
సెలవులకు వచ్చి అత్యవసరంగా తిరిగి విధులకు వెళ్తున్న జవాన్లు
బరువెక్కిన హృదయాలతో వీడ్కోలు పలుకుతున్న బంధువులు
యశవంతపుర(కర్ణాటక): ఎంతో కాలం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశప్రజల ప్రాణాలు కాపాడుతున్న జవాన్లు సెలవుల్లో ఇళ్లకు వచ్చారు. అయితే అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ఆర్మీ నుంచి పిలుపురావడంతో ఉన్నఫళంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. చెల్లెలు పెళ్లి కోసం వచ్చిన జవాన్‌కు ఆర్మీ అధికారుల నుంచి అత్యవరసమైన పిలుపు రావటంతో కుటుంబసభ్యులు జవాన్‌కు సింధూరం దిద్ది విధులకు పంపించారు. ఈ ఘటన బీదర్‌లో చోటు చేసుకుంది. బీదర్ జిల్లా భాల్కీ తాలూకా చందాపుర గ్రామానికి చెందిన బసవకిరణ బీరుదార పంజాబ్ అమృత్‌సర్‌లో సైనికుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఏప్రిల్ 27న చెల్లెలు పెళ్లి కారణంగా సెలవుపై చందాపుర వచ్చాడు. ప్రస్తుతం భారత్–పాక్ సరిహద్దులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కారణంగా సెలవులు రద్దు చేసుకొని విధులకు రావాలని ఆర్మీ అధికారులు అత్యవసరమైన సందేశం పంపారు. దీంతో చందాపుర గ్రామస్తులు జవాన్ బసవకిరణకు సింధూర తిలకరం దిద్ది, హారతి పట్టి విధులకు సాగనంపారు. భారత సైన్యంలో పని చేస్తున్న జవాన్లకు అక్కా చెల్లెళ్ల అశీర్వాదం ఉంటుందని బసవకిరణ చెల్లెలు వచనశ్రీ తెలిపారు. మన సైన్యం ఉగ్రవాదులపై దాడి చేసి హతం చేయటం విజయంగా భావిస్తున్నట్లు వచనశ్రీ సంతోషం వ్యక్తం చేశారు.
భార్య ప్రసవం కోసం వచ్చి
భార్య ప్రసవం కోసం స్వగ్రామానికి వచ్చిన జవాన్ ఉన్నత అధికారుల ఆదేశాలతో తిరిగి విధులకు వెళ్లాడు. కలబురిగికి చెందిన హనమంతరాయ సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. భార్య స్నేహ ప్రసవం తేదీ దగ్గర పడటంతో ఏడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. భార్య పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ సంతోషంలో ఉండగానే కశీ్మరు నుంచి పిలుపు వచ్చింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో వెంటనే విధులకు రావాలని చెప్పారు. దీంతో బాలింతగా ఉన్న భార్య, ఏడు రోజుల నవజాత శిశువునుంచి వీడ్కోలు తీసుకొని దేశ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దేశసరిహద్దులకు బయల్దేరి వెళ్లాడు. స్నేహితులు, బంధువులు బరువైన హృదయాలతో వీడ్కోలు పలికారు.