సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు.
బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్‌శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు.
ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment