న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన్ ధన్ యోజన(పీఎంజేడీవై)కింద దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో 54.03 కోట్ల ఖాతాలు తెరవగా ఇందులో సుమారు 11.30 కోట్ల ఖాతాలు క్రియాశీలకంగా లేవని కేంద్రం మంగళవారం రాజ్యసభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి తెలిపారు. లావాదేవీలు నెరపని ఈ అకౌంట్లలో ఈ ఏడాది నవంబర్ 20వ తేదీ నాటికి రూ.14,750 కోట్ల బ్యాలెన్సు ఉందని వివరించారు. 2017లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 39.62% వరకు ఉన్న జన్ ధన్ ఖాతాల సంఖ్య 2024 నవంబర్‌కు 20.91%కి పడిపోయాయన్నారు.
రెండేళ్లపాటు ఎటువంటి లావాదేవీలు జరగని సేవింగ్/కరెంట్ ఖాతాలను ఆర్‌బీఐ క్రియాశీలకం కాని ఖాతాగా పరిగణిస్తుందన్నారు. ఖాతాలను క్రియాశీలకంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. క్రియాశీలకం కాని ఖాతాల సంఖ్యను తగ్గించుకోవాలని బ్యాంకులను కోరామన్నారు. ఎప్పటికప్పుడు కేవైసీ అప్‌గ్రేడేషన్, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రక్రియ వంటి వాటితో అకౌంట్లను క్రియాశీలకం చేయాలని సూచిస్తున్నామన్నారు.
పీఎం–కిసాన్‌తో 2 కోట్ల ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) ద్వారా దేశవ్యాప్తంగా 2.04 కోట్ల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ రైతులకు లబ్ధి చేకూరుతోందని కేంద్రం పార్లమెంట్‌కు తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన పీఎం–కిసాన్ కింద ఇప్పటి వరకు 18 విడతలుగా రూ.3.46 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు.
ఇటీవలి 18వ ఇన్‌స్టాల్‌మెంట్‌లో 9.58 కోట్ల మంది లబ్ధిదారులు కాగా, వీరిలో 1.16 కోట్ల మంది ఎస్‌సీ రైతులు, 88.34 లక్షల మంది ఎస్‌టీ రైతులు, ఇతర కేటగిరీలో 7.54 కోట్ల మంది రైతులు ఉన్నారని వివరించారు. పథకం కింద ఏటా రూ.6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేస్తోందంటూ ఆయన ఈ మొత్తాన్ని పెంచే యోచన లేదని వివరించారు.
‘పీఎం విశ్వ కర్మ’ కింద రూ.1,751 కోట్ల రుణాలు
పీఎం విశ్వకర్మ పథకం కింద అక్టోబర్ 31వ తేదీ నాటికి రూ.1,751 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభకు తెలిపారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, శిల్పి వృత్తులకు చెందిన గ్రామీణ ప్రాంతాల్లోని నిపుణులు, పనివారికి సులభంగా రుణాలు అందేలా పలు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పథకం కింద ఈ వర్గం వారు మొత్తం 2.02 లక్షల బ్యాంకు అకౌంట్లు తెరిచారని చెప్పారు. 2023–24 నుంచి 2027–28 కాలానికి గాను కేంద్రం వీరికి ఈ పథకం కింద చేయూతనిచ్చేందుకు రూ.13 వేల కోట్లు కేటాయించింది.
18.74 కోట్ల రైతులకు పంట రుణాలు
ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా సుమారు 18.74 కోట్ల మంది రైతులు వివిధ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. ఇందులో మొదటిస్థానంలో తమిళనాడు నిలిచిందని వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రాంనాథ్ ఠాకూర్ మంగళవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. మొత్తం 37 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలతో బ్యాంకు ఖాతాలున్నాయని వివరించారు.
చదవండి: ఫస్ట్ డే డ్యూటీకి వెళ్లింది.. అంతలోనే అంతులేని విషాదం
తమిళనాడులో అత్యధికంగా 2.88 కోట్ల మంది రైతులు పొందగా, తర్వాతి స్థానంలో యూపీలోని 1.88 కోట్ల మంది, కర్ణాటకలో 1.62 కోట్ల మంది రుణాలు పొందారని తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో కేంద్రం ఎటువంటి పంట రుణాలను మాఫీ చేయలేదని చెప్పారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం రైతుల రుణాలను రద్దు చేశాయని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment