భారత పార్లమెంట్ లోని ఎగువ సభను రాజ్యసభ అంటారు. దీనినే పెద్దలసభ అని కూడా పిలుస్తారు. రాజ్యసభ సభ్యులను వివిధ రాష్ట్రాల శాసనసభల సభ్యులు ఎన్నుకుంటారు కాబట్టి దీన్ని రాష్ట్రాల సభ అని కూడా అంటారు. రాష్ట్రాల నుంచి , కేంద్రపాలిత ప్రాంతాల నుంచి , వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని రాష్ట్రపతి ఎంపిక చెయ్యడం ద్వారానూ, రాజ్యసభ సభ్యులు నియామకం అవుతారు.వీరి పదవీకాలం 6 సంవత్సరాలు ఉంటుంది.ప్రతి రెండేళ్లకొకసారి మూడో వంతు సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో, ఎన్నికలు నిర్వహించి సభ్యులనుఎన్నుకుంటారు. ఇదీ, రాజ్యసభ సభ్యులను ఎంపికచేసుకొనే విధానం. లోక్సభ సర్వశక్తివంతమైనది.రాజ్యసభతో పోల్చుకుంటే,ఎక్కువ హక్కులు లోక్ సభ కలిగి ఉంటుంది.ప్రజల నుంచి నేరుగా ఎన్నిక ద్వారానే లోక్ సభ సభ్యుల ఎంపిక జరుగుతుంది.
ప్రజాప్రతినిధులుగా వీరు,వివిధ పార్టీల నుంచి ఎంపికవుతారు. ఇలా ఈ రెండు సభల నిర్మాణం వెనుకప్రజాహితమే ప్రధాన ఉద్దేశ్యంగా రాజ్యాంగ నిర్మాతలు రూపకల్పన చేశారు.రాజ్యసభను సెకండ్ ఛాంబర్ అనికూడా అంటారు.అంటే,సెకండ్ చెక్ అన్నమాట. రాజ్యసభకు కూడా శాసనాధికారం ఉంటుంది. వివిధ శాసనాలను తీర్మానం చేసే క్రమంలో రాజకీయాలకు,పార్టీలకు అతీతంగా దేశభక్తితో నిర్ణయాలు జరగాలనే గొప్ప ఉద్దేశ్యంతో,సమాంతర వ్యవస్థగా రాజ్యసభను ఏర్పాటుచేశారు.విజ్ఞాన ఖనులు, మేధావులు,సాంస్కృతిక ప్రేమికులు, గొప్ప ప్రజానాయకులు , పరమ దేశభక్తులు,సత్ శీలురు ఈ పెద్దల సభలో సభ్యులుగా ఎంపికవుతారు.
లోక్ సభసభ్యులు పార్టీ ప్రయోజనాలకు అనుగుణంగా బిల్లులు ఆమోదించినప్పటికీ,వీటికి అతీతంగా,వీరు ప్రజాహితం కోరుకుంటూ,అవసరమైతే వీటిని అడ్డుకుంటారు. కొన్ని బిల్లుల విషయంలో,లోక్ సభ సభ్యులు ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నాయని భావించినా, సుదూర భవిష్యత్తు అలోచించి, రాజ్యసభ సభ్యులు వాటిని ఆమోదించకుండా తిప్పికొట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. పెద్దలసభ,అని పేరు పెట్టుకున్నందుకు,నిజంగా పెద్దమనుషులతో ఈ సభలు శోభాయమానంగా ఉండేవి. దురదృష్టవశాత్తు,విలువలు తగ్గుముఖం పడుతూ,అధికారమే పరమావధిగా సాగుతున్న రాజకీయ వ్యవస్థల మధ్య పెద్దలసభలో పెద్దమనుషులు తగ్గుతూ వస్తున్నారు.
రాజకీయ పునరావాస కేంద్రంగా,స్వప్రయోజనాల లక్ష్యంగా, ఇచ్చిపుచ్చుకొనే ధోరణుల మధ్య పెద్దలసభకు కొందరి నియామకాలు జరుగుతూ ఉన్నాయనేది, జారిటీ మేధావులు అభిప్రాయం. ఉభయసభల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే,రాజ్యసభలోనూ అధికార పార్టీకి మెజారిటీ ఉండాలి. ఈ విషయంలో,చాలావరకూ, ప్రతిపక్ష పార్టీలకే మెజారిటీ ఎక్కువగా ఉండే పరిస్థితులను అధికారంలో ఉన్న పార్టీలు ఎదుర్కొంటూ ఉన్నాయి. ఇటువంటి సందర్భాల్లో, రాజ్యసభలో మెజారిటీ కోసం,ప్రతిపక్ష సభ్యులకు ఎరవేసి, లాక్కొనే ప్రయత్నాలు అధికారంలో ఉన్న పార్టీలు చేస్తూ ఉంటాయి. రాజకీయక్షేత్రంలో,ఇది యుద్ధనీతిగా అభివర్ణించుకుంటున్నారు.ఈ అభ్యాసం కొన్నేళ్ల నుంచి పెరుగుతూ వస్తోంది. పెద్దలసభల్లోనూ బడా పారిశ్రామక వేత్తలు,వ్యాపారులు,స్వపక్షీయులు వచ్చి చేరుతున్నారు.
ఈ క్రీడలో యుద్ధనీతి ఎలా ఉన్నా రాజనీతికి తూట్లు పడుతున్నాయి.లోక్ సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో ఆమోదం పొందక, సెలెక్ట్ కమిటీకి వెళ్లి,కాలయాపన జరిగి,ఏళ్ళు పూళ్ళు సాగి, త్రిశంకు స్వర్గంలో నిలిచిపోయిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు: మహిళాబిల్లు.ఈ విధంగా అధికారపార్టీలను ఇరకాటంలో పెట్టి,నైతికంగా గెలిచామనే ఆనందంతో ప్రతిపక్ష పార్టీలు తాండవం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో,ఎన్నో సంస్కరణలకు నోచుకోవాల్సినవి,మెజారిటీ ప్రజలకుఎన్నో ప్రయోజనాలు చేకూర్చేవి, చారిత్రకమైన బిల్లులు కూడా ఉంటాయి.ఇదొక రాజకీయ చదరంగం.రాష్ట్ర పాలనకు సంబంధించి,రాష్ట్రాలలో ఉండే, శాసనమండలిని కూడా ఎగువసభ అంటారు.
ఇక్కడ,అధికార పార్టీకి మెజారిటీ లేక,ప్రతిపక్షాలు బిల్లుల ఆమోదం విషయంలో ఇబ్బంది పెడితే, అధికారంలో ఉన్న పార్టీకి శాసనమండలిని రద్దు చేసుకొనే అధికారం ఉంది. కానీ,రాజ్యసభను రద్దు చేసే అధికారం కేంద్రంలో లేదు. అలా రాజ్యాంగం నిర్మాణం చేశారు. తమకు మెజారిటీ వచ్చిన దాకా ఆగి తీరాల్సిందే. రాష్ట్రాలకు సంబంధించిన పెద్దల సభల్లోనూ ఒకప్పుడు మహనీయులు ఉండేవారు.రాజకీయ సంస్కృతి మారుతున్న నేపథ్యంలో,ఇక్కడా పెద్దమనుషులు కరువవుతున్నారు. ప్రస్తుతం,దేశంలోని ఎక్కువ రాష్ట్రాలలో శాసనమండలి వ్యవస్థలు రద్దయ్యే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ రాజ్యసభ ప్రస్థానాన్ని గమనిస్తే, నిత్యస్మరణీయులైన మహనీయులు సభ్యులుగా పనిచేశారు.శాసనాల రూపకల్పనలో అచంచలమైన దేశభక్తితో, నిస్వార్ధంగా వ్యవహరించారు.
అటు ఎంపికచేసిన పార్టీకి,ఇటు రాజ్యసభకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టారు.నిజంగా దేశ ప్రయోజనాల గురించి ఆలోచించేవారికి ఇది గొప్ప అవకాశం.నియోజకవర్గాల్లోకి వెళ్ళి రాజకీయాలు చేసుకోనక్కర్లేదు.ఓట్ల భయం లేదు.ఖాళీ సమయాల్లో,అద్భుతమైన గ్రంథాలయాల్లో ఉన్న అపార జ్ఞాన సంపదను అక్కున చేర్చుకొని,దేశ ప్రతిష్ఠ పెంచే,సకల జనుల శ్రేయస్సు ప్రసాదించే అద్భుతమైన సలహాలు,సూచనలు పాలకులకు ఇవ్వవచ్చు.ఒకప్పుడు అలాగే సాగేది.నిన్న మొన్నటి వరకూ కూడా,ఎందరో పెద్దలు ఈ పెద్దలసభలకు ఎంపికయ్యారు. వాజ్ పెయి,పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్,ప్రణబ్ ముఖర్జీ, భూపేష్ గుప్తా,అల్లాడి కృష్ణస్వామి అయ్యర్,ఎన్. జి. రంగా, నీలం సంజీవరెడ్డి,బెజవాడ గోపాల్ రెడ్డి,బూర్గుల రామకృష్ణరావు,వల్లూరి బసవరాజు, కాసు వెంగళరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,నార్ల వెంకటేశ్వరరావు,దేవులపల్లి రామానుజరావు, పి. కె. కుమరన్ మొదలైన పెద్దలెందరో ఈ పెద్దల సభలో ఉండేవారు.
రాష్ట్రపతి ఎంపిక చేసినవారిలోనూ ఎందరో పెద్దలు ఉండేవారు.రాజా రామన్న, జాకీర్ హుస్సేన్,అబు అబ్రహాం, శంకర్ కురూప్,ఆర్.కె.నారాయణ్, పండిట్ రవిశంకర్,పృథ్వి రాజ్ కపూర్,లతా మంగేష్కర్,కులదీప్ నయ్యర్. సి.నారాయణరెడ్డి మొదలైన వాళ్ళు పెద్దల సభకు ఎంతో గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చిన గొప్పవాళ్ళు. టెండూల్కర్,జయభాదురీ,రేఖ, హేమామాలిని మొదలైన వాళ్ళు కూడా ఎంపికయ్యారు.కళాకారులు, కవులు,శాస్త్రవేత్తలు,క్రీడాకారులకు గౌరవపూర్వకంగా రాజ్యసభకు ఎంపిక చెయ్యడం ఒక ఆనవాయితీ, ఒక మర్యాద.ఇందులో కొందరు అలంకారప్రాయంగా పదవికి పరిమితమైనవారు,కనీస హాజరు కూడా లేనివారు ఉన్నారు.
జయభాదురీ,డాక్టర్ సి.నారాయణరెడ్డి వంటివారు తమ పదవిని,సమయాన్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నారు.కొందరు పార్టీలకు, ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీలకు వివిధ రూపాల్లో ప్రయోజనాలు చేకూర్చి, తత్ఫలితంగా పదవులు దక్కించుకుంటున్నారనే విమర్శలు ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.చట్ట సభల్లో హుందాగా ప్రవర్తించడం,సర్వ ప్రజాహితంగా నిర్ణయాలు తీసుకోవడం,పదవీకాలాన్ని సద్వినియోగం చెయ్యడం, ప్రజాధనాన్ని వృధా కాకుండా చూడడం ఈ సభ్యుల బాధ్యత. రాజ్యాంగం అమలు అనేది,అమలు చేసే పాలకులమీదనే ఆధారపడుతుందని అంబేద్కర్ ఏనాడో చెప్పారు.ఆచరణలో, పెద్దలసభ రాజకీయాలకు అతీతంగా, సర్వ స్వతంత్య్రమైన వ్యవస్థగా నిలబడాలి. ఉభయ సభలు ఆదర్శవంతంగా సాగాలన్నది,నేటి కాలంలో అత్యాశే అయినప్పటికీ, అలా సాగాలని అభిలషిద్దాం.
- మాశర్మ, సీనియర్ జర్నలిస్టు
Comments
Please login to add a commentAdd a comment