న్యూఢిల్లీ, సాక్షి: ఇటీవల కొలువు దీరిన కొత్త కేబినెట్‌లో జేపీ నడ్డాకు స్థానం దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలూ చేపట్టారు. ఈ తరుణంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లి రానున్నారు. ఆయన వచ్చాక బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక అంత సులువుగా జరగదు. అందుకోసం సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. అయితే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిశాకే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జులైలో మెంబర్‌షిప్ క్యాంపెయిన్ మొదలవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కనీసం ఆరు నెలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్-జనవరి మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.
వాస్తవానికి జేపీ నడ్డా అధ్యక్ష కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే పూర్తైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కాలపరిమితిని ఈ జూన్ దాకా పొడిగిచింది బీజేపీ హైకమాండ్. ఇక బీజేపీలో వన్ పర్సన్.. వన్ పోస్ట్ పాలసీ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అమలు కావడం లేదు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం బీజేపీ తప్పుకుండా రూల్స్ పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగమని బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఆయనే కొనసాగవచ్చని సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో పలువురి పేర్లను సైతం పరిశీలించేందుకు తమకు వీలుంటుందని హైకమాండ్ భావిస్తోంది.
ఇక.. బీజేపీ తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని.. ఆ తర్వాతే పూర్తిస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తుంది. జేపీ నడ్డా ఇంతకు ముందు ఇలాగే ఎన్నుకున్నారు. 2019 జూన్‌లో జేపీ నడ్డాకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై 2020 జనవరి 20 నుంచి పూర్తి స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.
జేపీ నడ్డా నేపథ్యం..
జగత్ ప్రకాశ్ నడ్డా.. లాయర్ వృత్తి నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్ ప్రదేశ్ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బిలాస్‌పూర్ ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారాయన. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2003 ఎన్నికల్లో మాత్రం ఓడారు. 2007లో మళ్లీ నెగ్గి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీ చేయలేదు. అయితే సీనియర్ కోటాలో రాజ్యసభకు మాత్రం ప్రమోషన్ దక్కించుకున్నారు. 2014లో కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా జేపీనడ్డాకు ఆరోగ్య శాఖ దక్కింది. 2019లో అమిత్ షా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చాక.. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఆ సమయంలో జేపీ నడ్డాకు బాధ్యతలు తప్పగించారు. ఇక.. 2024 మార్చిలో హిమాచల్ రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసి.. గుజరాత్ రాజ్యసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోదీ 3.0 కేబినెట్‌లో మళ్లీ ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖనే దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment