
కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ ఆందోళన
బెంగళూరు: కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలుపొందిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు చేయడం పట్ల రాష్ట్ర అసెంబ్లీ బుధవారం అట్టుడికిపోయింది. విపక్ష బీజేపీ సభ్యుల ఆందోళనలతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది.
పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. దీంతో అధికార కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు.
అరుపులు కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ అనుకూల నినాదాల వ్యవహారంపై హోంమంత్రి జి.పరమేశ్వర అసెంబ్లీలో మాట్లాడారు. దర్యాప్తు కొనసాగుతోందని, ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న వీడియో అసలైందో కాదో తేలుతుందని అన్నారు. ఇది నిజంగా జరిగినట్లు బయటపడితే దోషులను గుర్తించి, చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మంగళవారం రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. సయ్యద్ నసీర్ హుస్సేన్ గెలిచిన తర్వాత ఆయన అనుచరులు పాకిస్తాన్‌కు మద్దతుగా నినాదాలు చేశారంటూ ఓ వీడియో బయటకు వచి్చంది. దాన్ని చానళ్లు ప్రసారం చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment