేస్తున్నా కొన్ని పరిస్థితుల్లో అవకాశం ఇవ్వలేక పోతున్నా. భవిష్యత్తులో రాజకీయంగా అనేక అవకాశాలు ఉంటాయి. ఈ ఏడాది మేలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో మీకు శాసనమండలి సభ్యుడిగా అవకాశం ఇస్తా..’అని కోటిరెడ్డికి సీఎం హామీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా కింద మరోసారి అవకాశం ఇస్తానని చిన్నప రెడ్డికి నచ్చజెప్పారు. వారితో కలసి భోజనం చేసిన అనంతరం కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. భగత్‌కు బీ ఫామ్ అందజేసిన తర్వాత పార్టీ నేతలందరూ కలసికట్టుగా పని చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. ‘టికెట్ ఆశించిన నేతలను కూడా కలుపుకొని పార్టీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లాలి. అలాగే ఈ టికెట్ ఆశించినవారు కూడా మనసులో ఇతర అభిప్రాయాలకు తావులేకుండా పనిచేయాలి..’ అని సూచించారు. బీజేపీకి అక్కడ సొంత బలం లేనందునే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన వచ్చేవరకు వేచి చూస్తోందన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పరంగా సర్వేలు చేయించామని, సాగర్‌లో మంచి మెజారిటీతో గెలుస్తున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ఈ సందర్భంగా నోముల నర్సింహయ్య భార్య లక్ష్మిని వారి కుటుంబ బాగోగులను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సామాజికవర్గ సమీకరణాలతోనే భగత్‌కు సాగర్ నియోజకవర్గం పరిధిలో 2.17 లక్షల ఓటర్లు ఉండగా, వీరిలో 34 వేల మందికి పైగా బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 2014, 2018 ఎన్నికల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన నోముల నర్సింహయ్యకు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. నర్సింహయ్య హఠాన్మరణంతో ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఆయన స్థానంలో దుబ్బాక తరహాలోనే ఆయన కుమారుడు భగత్‌కు అవకాశం ఇచ్చారు. నర్సింహయ్య పట్ల ఉన్న సానుభూతి కూడా కలసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేసింది. ఓటర్ల సంఖ్యా పరంగా లంబాడాలు 38 వేలు, రెడ్డి 23 వేలు, మాదిగ 26 వేలు, ముదిరాజ్ 12 వేలకు పైగా ఉండటంతో పార్టీ ఇన్‌చార్జీలుగా అదే సామాజికవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ మోహరించి ప్రచారం నిర్వహిస్తోంది. ఇక జోరుగా ప్రచారం ఉప ఎన్నిక పోలింగ్ ఏప్రిల్ 17న జరగనుండగా వచ్చే పక్షం రోజులు ప్రచారాన్ని హోరెత్తించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. గత నెల 10న హాలియాలో జరిగిన సభలో పాల్గొన్న కేసీఆర్.. ఈసారి త్రిపురారం లేదా నాగార్జునసాగర్ మున్సిపాలిటీలో నిర్వహించే బహిరంగ సభకు హజరవుతారని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రోడ్ షోల్లో పాల్గొంటారని సమాచారం. వీరిద్దరి ప్రచార సభలు, రోడ్ షోల షెడ్యూలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, జాజుల సురేందర్ (తిరుమలగిరి మండలం), కోరుకంటి చందర్ (హాలియా), బాల్క సుమన్ (పెద్దవూర), కంచర్ల భూపాల్‌రెడ్డి (గుర్రంపోడ్), నల్లమోతు భాస్కర్‌రావు (నిడమనూరు), భానోత్ శంకర్ నాయక్ (త్రిపురారం) కోనేరు కోణప్ప (అనుముల), జీవన్‌రెడ్డి (మాడ్గుపల్లి) ఇన్‌చార్జీలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా (కరీంనగర్) చైర్మన్ జీవీ రామకృష్ణారావు ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తా: భగత్ ‘నాన్న నోముల నర్సింహయ్య 2014లో టీఆర్ఎస్లో చేరిన నాటి నుంచి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆయనకు సముచిత స్థానం కల్పించారు. కేసీఆర్ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలే నర్సింహయ్యను గెలిపించాయి. ఆయన వారసుడిగా ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. ఆయన ఆశయాలు నెరవేర్చేందుకు కృషి చేస్తా..’అని భగత్ అన్నారు. బీ ఫామ్ అందుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండేళ్ల లోపే మా నాన్నను కోల్పోయి ఉప ఎన్నిక రావడం దురదృష్టకరం. అయితే నా మీద నమ్మకముంచి టికెట్ కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా’ అని భగత్ అన్నారు. నర్సింహయ్య వారసుడిగా ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. పేరు : నోముల భగత్ తండ్రి : దివంగత నోముల నర్సింహయ్య తల్లి : నోముల లక్ష్మి ప్రస్తుత నివాసం: హాలియా పుట్టిన తేదీ: 10–10–1984 భార్య : నోముల భవానీ పిల్లలు: రానాజయ్, రేయాశ్రీ విద్యార్హతలు: బీఈ, ఎంబీఏ, ఎల్ఎల్ఎం చేసిన ఉద్యోగాలు: సత్యం టెక్నాలజీస్ లిమిటెడ్‌లో జూనియర్ ఇంజనీర్, (2010–2012), విస్టా ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ప్రస్తుతం : హైకోర్టు న్యాయవాది, నోముల ఎన్ఎల్ ఫౌండేషన్ చైర్మన్ -
ఎన్నికల్లో ఓటమి: అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, భూపాలపల్లి : మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టణంలోని 5వ వార్డు నుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసిన సింగనవేన విజేత ఓటమిపాలయ్యారు. దీంతో ఆమె భర్త చిరంజీవి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని వైద్యులు వెల్లడించారు. సంఘటన తెలిసిన అనంతరం మాజీ స్పీకర్, వరంగల్ రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి బాదితుడిని పరామర్శించారు. కాగా 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి చిరంజీవి ఓడిపోగా.. ఈసారి కూడా 78 ఓట్ల తేడాతో ఆయన భార్య ఓడిపోయారు. ఎన్నికల కోసం గతంలో రూ. 8 లక్షలు, ప్రస్తుతం రూ. 15 లక్షలు ఖర్చు చేసినట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
అధినేత ఆశీస్సులెవరికో?
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. అధినేత కేసీఆర్ సూచించిన వారికే జెడ్పీ చైర్మన్ పదవి దక్కనుండటంతో సీఎం ఆశీస్సులు ఎవరికి ఉంటాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాతో ఉంది. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, ఇప్పటికే మాక్లూర్ జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన 26 స్థానాలకు ఎన్నికలు జరగగా, మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. అయితే జెడ్పీ చైర్మన్ రేసులో నలుగురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఏకగ్రీవంగా ఎన్నికైన దాదన్నగారి విఠల్‌రావు, ఇందల్వాయి జెడ్పీటీసీగా బరిలో నిలిచిన జెడ్పీవైస్ చైర్పర్సన్ సుమన రవిరెడ్డి, ధర్పల్లి జెడ్పీటీసీగా పోటీ చేసిన బాజిరెడ్డి జగన్, బోధన్ జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేసిన గిర్దావార్ లక్ష్మి పేర్లు తెరపైకి వచ్చాయి. నేడు వెలువడనున్న ఫలితాలను బట్టి గెలుపొందిన వారిలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చైర్మన్ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు చైర్మన్ ఎన్నికపై సంకేతాలు అందాయి. విజయం సాధించిన జెడ్పీటీసీలతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సమావేశం అయ్యే అవకాశాలున్నాయి. చైర్మన్‌తో పాటు, జెడ్పీ వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎన్నికలు అన్నీ అధిష్టానం సూచనల మేరకు జరగనున్నాయి. క్యాంపు రాజకీయాలకు అవకాశం..? చైర్మన్ పీఠంపై కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆశలు పెట్టుకున్నాయి. అవకాశం వస్తే గెలుపొందే ఒకరిద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి పీఠం దక్కించుకునే యోచనలో ఆ పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏకపక్షంగా ఉన్నట్లయితే క్యాంపులకు అవకాశం ఉండదు. కానీ ఆయా పార్టీలకు మ్యాజిక్ ఫిగర్‌కు కాస్త అటు ఇటుగా ఫలితాలు వచ్చిన పక్షంలో క్యాంపు రాజకీయాలకు తెరలేవనుంది. మొత్తం ఇప్పటికే జెడ్పీటీసీ అభ్యర్థులు సోమవారం నగరంలోని పలు హోటళ్లలో బస చేశారు. మొత్తం 27 జెడ్పీటీసీ స్థానాలుండగా, చైర్మన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 14 జెడ్పీటీసీ స్థానాలు గెలవాల్సి ఉంది. అంటే చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థికి 13 మంది మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అధికారుల ముందు జాగ్రత్త.. మంగళవారం ఫలితాలు వెలువడనున్నాయి. జెడ్పీ చైర్మన్ ఎన్నిక ఈనెల 8న, మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక ఈనెల 7న నిర్వహించనున్నారు. మధ్యలో మూడు, నాలుగు రోజులే సమయం ఉంటుంది. విజయం సాధించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు క్యాంపునకు తరలివెళ్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు చైర్మన్, ఎంపీపీ ఎన్నికకు సంబంధించిన నోటీసులు ఇచ్చాకే.., వారు గెలుపొందినట్లు సర్టిఫికేట్ ఇవ్వాలనే యోచనలో అధికారులు ఉన్నారు. లేనిపక్షంలో వారు క్యాంపునకు తరలివెళితే నోటీసులు ఇవ్వడం ఇబ్బందిగా మారనుండటంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. సమన్వయ బాధ్యతలు మంత్రికి.. జెడ్పీ చైర్మన్ ఎంపిక ప్రక్రియ సమన్వయ బా ధ్యతలను జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. రాష్ట్రంలో అన్ని జెడ్పీలను కైవ సం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్న ఆ పార్టీ ఈ మేరకు ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జిని ని యమించింది. ఇన్చార్జులను ఆ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అధిష్టానం నిర్ణయించే వారిని చైర్మన్‌గా గెలిపించుకునేందుకు మిగితా జెడ్పీటీసీలను సమన్వయం చేసే బాధ్యతలను ప్రశాంత్‌రెడ్డికి అప్పగించారు. -
బీఫారం పోయింది... దొరికింది
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ పార్లమెంట్‌కు పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డికి చెందిన బీఫారం, ఇతర సర్టిఫికెట్లు పోవడం కలకలం రేపింది. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతం లో వేమిరెడ్డి మేనేజర్ వెంకటేశ్వర్రావు కాచిగూడ నుంచి బైకుపై బయల్దేరాడు. కాచిగూడ చౌరస్తా వద్దకు రాగానే బైకు వెనకవైపు తగిలించిన సంచి జారిపడిపోయింది. వెనుకనే మరో బైకుపై వస్తున్న హోంగార్డు ముని వెంకటరమణ ఇది గమనించాడు. ఆ సంచిని వెంకటేశ్వర్రావుకు ఇచ్చేందుకు యత్నించినా వీలు కాలేదు. డీజీపీ ఆఫీసులో పనిచేసే ముని వెంకటరమణ కార్యాలయానికి వెళ్లాక ఆ సంచీని తెరి చి చూడగా.. అందులో వేమిరెడ్డి నరసింహారెడ్డికి సంబంధించిన బీఫారం (నకలు), నామినేషన్లకు సంబంధించిన పత్రాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు ఉన్నాయి. అందులో ఆధార్ కార్డులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాడు. కాల్ రిసీవ్ చేసుకున్న ఆయన కుటుంబ సభ్యులు మేనేజర్‌కి డీజీపీ ఆఫీసుకు వెళ్లా లని చెప్పారు. అక్కడికి వెళ్లిన మేనేజర్ వివరాలు ధ్రువీకరించుకున్నాక మునివెంకటరమణ ఆ ఫైల్‌ను అడ్మిన్ ఆర్ఐ జంగయ్య సమక్షంలో అతనికి అందజేశాడు. నిజాయితీగా డాక్యుమెంట్లను ఇచ్చిన హోంగార్డును ఉన్నతాధికారులు అభినందించారు. -
రీలాక్స్ అవుతున్న పార్టీల అభ్యర్ధులు
జోగిపేట(అందోల్): అందోల్ నుంచి పోటీలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం కార్యకర్థలు, ముఖ్యనేతలతోనే గడిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ శనివారం తన స్వగ్రామమైన వట్పల్లి మండలం పోతిరెడ్డిపల్లిలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో గడిపారు. పోలింగ్ సరళిపై, శాతం, మెజారిటీ తదితర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన వివరాలపై సంతృప్తి వ్యక్తం చేసారు. తప్పకుండా గెలుపొందుతామన్న ధీమాను వ్యక్తం చేసారు. దామోదర సైతం.. సంగారెడ్డిలోని తన ఇంట్లో కాంగ్రెస్ అభ్యర్థి సి.దామోదర రాజనర్సింహా కార్యకర్తలతో చర్చిస్తూ గడిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు సంగారెడ్డికి తరలివెళ్లారు. మండలాల వారిగా పార్టీకి ఎంతెంత పోలయ్యిందన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. మనమే గెలుపొందుతామని కార్యకర్తలకు ఆయన చెప్పినట్లు సమాచారం. మనుమరాళ్లతో బాబూమోహన్ జోగిపేట(అందోల్): పోలింగ్ ముగియడంతో అందోల్ బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి పీ. బాబూమోహన్ తన మనుమరాళ్లు ఆన్యా, శనాయాతో సరదాగా గడిపి రిలాక్స్ అయ్యారు. 20 రోజులుగా ప్రచార నిమిత్తం నియోజకవర్గంలోనే ఉండిపోవడంతో ఆయన ఇంటివైపు వెళ్లలేదు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో శనివారం అంతా ఆనందంగా గడిపారు. సరదాగా గడిపిన సతీశ్‌బాబు హుస్నాబాద్: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్‌కుమార్ శనివారమంతా కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్‌లోని తన ఇంజనీరింగ్ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్‌తో కలిసి సరదాగా మార్నింగ్ వాక్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. జహీరాబాద్ అభ్యర్థుల విశ్లేషణలు ముఖ్య నేతలతో సమావేశమైన గీతారెడ్డి జహీరాబాద్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జె.గీతారెడ్డి శనివారం సైతం బిజీ బిజీగా గడిపారు. గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆమె తీరిక లేకుండా గడిపారు. శుక్రవారం జరిగిన ఎన్నికల సందర్భంగా గీతారెడ్డి ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గం అంతా పర్యటించి అలసిపోయారు. అయినా శనివారం సైతం పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస భేటీలు నిర్వహించారు. ఎన్నికల సరళి గురించి గ్రామ స్థాయి, మండల స్థాయి నాయకులు గీతారెడ్డి ఇంటి వద్దకు వచ్చి ఆమెకు వివరాలు అందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏ మేరకు ఓట్లు పోలయ్యాయనే విషయమై ఆరా తీశారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలింగ్ జరిగిందని పార్టీ నేతలు వివరించారు. భారీ మెజార్టీతో గెలుపొందుతున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు గీతారెడ్డికి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు పయనమయ్యారు. మాణిక్ రావు సైతం.. నెల రోజులుగా టీఆర్ఎస్ అభ్యర్థి కె.మాణిక్‌రావు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపారు. శుక్రవారం ఎన్నికలు జరుగుతున్నంత సేపు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. శనివారం సైతం కార్యకర్తలు, నేతలతో గడిపారు. భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సాయంత్రం మాణిక్‌రావు పార్టీ ముఖ్య నేతలను కలిసేందుకు హైదరాబాద్ తరలి వెళ్లారు. తన విజయం కోసం శ్రమించినందుకు ఎమ్మెల్సీ ఎం.డి.ఫరీదుద్దీన్‌ను మాణిక్‌రావు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. శ్రేణుల సమక్షంలో సంబరం కార్యకర్తల సమక్షంలో పెళ్లి రోజు జరుపుకొన్న ఆకుల రాజయ్య, గజమాలతో సన్మానించిన అభిమానులు మెదక్ అర్బన్: మెదక్ బీజేపీ అభ్యర్థిగా అనూహ్యంగా తెరమీదకు వచ్చి.. వినూత్నంగా ప్రచారం నిర్వహించి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు ఆకుల రాజయ్య. గత పదిరోజులుగా ప్రచారంలో బిజీబిజీగా గడిపిన రాజయ్య శనివారం మెదక్‌లో కార్యకర్తల నడుమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కుటుంబ సభ్యులు భారీగా హాజరయ్యారు. రాజయ్య, స్వరూపరాణి దంపతులను గజమాలతో సన్మానించారు. సేద తీరిన సోలిపేట దుబ్బాకటౌన్: గత రెండు నెలలుగా ప్రచారంలో తీరికలేకుండా గడిపిన దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట జ్వరం రావడంతో శనివారం అంతా ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకున్నారు. తన వద్దకు వచ్చిన కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. 50 వేల పై చిలుకు భారీ మోజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. చాలా రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ విరామం లేకుండా ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి మాదవనేని రఘునందన్‌రావు ఎన్నికలు ముగియడంతో తన కూతురు వివాహ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 12న ఆయన కూతురు సింధు వివాహం నిశ్చయమైంది. ఈ సందర్భంగా సాక్షితో రఘునందన్ మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల ఆశిస్సులతో తాను గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటిపట్టునే ఖేడ్ అభ్యర్థులు మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి, ఇతర నేతలతో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్ నారాయణఖేడ్: దాదాపు పక్షం రోజులుగా ఎన్నికల ప్రచారంలో గడిపిన ఖేడ్ ప్రధాన పార్టీల అభ్యర్థులు శనివారం ఇళ్లలోనే ఉండి సరదాగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. ఫలితాలు ఎలా ఉంటాయోన్న ఆందోళన ఎవ్వరిలో కనిపించక పోవడం విశేషం. సరదాగా గడిపిన సతీశ్‌బాబు హుస్నాబాద్: దాదాపు 45 రోజులుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపిన హుస్నాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి సతీశ్‌కుమార్ శనివారమంతా కుటుంబ సభ్యులతో గడిపారు. వరంగల్‌లోని తన ఇంజనీరింగ్ కళాశాలలో కుమారుడు ఇంద్రనీల్‌తో కలిసి సరదాగా మార్నింగ్ వాక్ చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. స్నోబాల్ ఆడుతూ మన పార్టీ అభ్యర్థి.. నారాయణఖేడ్: ఖేడ్ నుంచి మన పార్టీ తరఫున పోటీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మురళీగోవింద్ శనివారం స్నోబాల్ ఆడి రిలాక్స్ అయ్యారు. దాదాపు 20 రోజులుగా నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఆయన శనివారం హైదరాబాద్ వెళ్లారు. మెదక్‌జోన్: మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి శనివారం పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలోని తన ఇంటిలో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. గత 20 రోజులుగా ఎన్నికల ప్రచారంలో ఆయన తీరిక లేకుండా గడిపారు. కుటుంబ సభ్యులతో ఉపేందర్‌రెడ్డి -
పెద్దపల్లి: మాట నిలబెట్టుకున్నా.. దాసరి మనోహర్ రెడ్డి
పెద్దపల్లి ప్రజలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నెరవేర్చి మాట నిలబెట్టుకున్న. రైతు బిడ్డగా రైతులకు కావాల్సిన చెరువులు, కుంటలు మరమ్మతు చేయించి రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన. రికార్డు స్థాయిలో మిషన్‌కాకతీయ పనులు జరిగాయి. పనులు చేశాను కాబట్టే మళ్లీ రెండోసారి ఓట్లు అడుగుతున్న. ప్రజలు ఆశీర్వదిస్తే అభివృద్ధిని చెట్టింపు చేస్తా.’ అని టీఆర్ఎస్ పెద్దపల్లి అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు కోరుతున్న దాసరి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నాలుగున్నరేళ్ల పాలనపై అనేక విషయాలను వివరించారు. సాక్షి, పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమాన్ని నడిపించడంలో నా వంతు పాత్రను గుర్తించిన ఓటర్లు 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించారు. అందుకు కృతజ్ఞతగా పెద్దపల్లి నియోజకవర్గానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాను. రైతులకు అవసరమైన సాగునీటి వనరులను అభివృద్ధి చేశాను. మానేరు వాగుపై మూడు చోట్ల చెక్‌డ్యాం నిర్మించడం ద్వారా మానేరు నుంచి రైతులు పంటలకు నీళ్లు తీసుకుంటున్నారు. హుస్సేన్మీయా వాగుపై నాలుగు చోట్ల చెక్‌డ్యాంల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి నిధులు మంజూరు చేయించాను. పెద్దపల్లిపట్టణంలో ఎన్నోఏళ్లుగా ఇక్కడి ప్రజలు కలగంటున్న మినీ ట్యాంకు బండ్ నిర్మాణం వెనుక నా శ్రమని స్థానికులు గుర్తించారు. ప్రత్యేకించి నిబంధనల కంటే అదనంగా పనులు చేయించాను. మినీ ట్యాంకు బండ్ నిర్మాణంలో అవంతరాలు ఎదురైనా వాటిని అధిగమించి పనులు చేయించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బొంపెల్లి తాగునీటి ఫిల్టర్ ప్రాజెక్టును పూర్తిచేయించి వాటి ద్వారా పెద్దపల్లి ప్రజలకు దాహర్తి తీర్చగలిగాను. గోదావరి జలలాను పెద్దపల్లి ప్రజలకు అందించాను. జిల్లా హోదా దక్కిన పెద్దపల్లిని తెలంగాణ పటంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే కలెక్టరేట్ భవన నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. రెండు, మూడునెలల్లో కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తాం. ప్రభుత్వం రైతులకు రైతుబంధు స్కీం ద్వారా నియోజకవర్గంలో 62 వేల మందికి ప్రయోజనం కలిగింది. అలాగే 15 వేల మంది గొర్రెల కాపారుల కుటుంబాలకు ప్రయోజనం చే కూర్చాను. కల్యాణలక్ష్మి, షాదీముబరాక్ పథకాల ద్వారా 4,500 మంది ఆడబిడ్డల పెళ్లిల్లకు లబ్ధి చేకూర్చాను. నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నవారికి, చికిత్స చేయించుకున్నవారికి రూ.10 కోట్లు మంజూరు చేయించాను. వివిధ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2,300 కోట్లు వెచ్చించాను. గత ప్రభుత్వాలు, గత ఎమ్మెల్యేలతో పోలిస్తే తన పాలన సమయంలో 20 రెట్లు అభివృద్ధి చేశాను. ముఖ్యమంత్రితో అవార్డు మర్చిపోలేనిది.. పెద్దపల్లి నియోజకవర్గంలో పండ్ల మొక్కల నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ప్రసంశలు అందుకోవడం మర్చిచిపోలేనిది. సాక్షాత్తు అసెంబ్లీ సమయంలో ముఖ్యమంత్రి తనకు హరితమిత్ర అవార్డును అందిస్తూ అభినందించిన తీరు గుర్తుండి పోయింది. పలు సందర్భాల్లో హరితహారం గురించి ప్రస్తావన వేళ తనను మంత్రి మండలి సైతం ఆదర్శంగా తీసుకోవడం వెనుక పెద్దపల్లి ప్రజల సహకారం ఉంది. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ ఓటు వేయాల్సిందిగా కోరాను. తిరిగి రెండోసారి అధికారం అప్పగిస్తే గతం నేర్పిన అనుభవాలు పెద్దపల్లి అభివృద్ధికి తోడ్పాడుతాయని నమ్ముతూ ప్రజల ఆశీర్వాదం కోరుతున్న. -
అభ్యర్థుల ప్రచార హోరు..
సాక్షి, కొత్తగూడెం: నామినేషన్ల సమర్పణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగు ఎస్టీ రిజర్వ్డ్ కాగా, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానం. అన్ని చోట్లా ప్రధాన పోటీదారులుగా నాలుగు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థులు ప్రధానంగా రేసులో ఉన్నారు. జిల్లాలో వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్ఎఫ్ సైతం బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ జాబితా రెండున్నర నెలల క్రితమే ఖరారు కావడంతో ఆయా అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూటమిలో పినపాక మినహా ఇతర నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఎవరికి వారు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకోవాల్సి వచ్చింది. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా టికెట్ల కోసం ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. తాటికి నిరసన సెగ.. అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు రెండు నెలలుగా ప్రచారానికి వెళ్లిన సమయంలో పలుసార్లు వివిధ గ్రామాల ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ నిరసనల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో అనేక గ్రామాల్లో ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు వ్యతిరేకత ఎదురైంది. తాజాగా శుక్రవారం చంద్రుగొండ మండలంలో మరింత సెగ తగిలింది. మండలంలోని పోకలగూడెం గ్రామంలో స్థానికులు తాటిపై చెప్పులు, రాళ్లు విసిరేశారు. తమ గ్రామానికి ఏమి చేశావని నిలదీశారు. దీంతో గత్యంతరం లేక వెనుదిరిగి వెళ్లారు. ఇక పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా పోరు సైతం పోటాపోటీగానే ఉంది. ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతమేరకు అధిగమిస్తూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రియ బరిలోకి దిగడంతో ప్రచార పర్వం హోరెత్తింది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కనకయ్యకు, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లో హరిప్రియకు పట్టు ఉంది. మరోవైపు గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీపరుడిగా పేరున్న సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య సైతం బరిలో ఉన్నారు. ఆయనకు సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్ఎఫ్ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి పోటీలో ఉన్నారు. బీజేపీకి ఇల్లెందు పట్టణంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది. భద్రాచలం నియోజకవర్గం సీపీఎం సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబూరావు గట్టి పోటీదారుగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు గత రెండున్నర నెలలుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ కూడా బహుముఖ పోటీ నెలకొంది. -
హూజూర్‌నగర్‌లో టీఅర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి భారీ ర్యాలీ
-
సొంతగూటికి' తండు '
తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదులుగౌడ్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సాక్షి, నల్లగొండ : తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు, బీసీ నాయకుడు తండు సైదులుగౌడ్ సొంతగూటికి చేరారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసి సీఎల్పీ మాజీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో కాంగ్రెస్‌పార్టీ నుంచి తిప్పర్తి జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు. ఆ సమయంలో బీసీ నేతగా తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనల మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. నియోజకవర్గం కలియదిరుగుతూ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం కల్పిస్తుందనే ఉద్దేశంతో పనిచేస్తూ వచ్చారు. చివరిదశలో టికెట్ ఇతరులకు కేటాయించడంతో మనస్తాపానికి గురయ్యారు. టీఆర్ఎస్ పార్టీలో సీనియర్లను గౌరవించడం లేదంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఇండిపెండెంట్‌గా అగ్రనాయకులతో మంతనాలు ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టీఆర్ఎస్ అభ్యర్థికి మేలు జరిగే అవకాశం ఉన్నందున ఒక అడుగు వెనక్కివేసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీనియర్ నాయకుడు జానారెడ్డి, ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తండు సైదులుగౌడ్‌తో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది బీసీ నేతగా మంచి అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందులో భాగంగా సోమవారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో ఆయన నామినేషన్ సందర్భంగా వేలాది మంది కార్యకర్తలతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది. ఈ సందర్భంగా తండు మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా, టీ.పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, సీనియర్ నాయకులు జానా, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధు యాష్కీగౌడ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు జెడ్పీ చైర్మన్‌గా బీసీకి అవకాశం వచ్చినా, జనరల్‌కు అవకాశం వచ్చినా తనకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. తాను బరిలో ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థికి మేలు అయ్యే అవకాశం ఉన్నందున కోమటిరెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. టీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారడంతో పాటు పార్టీని విమర్శించిన వారికే అవకాశాలు కల్పించడం తనకు నచ్చనందుననే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. -
ఖమ్మం జిల్లా వైరాలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం
-
సూర్యాపేటలో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్‌రెడ్డి ప్రచారం
-
‘పైళ్ల’ను అధిక మెజార్టీతో గెలిపించాలి
సాక్షి,భువనగిరిటౌన్ : భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు గోమారి సుధాకర్‌రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని 28వ వార్డులో కిసాన్‌నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైళ్ల శేఖర్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరోసారి పట్టణ అభివృద్ధిని చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, అమ్జద్అలీ, పద్మ, జైయిని రవిందర్‌గుప్తా, సరగడ కరణ్, రవి, స్వప్న, బ్రహ్మచారి, రమేష్‌పాల్గొన్నారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో.. టీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో నియోజకవర్గ టీఆర్ఎస్ కోకన్వీనర్ ఆకుల జయమ్మ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మ, కె.యాదమ్మ, శిరీష, నర్మద, జయలక్ష్మి, పద్మ, రాధిక, శ్యామల, జ్యోతి, ఉమా, ఇందిరలు పాల్గొన్నారు. ‘పైళ్ల గెలుపు ఖాయం’: భూదాన్‌పోచంపల్లి : వచ్చే ఎన్నికల్లో పైళ్ల శేఖర్‌రెడ్డి గెలుపు ఖాయమని టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోట మల్లారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని శివారెడ్డిగూడెంలో వారాల రాంచంద్రారెడ్డి, బొక్క ధర్మారెడ్డి ఆధ్వర్యంలో హామాలీసంఘం సభ్యులు 35 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. మరోసారి టీఆర్ఎస్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో వారాల అంజిరెడ్డి, వంగాల ధనుంజయ్య, బొడిగె మల్లయ్య, వెంపాల సంజీవరెడ్డి, నారి శ్రీశైలం, పెద్దిరెడ్డి శ్రీను, సంజీవరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో మేకల దేవేందర్‌రెడ్డి, మేకల రవీందర్‌రెడ్డి, బొక్క మల్లారెడ్డి, ఏర్పుల రమేశ్, మేకల ప్రభాకర్‌రెడ్డి, సరసాని నర్సిరెడ్డి, వారాల వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి పాల్గొన్నారు. -
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
సాక్షి,నేరేడుచర్ల : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నేరేడుచర్లలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరిన వారికి కండువాలు కప్పి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టక పోగా ప్రజలకు అందుబాటులో లేకుండాపోయారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రజాదరనను చూసి ఓర్వలేక డబ్బుతో నాయకులను కొనుగోలు చేసి వ్యాపారం మొదలు పెట్టారన్నారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరులేదని ఎవరికి టికెట్ వచ్చినా కలిసికట్టుగా పనిచేసి హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు పాలా ్వయి కృష్ణమూర్తి, జగతయ్య, ఎలీషా, సందీప్‌రెడ్డి, జాని, శ్రీను, రాజేష్, రాంరెడ్డి, బాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
14 న ముహూర్తం
సాక్షి ప్రతినిధి, వరంగల్: టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ల ముహూర్తం ఖరారైంది. మెజార్టీ అభ్యర్థులు ఈనెల 14వ తేదీన నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. వేద శాస్త్రాల ప్రకారం ఆ రోజున తిథి, నక్షత్రాలు బాగున్నాయని వేద పండితులు తేల్చి చెప్పడంతో అదే రోజున నామినేషన్లు వేసేందుకు వారు మొగ్గు చూపుతున్నారు. జన సమీకరణ కుదరకపోతే ముందు ఒంటరిగా ఒక సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించి, మరో రోజు భారీ ఊరేగింపుతో వెళ్లి రెండో సెట్ పత్రాలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ వచ్చి బీ–ఫారాలు తీసుకుని వెళ్లాలని ‘గులాబీ’ దళపతి కేసీఆర్ నుంచి అభ్యర్థులకు ఆహ్వానం అందింది. వచ్చేటప్పుడు కచ్చితంగా ఓటరు గుర్తింపు కార్డు, నేరచరిత్ర ఉంటే ఆ వివరాలను వెంట తీసుకుని రావాలని ఆయన ఆదేశించారు. దీంతో అభ్యర్థులందరూ ఆదివారం హైదరాబాద్‌కు పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నారు.ఈ నెల 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నెల19తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగుస్తుండడంతో తిథి, నక్షత్రాలు చూసుకుని నామినేషన్లు వేసేందుకు వీలుగా ముందస్తుగానే బీ–ఫారాలు ఇస్తున్నారు. నేర చరిత్ర ఉంటే.. అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్‌కు చేరుకోవాలని కేసీఆర్ సూచించారు. నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికాకుండా ఉండేందుకు ప్రతి సాంకేతిక పరమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించే విధానాన్ని వివరించే అవకాశం ఉంది. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటారని.. అదే పేరును బీ–ఫారంపై రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం నేరచరిత్రపై రెండు పత్రికలు, టీవీలలో ప్రచారం చేయాల్సి ఉన్నందున వాటికి సంబంధించిన పత్రాలు తేవాలన్నారు. నేర చరిత్రకు సంబంధించిన పత్రికా ప్రకటనలను టీఆర్ఎస్ అధిష్టానమే అభ్యర్థుల తరఫున ఇవ్వనున్నట్లు తెలిసింది. జాతకం కూడా బయటపెడతారు.. బీ–ఫారాల అందజేతతోపాటు అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను గులాబీ దళపతి వివరించే అవకాశం ఉంది. అలాగే సెప్టెంబర్ 6న అభ్యర్ధులను ప్రకటించారు. అంటే దాదాపు రెండు నెలల కాలం అయింది. అభ్యర్థుల ప్రకటన తర్వాత కేసీఆర్ సర్వే చేయించారు. ఈ సమావేశంలో తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేయనున్నట్లు సమాచారం. మెజార్టీ సభ్యులు 14వ తేదీనే.. టీఆర్ఎస్ అభ్యర్థుల్లో మెజార్టీ సభ్యులు ఈనెల 14న నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. జనగామ అభ్యర్ధి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ములుగు అభ్యర్థి అజ్మీరా చందూలాల్, స్టేషన్ ఘన్పూర్ అభ్యర్థి రాజయ్య, వరంగల్ పశ్చిమ అభ్యర్థి వినయ్ భాస్కర్, నర్సంపేట అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి, పరకాల అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి శంకర్‌నాయక్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట అభ్యర్థి ఆరూరి రమేష్ మాత్రం ఈనెల 19న నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. 14వ తేదీనే ఎందుకు..? వారాధిపతి బుధుడు, సప్తమి తిథి , శ్రవణానక్షత్రం, నక్షత్రాధిపతి చంద్రుడు (కార్తీకమాసం) అన్నీ కలిసి వచ్చిన శుభదినం. శ్రవణా నక్షత్రం అనగా శుభకారకుడైన చంద్రుడు. చంద్రుని ఆశీర్వాదాన్ని కోరుకుని పనులు ప్రారంభించిన వారి మాటలను ఎదుటివారు అంగీకరిస్తారు. ఎదుటివారి నుంచి వచ్చే కోపావేశాలు తగ్గిపోతాయి. ఉదయం 10.43 వరకు వర్జ్యం ఉంటుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు ఉన్న మకరలగ్నానికి ఏకాదశస్థానంలో గురు, బుధ గ్రహాలు శుభదృష్టితో ఉంటాయి. కాబట్టి ఇవి శుభ ఘడియలుగా భావిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 3.30గంటల వరకు మీన లగ్నంలో గురు, బుధ గ్రహాలు 9వ స్థానంలో ఉండడంతో పాటు మకర లగ్నంలో చంద్రుడు, కేతువు 11వ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయంలో తలపెట్టిన కార్యాలు అనుకూల విజయానికి దారి తీస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఎక్కువ మంది ఇవే ఘడియల్లో నామినేషన్లు వేయడానికి సిద్ధమయ్యారు. 19వ తేదీ ఏకాదశితో పాటు శివప్రీతికరమైన కార్తీక మాస సోమవారం కాబట్టి కలిసివస్తుందని.. ఈ రోజున నామినేషన్లు దాఖలుచేసేందుకు ఎర్రబెల్లి, అరూరి సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
చలో హైదరాబాద్..!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆదివారం హైదరాబాద్‌కు తరలనున్నారు. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత కేసీఆర్ ఉమ్మడి జిల్లా కీలక నేతలతో ఇలా భేటీని నిర్వహించడం ఇది మూడోసారి. సెప్టెంబర్ 6న అభ్యర్థుల ప్రకటన సందర్భంగా కీలక సమావేశం నిర్వహించిన గులాబీ దళపతి కేసీఆర్ ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలోనూ అందరితో మాట్లాడారు. బి–ఫారాల పంపిణీతోపాటు సోమవారం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మరోమారు ఉమ్మడి జిల్లా అభ్యర్థులు, సీనియర్లతో కీలక భేటీని నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే సమావేశం కోసం ఒక గంట ముందుగానే రావాలని అభ్యర్థులకు ప్రగతిభవన్ నుంచి అందిన సమాచారం మేరకు ఉదయమే బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ 12న వెలువడనున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించే సమావేశం కీలకమైందిగా టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలోనే బి–ఫారాలను అందజేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ భవన్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 12 మందికి కూడా వీటిని పంపిణీ చేస్తారు. ఇప్పటివరకు ప్రకటించిన స్థానాల అభ్యర్థులను మాత్రమే ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒకవేళ ఆదివారం సాయంత్రంలోపు మిగిలిన చొప్పదండి నియోజకవర్గం అభ్యర్థి పేరు ఖరారైతే.. ఆ అభ్యర్థిని కూడా ఆహ్వానించి బి–ఫారం అందజేస్తారని సమాచారం. కాగా.. ఈనెల 12 నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 19 వరకు కొనసాగనుండగా, రెండు నెలల క్రితమే (సెప్టెంబరు 6న) అభ్యర్థులను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా నామినేషన్ల ప్రక్రియను పురస్కరించుకొని బి–ఫారాలను అందజేయడంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా వుండగా బి–ఫారాల అందజేతతోపాటు ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు ఎన్నికలపై సీఎం కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారని సమాచారం. ఎన్నికలకు ముందు అందరు అభ్యర్థులతో కలిసి నిర్వహించే చివరి సమావేశమైనందున.. ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, ఇతర అంశాలను ముఖ్యమంత్రి వివరిస్తారని తెలిసింది. తాజాగా వచ్చిన సర్వే నివేదికలను సైతం వారికి అందజేసే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత ‘సాక్షిప్రతినిధి’కి తెలిపారు. ఏం చేశారు, ఏం చేయాలి...? భేటీలో అభ్యర్థులకు కేసీఆర్ క్లాస్.. టీఆర్ఎస్ అభ్యర్థులు ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకే ఓటరు గుర్తింపు కార్డుతో తెలంగాణభవన్ చేరుకొని, ఎవరికైనా నేరచరిత్ర ఉంటే వాటి వివరాలను ఇవ్వాలని కూడా సమాచారం పంపినట్లు చెప్తున్నారు. ఓటరు గుర్తింపుకార్డులో ఉన్న పేరునే ప్రామాణికంగా తీసుకుంటామని, బి–ఫారాలపై అలానే అభ్యర్థుల పేర్లు రాసి ఇవ్వనున్నట్లు కూడా సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అభ్యర్థులను ప్రకటించిన సుమారు 64 రోజుల వ్యవధిలో ఏం చేశారు? ఇక ముందు ఏం చేయాలి? ప్రచారంలో ఎలా దూసుకు పోవాలి? ఆయా నియోజకవర్గాల్లో ఎవరి పరిస్థితి ఏమిటి? ఈ రెండు నెలల వ్యవధిలో అభ్యర్థుల ‘గ్రాఫ్’ ఏమిటి? ప్రజల్లో పార్టీ, ప్రభుత్వం పరిస్థితి? తదితర అంశాలపై అధినేత కేసీఆర్ చర్చించనున్నారని తెలిసింది. అభ్యర్థులను ప్రకటించిన రెండు నెలల్లో ఏం చేశారు? భవిష్యత్‌లో ఏం చేయాలి? ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రచారం ఎలా ఉండాలి? ప్రధాన అంశాలు, అస్త్రాలు ఏమిటి? అన్న విషయాలపై కేసీఆర్ క్లాస్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎన్నికల పాక్షిక ప్రణాళికలో కేసీఆర్ తొమ్మిది హామీలను ప్రకటించిన కేసీఆర్, తుది ప్రణాళిక కోసం కేశవరావు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు కమిటీలతో శనివారం భేటీ అయ్యారు. కీలకంగా నిర్వహించే ఆదివారం నాటి సమావేశంలో తుదిప్రణాళికపైన చర్చిస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాలో అభ్యర్థులుగా ప్రకటించిన మంత్రులు ఈటల రాజేందర్ (హుజూరాబాద్), కేటీఆర్ (సిరిసిల్ల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), గంగుల కమలాకర్ (కరీంనగర్), రసమయి బాలకిషన్ (మానకొండూరు), దాసరి మనోహర్‌రెడ్డి (పెద్దపల్లి), సోమారపు సత్యనారాయణ (రామగుండం), సీహెచ్ రమేష్‌బాబు (వేములవాడ), పుట్ట మధుకర్ (మంథని), కె.విద్యాసాగర్‌రావు (కోరుట్ల), వి.సతీష్‌కుమార్ (హుస్నాబాద్), డాక్టర్ సంజయ్‌కుమార్ (జగిత్యాల) ఈ సమావేశానికి హాజరుకానున్నారు. -
మా తాతను గెలిపించండి...
మహబూబ్‌నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్‌కు మద్దతుగా ఆయన భార్యతో పాటు కుమార్తె ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు సోమవారం పట్టణంలోని రామయ్యబౌలిలో శ్రీనివాస్‌గౌడ్ మనుమరాలు సిద్దిక్ష సైతం ప్రచారానికి హాజరైంది. తన తన మనుమరాలితో కలిసి శ్రీనివాస్‌గౌడ్ ప్రచారం పాల్గొనడం ఆకట్టుకుంది. – జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) -
మన పదవి మనకే
► జిల్లా అభ్యర్థికే రాజ్యసభ టికెట్ ► కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు అవకాశం ► గుండు సుధారాణికి మొండిచేరుు సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాజ్యసభ ఎన్నికల్లో జిల్లాకు మరోసారి ప్రాధాన్యం దక్కింది. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కెప్టెన్ వడితెల లక్ష్మీకాంతరావుకు అవకాశం వచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ కెప్టెన్ అభ్యర్థిత్వాన్ని గురువారం ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కీలకంగా పనిచేస్తున్న లక్ష్మీకాంతరావుకు అరుదైన అవకాశం కల్పించారు. టీఆర్ఎస్కు శాసనసభలో స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఆయన రాజ్యసభకు ఎన్నిక కావ డం లాంఛనమే. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు కెప్టెన్ లక్ష్మీకాంతరావు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. పార్టీ పరంగా, వ్యక్తిగతంగానూ వీరిద్దరి మధ్య సాన్నిత్యం ఉంది. టీఆర్ఎస్ ప్రస్థానంలో జరిగిన అనేక కార్యక్రమాల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాత్ర ఉంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ అయిన లక్ష్మీకాంతరావుకు కీలకమైన రాజ్యసభ సభ్యత్వం వచ్చింది. సుధారాణికి ఆశాభంగం... జిల్లాలో ప్రస్తుతం ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాపోలు ఆనందభాస్కర్, గరికపాటి మోహన్‌రావు, గుండు సుధారాణి రాజ్యసభ స భ్యులుగా ఉండగా ఇప్పుడు గుండు సుధారాణికి బదులుగా లక్ష్మీకాంతరావు ఎన్నికవుతుండడంతో జిల్లాలోని రాజ్యసభ సభ్యుల సంఖ్యలో మార్పు ఉండదు. జిల్లాకు చెందిన గుండు సుధా రాణి పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆ పదవికి ఎన్నికలు జరుగుతున్నాయి. గుండు సుధారాణి 2010లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికకు ముందు గత ఏడాది అక్టోబరులో ఆమె టీఆర్ఎస్లో చేరారు. రాజ్యసభ సభ్యత్వంపై హామీతోనే టీఆర్ఎస్లో చేరినట్లు ఆమె పలుసార్లు తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. మార్చిలో జరిగిన గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో సుధారాణి కోడలు అశ్రీతారెడ్డికి టీఆర్ఎస్ కార్పొరేటర్ టికెట్ వచ్చింది. అనంతరం సుధారాణి తన కోడలు అశ్రీతారెడ్డికి మేయర్ పదవి కోసం పలు ప్రయత్నాలు చేశారు. కానీ, టీఆర్ఎస్లో కీలకంగా పనిచేసిన నన్నపునేని నరేందర్‌కు ఈ పదవి దక్కింది. దీంతో సుధారాణి మళ్లీ రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి తుమ్మల నాగేశ్వర్రావు రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవి సైతం రాలేదు. దీంతో గుండు సుధారాణి అనుచరుల్లో నైరాశ్యం నెలకొంది. గుండు సుధారాణి రాజ్యసభ పదవీకాలం జూన్ 21తో ముగుస్తోంది. రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు మే 31 చివరి రోజుగా నిర్ణయించింది. జూన్ 11న పోలింగ్ జరగనుంది. లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం ఇదీ.. లక్ష్మీకాంతరావు రాజకీయ జీవితం కాంగ్రెస్‌తో మొదలైంది. లక్ష్మీకాంతరావు సోదరుడు వడితెల రాజేశ్వరరావు 1972 ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1992 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. లక్ష్మీకాంతరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1995 వరకు సింగాపురం గ్రామానికి ఏకగ్రీవ సర్పంచ్‌గా పనిచేశారు. ఇదే గ్రామానికి ఒకసారి ఎంపీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2004 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 జూన్ నుంచి 14 నెలలపాటు మంత్రిగా పనిచేసి రాజీనామా చేశారు. 2008లో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉపఎన్నికలో తిరిగి విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 2009 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్‌గా, ఆ తర్వాత రాష్ట్ర కమిటీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. భారత సైన్యంలోనూ.. లక్ష్మీకాంతరావు చదువుకునే రోజుల్లో ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్లో రాష్ట్ర స్థాయి ఉత్తమ కేడెట్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 1963లో సీనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా భారత సైనిక దళంలో చేరారు. 1965లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. రక్ష మెడల్ పొందారు. 1968 లో సైనిక సేవల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అనంతరం కాకతీయ, ఆంధ్ర యూనివర్సిటీల సెనేట్ సభ్యుడిగా పనిచేశారు. హసన్‌పర్తి, హుజూరాబాద్, రాంటెక్(నాగపూర్)లో ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాద్‌లో విజేత పబ్లిక్ స్కూల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. -
గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. పరోక్ష ఎన్నికల్లోనూ... పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది. ఫలించిన పాలేరు వ్యూహం! పాలేరు ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. -
టీఆర్ఎస్ విజయోత్సవంలో ఘర్షణ
పోచారంలో ఉద్రిక్తత కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.