గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్‌ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్‌ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది.
అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్‌ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయం.
పరోక్ష ఎన్నికల్లోనూ...
పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్‌ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది.
ఫలించిన పాలేరు వ్యూహం!
పాలేరు ఎన్నికను టీఆర్‌ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది.