‘రాజ్యసభ’కు మద్దతివ్వండి: కేకే
అక్బరుద్దీన్, పొన్నాలతో భేటీ సీపీఐ, బీజేపీతోనూ మంతనాలు
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు సోమవారం వివిధ పార్టీల నేతల మద్దతు కోరారు. ఆయన అసెంబ్లీ ఆవరణలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ, మంత్రి పొన్నాల లక్ష్మయ్యలతో వేర్వేరుగా భేటీ అయ్యారు. సీపీఐ, బీజేపీ సభ్యులను కూడా కలసి మద్దతు కోరారు. మంగళవారం ఉదయం 10.45 గంటలకు నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న కేకే.. నామినేషన్ పత్రాలపై టీఆర్‌ఎస్ శాసనసభ్యులతో సంతకాలు చేయించుకున్నారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలకు కేకే మధ్యాహ్న విందు ఇచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో కేకే గెలుపుకోసం టీఆర్‌ఎస్ శాసనసభ్యులతో పాటు ఇతర పార్టీల నుంచి మద్దతు ఇస్తున్నవారితో సమన్వయ బాధ్యతను ఈటెల రాజేందర్, కేటీఆర్‌లకు పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు అప్పగించారు.
ఎంఐఎం పార్టీ సభ్యులతో కేటీఆర్, ఎంపీ జి.వివేక్ మాట్లాడుతున్నారు. సీపీఐ శాసనసభ్యులతో ఈటెల, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ సమన్వయం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి ఆరుగురు సభ్యులకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ ఇద్దరిని మాత్రమే పకటించనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కేకే నామినేషన్ మాత్రమే ఉంటే ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి. అలా కాకుండా కాంగ్రెస్ మద్దతుతో మరో అభ్యర్థి రంగంలో ఉండి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయే పరిస్థితులు ఉంటే నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.