Paleru By election
-
ఖమ్మం కలెక్టర్‌గా మళ్లీ లోకేశ్‌కుమార్
హైదరాబాద్: ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా లోకేశ్కుమార్ను తిరిగి నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం లోకేశ్ కుమార్‌ను బదిలీ చేసిన విషయం విదితమే. ఈ ఉప ఎన్నిక పూర్తయ్యాయి...ఫలితాలు వెల్లువడ్డాయి. దీంతో లోకేశ్ కుమార్‌ను తిరిగి ఖమ్మం కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే ఇప్పటి వరకు ఆ పదవిలో ఉన్న దానకిషోర్ తిరిగి హెచ్ఎంసడబ్యూఎస్ఎస్కు బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
పాలేరులోనూ టీఆర్ఎస్ జైత్రయాత్ర
- ఉప ఎన్నికలో ఘన విజయం - తుమ్మలకు 45,682 ఓట్ల రికార్డు మెజారిటీ - కాంగ్రెస్‌కు కలసిరాని సానుభూతి - సీపీఎం డిపాజిట్ గల్లంతు - టీఆర్ఎస్కు 94,940 ఓట్లు.. హస్తానికి 49,258 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గులాబీ మళ్లీ గుబాళించింది. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో సానుభూతి పవనాలను కూడా తోసిరాజంటూ టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితారెడ్డిపై ఏకంగా 45,682 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. పాలేరు నియోజకవర్గ చరిత్రలో ఇదే అత్యధిక మెజారిటీ. నాలుగు మండలాలు, పోస్టల్ బ్యాలెట్లతో కలిపి 1,68,288 ఓట్లలో టీఆర్ఎస్కు 94,940, కాంగ్రెస్‌కు 49,258 ఓట్లు రాగా సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్ 15,538 ఓట్లతో డిపాజిట్ కోల్పోయూరు. ఓట్ల లెక్కింపు ఖమ్మం పత్తి మార్కెట్ యార్డులో గురువారం ఉదయం ఎనిమిదింటికి మొదలవగా మధ్యాహ్నం 12కల్లా ఫలితం వెలువడింది. మొత్తం 18 రౌండ్లలో ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్సే భారీ ఆధిక్యత కనబరిచి 55.5 శాతం ఓట్లు కొల్లగొట్టింది. తిరుమలాయపాలెం మండలంలో 16,446 ఓట్లు, ఖమ్మం రూరల్‌లో 12,604, కూసుమంచిలో 9,190, నేలకొండపల్లిలో 7,441 ఓట్ల మెజారిటీ సాధించింది. దాంతో గులాబీ శ్రేణులు మార్కెట్ యార్డు వద్దే బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి. తుమ్మలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం.దానకిశోర్, రిటర్నింగ్ అధికారి బి.శంకర్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో పాలేరుకు ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. పాలేరు చరిత్రలో రికార్డు మెజారిటీ పాలేరు నియోజకవర్గ ఎన్నికల చరిత్రలో ఈ ఎన్నికలోనే రికార్డు స్థాయిలో మెజారిటీ వచ్చింది. 1972 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల శాంతయ్య సాధించిన 24,552 ఓట్ల మెజారిటీయే ఇప్పటిదాకా అత్యధికం. తిరుమలాయపాలెం మండలంలో భక్తరామదాసు ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేయడం ఈ మండలంలో అత్యధిక మెజారిటీ రావడానికి దోహదపడిందని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఈవిజయం కోసం గులాబీ శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డా యి. 10 మంది మంత్రులు, 35 మంది ఎమ్మెల్యే లు, ఎంపీలు, కా ర్పొరేషన్ మేయ ర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మంత్రి కేటీఆర్ నేతృత్వంలో అన్ని మండలాలూ కలియదిరిగారు. కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిట్టింగ్ స్థానం తాలూకు సానుకూలతకు సానుభూతి, సంప్రదాయ ఓటింగ్ తోడై స్వల్ప మెజారిటీతోనైనా గట్టెక్కుతామన్న కాంగ్రెస్ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లోనైనా మెజారిటీ ఓట్లొస్తాయన్న అంచనాలూ తప్పాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ 69,707 ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి మద్దినేని బేబి స్వర్ణకుమారిపై 21,863 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అప్పట్లో టీఆర్ఎస్కు 4 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి! నోటాకు 2,785 ఓట్లు! మొత్తం 13 మంది అభ్యర్థుల్లో సీపీఎంతో పాటు మిగతా పదిమంది స్వతంత్రుల డిపాజిట్లూ గల్లంతయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8,552 ఓట్లు పోలయ్యాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగి 44,245 ఓట్లు సాధించిన సీపీఎం.. ఈసారి సీపీఐ బలపరిచినా 15,538 ఓట్లకు పరిమితమైంది. ఇక నోటాకు 2,785 ఓట్లు రావడం మరో విశేషం. నోటాకు ఓటెయ్యాలంటూ సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పిలుపివ్వడం కూడా ఇందుకు కారణమంటున్నారు. పార్టీలవారీగా వచ్చిన ఓట్లు.. పార్టీ ఓట్లు శాతం టీఆర్ఎస్ 94,940 55.5 కాంగ్రెస్ 49,258 28.79 సీపీఎం 15,538 9.08 స్వతంత్రులు 8,552 5.00 నోటా 2,785 1.3 -
గులాబీ గూటిలో విజయానందం
పాలేరు గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం సాక్షి, హైదరాబాద్: జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతుండటంతో అధికార టీఆర్ఎస్ శిబిరం హర్షాతిరేకాల్లో మునిగి తేలుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్, రెండేళ్లుగా ఏదో ఒక ఎన్నికల్లో తలమునకలవుతూనే వస్తోంది. విజయం సాధిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు గజ్వేల్ అసెంబ్లీ, మెదక్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింటా గెలిచారు. మెదక్‌కు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. అందులో గెలుపుతో తెలంగాణలో ఉప ఎన్నికల విజయానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మంత్రివర్గంలో చేరి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన వ రంగల్ లోక్‌సభ స్థానాన్నయితే ఏకంగా దేశంలో ఏడో అతి భారీ మెజారిటీతో కైవసం చేసుకుంది. ఇటీవల మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మరణంతో ఆ సీటు ఖాళీ కాగా ఆ ఉప ఎన్నికనూ భారీ మెజారిటీతో నెగ్గింది. తాజాగా పాలేరు అసెంబ్లీ స్థానాన్నీ రికార్డు మెజారిటీతో చేజిక్కించుకుంది. అలా కాంగ్రెస్ చేతిలోని రెండు సీట్లను దక్కించుకుంది. ఇవేగాక గ్రేటర్ హైదరాబా ద్, గ్రేటర్ వ రంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట మున్సిపాలిటీ, అచ్చంపేట నగర పంచాయతీల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయం. పరోక్ష ఎన్నికల్లోనూ... పరోక్ష ఎన్నికల్లోనూ అధికార పార్టీ హవానే కొనసాగుతూ వస్తోంది. శాసనమండలిలో రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక స్థానాన్ని కోల్పోయి ఒకటి మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్, ఆ తర్వాత ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెలుచుకుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్ (2 స్థానాలు), ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ( ఒక స్థానం) గెలుచుకుంది. అలా మండలిలోనూ సంఖ్యా బలం పెంచుకుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ఓడింది. ఫలించిన పాలేరు వ్యూహం! పాలేరు ఎన్నికను టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో 4,000 ఓట్లు మాత్రమే తెచ్చుకున్న చరిత్రను తిరగరాయాని పట్టుదలతో పనిచేసింది. స్థానికంగా మంచి పట్టున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును అభ్యర్థిగా బరిలోకి దించింది. ఏకంగా పదిమంది మంత్రులను మోహరించింది. మండలాలు, గ్రామాలవారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కూడా ప్రచారంలోకి దింపింది. ప్రతి ఓటరునూ నేరుగా కలిసేలా ప్రచారం చేసింది. సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల ప్రచారంతో హోరెత్తించింది. భారీ మెజారిటీ కైవసం చేసుకుంది. -
టీఆర్ఎస్ విజయోత్సవంలో ఘర్షణ
పోచారంలో ఉద్రిక్తత కూసుమంచి: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారంలో టీఆర్ఎస్కు చెందిన ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గురువారం ఫలితాలు వెలువడిన అనంత రం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తుండగా అదే పార్టీకి చెందిన ఇరువర్గాల వారు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఓ వ్యక్తి కత్తితో దాడికి దిగగా ఎంపీపీ సహా ఇరువర్గాలకు చెందిన 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు 144 సెక్షన్ విధించారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించడంతో ఆ పార్టీకి చెందిన ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, అదే గ్రామానికి చెంది న మరో నాయకుడు రామసహాయం బాల కృష్ణారెడ్డి వర్గీయులు వేర్వేరుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఎంపీపీ ఇంటి సమీపంలోకి రాగానే ఇరువర్గాలు తారసపడ్డాయి. గుర్తు తెలియని వ్యక్తి ఎంపీపీ వర్గీయుల మీదకు రాయి విసిరాడు. వెంటనే ఎంపీపీ వర్గీయులు బాలకృష్ణారెడ్డి వర్గీయులపై రాళ్లు విసిరారు. దీంతో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడికి పాల్పడగా, కొప్పుల గణేశ్, పుట్ట వెంకన్న అనే ఇద్దరికి గాయాలయ్యాయి. ఎంపీపీ వెంకటరెడ్డితోపాటు మరికొందరు గాయపడ్డారు. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా... ఈ ఘటనకు కారకులుగా భావిస్తున్న పోచారం గ్రామానికి చెందిన రెడ్డిమళ్ల తులిశమ్మ, రాగం మహేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పాలేరులో ఓట్లు పోలయ్యాయి ఇలా...
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘన విజయం సాధించారు. ఆయనకు 94,933 ఓట్లు పోలైనాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డికి 49,252 ఓట్లు, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావుకు 15,538 ఓట్లు వచ్చాయి. అలాగే నోటా కింద 2,785 ఓట్లు పోలయ్యాయని అధికారులు వెల్లడించారు. -
ఇంత భారీ మెజార్టీ ఎవరికీ రాలేదు
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక ఫలితాలలో నియోజకవర్గ రికార్డు మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావును గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. విజేత నాగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు. 'పాలేరు నియోజకవర్గ చరిత్రలోనే ఇంతకుముందు 1972లో కాంతయ్య 25452 మెజారిటీతో గెలిచారు. ఇంతకుమించి ఎవరికీ మెజారిటీ రాలేదు. తుమ్మల 45వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు నిరంతరంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ విజయం ప్రభుత్వం మీద, పార్టీ మీద మరింత బాధ్యతను పెంచింది. ఈ విషయాన్ని నాయకులు, కార్యకర్తలు గుర్తుంచుకోవాలి. గెలిచినంత మాత్రాన ఉబ్బిపోయి అతి ప్రసంగాలు చేయకూడదు. సంస్కారం ఉండాలి, మరింత అంకిత భావంతో పనిచేయాలి. ప్రతిపక్షాలకు కూడా ఒకమాట చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను ముఖ్యమంత్రి అయిన ఐదో రోజు నుంచి టీఆర్ఎస్ మీద అర్ధసత్యాలు, అసత్యాలతో పసలేని పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. రొడ్డకొట్టుడు మాదిరిగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మిషన్ కాకతీయ అంటే కమీషన్ కాకతీయ అన్నారు. మీకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా. దాడి చేయడమే రాజకీయం అనేది సరికాదని ప్రజలు పలుమార్లు చెబుతున్నారు. వ్యక్తిగత దాడి, విమర్శలు, నిందలు ఇకనైనా మానుకోవాలి' అని కేసీఆర్ అన్నారు. -
పాలేరులో తుమ్మల ఘనవిజయం
హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఘనవిజయం సాధించారు. తుమ్మల నాగేశ్వరరావు తమ సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుచరితా రెడ్డిపై 45 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయభేరి మోగించారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ తరపున తుమ్మల, కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి సతీమణి సుచరిత పోటీ చేశారు. సుచరితకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచినా ఆమెకు కలసిరాకపోవడంతో పాటు సానుభూతి పవనాలు వీయలేదు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో తొలిరౌండ్ నుంచి ముందంజలో నిలిచిన తుమ్మల భారీ మెజార్టీ సాధించారు. -
పాలేరులో దూసుకుపోతున్న తుమ్మల
ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో ఆయన సతీమణి సుచరిత కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగారు. ఆమెకు ప్రతిపక్షాలన్నీ మద్దతుగా నిలిచాయి. కానీ అధికార టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మాత్రం తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో రెండు రౌండ్లు ముగిసేసరికి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిని సుచరితపై 9,610 ఓట్ల ఆధిక్యం సాధించారు. భారీ ఆధిక్యంతో తామిక్కడ విజయం సాధించడం ఖాయమని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది. -
పోలింగ్ ఫుల్
- ఓటేసిన 1,70,800 మంది - అందరి చూపు 19న జరిగే ఓట్ల లెక్కింపు వైపు - జిల్లాలో జోరుగా గెలుపోటములపై బెట్టింగ్‌లు సాక్షిప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే పాలేరు ఉప ఎన్నికలోనూ భారీగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 1,90,351 మంది ఓటర్లుండగా.. 1,70,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా పోలింగ్ శాతం 89.73 నమోదైంది. 2014 మేలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో 1,96,442 మంది ఓటర్లుండగా.. 1,76,826 మంది ఓటేశారు. అప్పుడు 90.01 శాతం నమోదైంది. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌తో పోలిస్తే అతిస్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచే నాలుగు మండలాల్లోని 243 పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, మహిళలు, యువత బారులు దీరారు. ఇక 12 మోడల్ కేంద్రాల్లో ఓటర్లను ఆకట్టుకునేలా అలంకరించడంతో వీటిని చూడటానికి వచ్చిన ఓటర్లు అబ్బురపడ్డారు. పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రుడోలా, ప్రత్యేక అధికారులు, కలెక్టర్ దానకిషోర్, ఎస్పీ రమా రాజేశ్వరి సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న ప్రక్రియను పరిశీలించారు. అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మహిళా కమాండోలు కూడా మోహరించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థులు తుమ్మల నాగేశ్వరరావు, రాంరెడ్డి సుచరితారెడ్డి, పోతినేని సుదర్శన్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ ఎన్నికలో మధ్యాహ్నం వరకు ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 9 గంటల వరకు 14.81 శాతం, 11 గంటలకు 37.60 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 61.17 శాతం, 3 గంటలకు 75.10 శాతం, సాయంత్రం 5 గంటలకు 85.48 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన 6 గంటలకు 89.73 శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం ఈనెల 19న జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరు విజేతలో.. పరాజితులో తేలనుంది. నాలుగు మండలాల ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య.. ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. అయితే జిల్లావ్యాప్తంగా గెలుపోటములపై నేతలు, పార్టీ శ్రేణులు, వ్యాపారులు జోరుగా బెట్టింగ్‌లు పెడుతున్నారు. రూరల్‌పైనే ధీమా.. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ 59,219 ఓట్లు పోల్ కావడంతో ఇక్కడ మెజారిటీ తమకంటే.. తమకు వస్తుందని టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. అభివృద్ధి మంత్రం తమకు విజయం చేకూరుస్తుందని టీఆర్ఎస్, ప్రభుత్వ వ్యతిరేకత, సానుభూతి తమకు ఓట్ల వర్షం కురిపించిందని కాంగ్రెస్ ఎవరికి వారు ఆశల పల్లకీలో ఉన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లకు ఈవీఎంలు పాలేరు ఉప ఎన్నిక ఈవీఎంలను ఖమ్మం నగరంలోని వ్యవసాయ మార్కెట్‌కు భారీ బందోబస్తు మధ్య సోమవారం రాత్రి తరలించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల 243 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలను కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రుడోలా, కలెక్టర్ దానకిశోర్ సమక్షంలో అధికారులు స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఆయా స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పోలీస్ బందోబస్తుతోపాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు సైతం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఆయా పనులను జేసీ దివ్య, ఐటీడీఏ పీఓ రాజీవ్‌గాంధీ హన్మంతు పరిశీలిస్తున్నారు. - ఖమ్మం జెడ్పీసెంటర్ -
పాలేరులో 89.73 శాతం పోలింగ్
► ఓటుహక్కు వినియోగించుకున్నవారు 1,70,800 మంది ► మహిళలు 86,499.. పురుషులు 84,301 ► పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు ► ఎండల నేపథ్యంలో ఉదయం నుంచే కిక్కిరిసిన పోలింగ్ కేంద్రాలు ► సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా తగ్గిన పోలింగ్ శాతం ► విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో భారీగా పోలింగ్ నమోదైంది. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు బారులు తీరారు. మొత్తంగా పోలింగ్ 89.73 శాతం నమోదైంది. 1,90,351 మంది ఓటర్లకుగాను 1,70,800 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో మహిళలు 86,499, పురుషులు 84,301 మంది. ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికల్లో 90.01 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు స్వల్పంగా 0.28 శాతం తగ్గింది. స్వల్ప ఘటనలు మినహా పాలేరు ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎండలు మండుతున్న నేపథ్యంలో ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. దీంతో మధ్యాహ్నం ఒంటిగంటలోపే 61.17 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల సమయానికి 89.73 శాతం పోలింగ్ నమోదైంది. మోడల్ పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి రుడోలా, ఖమ్మం కలెక్టర్ దానకిషోర్ పరిశీలించి ఓటింగ్ సరళి, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో ఏర్పాటు చేసిన 24వ మోడల్ పోలింగ్ బూత్‌లో ప్రారంభంలోనే సుమారు 40 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది. అధికారులు మరో ఈవీఎంను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. కూసుమంచి మండలం గురువాయిగూడెంలో పోలింగ్ ప్రారంభానికి ముందు, కోక్యా తండాలో మధ్యాహ్న సమయంలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు ఇబ్బంది పడ్డారు. ఇక నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మహిళా సీఆర్పీఎఫ్ దళాలను మోహరించారు. వెబ్ క్యాస్టింగ్ ద్వారా ప్రతి కేంద్రంలో పోలింగ్ తీరును ఎన్నికల యంత్రాంగం పర్యవేక్షించింది. గంట గంటకు పెరిగిన పోలింగ్ ఉప ఎన్నికలో ఉదయం 9 గంటల వరకే 14.81 శాతం పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 37.60 శాతం, మధ్యాహ్నం ఒంటిగంటకు 61.17 శాతం, 3 గంటల సమయానికి 75.10 శాతం, సాయంత్రం 5 వరకు 85.48 శాతం నమోదుకాగా.. పోలింగ్ ముగిసిన 6 గంటల సమయానికి 89.73శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎవరి ధీమా వారిదే.. పోలింగ్ భారీగా నమోదు కావడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు విజయం తమదేనన్న ధీమాతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి, సీపీఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌లు పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సరళిని అంచనా వేసుకున్నారు. తమకు భారీ మెజారిటీ వస్తుందని అధికార టీఆర్ఎస్, విజయం తమదేనని కాంగ్రెస్ చెబుతున్నాయి. బూత్‌ల వారీగా తమకెన్ని ఓట్లు పడి ఉంటాయనే అంచనాల్లో అభ్యర్థులు, వారి అనుచరగణం మునిగిపోయారు. ఎక్కడ సమస్యలున్నాయి, ఎక్కడ పరిస్థితి ఎలా ఉందనే దానిపై విశ్లేషించుకుంటున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికలో వచ్చే ఫలితంపై భారీగా బెట్టింగులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
సుద్దేపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం నేలకొండపల్లి మండలం సుద్దేపల్లి గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయినట్టు సమాచారం. కాగా, ఈ రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. -
తుమ్మల కోసం కేబినెట్ మొత్తం ప్రచారమా!
నిజామాబాద్: పాలేరు ఉప ఎన్నికలో తెలంగాణ ద్రోహి టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు కోసం కేబినెట్ మొత్తం ప్రచారం చేసిందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌అలీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతులు చనిపోతే ఒక్క మంత్రి కూడా పరామర్శించలేదన్నారు. ఆదివారం ఆయన నిజామాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ సర్కార్‌లో రైతులు ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని చెప్పారు. డబుల్ బెడ్రూం పథకానికి కాంట్రాక్టులు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినదానికంటే తక్కువ వాటర్ స్టోరేజీతో ప్రాజెక్టుల రీడిజైన్ జరుగుతోందని షబ్బీర్ అలీ విమర్శించారు. -
పాలేరుపై ఉన్న శ్రద్ధ కరువు సాయంపై లేదు
* సీఎం కేసీఆర్‌పై సీపీఐ నేత * చాడ వెంకట్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు పాలేరు ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ కరువు సహాయక చర్యలపై లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నిక కోసం మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించడం ఏమిటని ప్రశ్నించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో కొంతకాలంగా తీవ్ర దుర్భిక్ష పరిస్థితులున్నా, ‘దొంగలు పడిన తర్వాత కుక్కలు మొరిగినట్లు’గా సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర సహాయాన్ని కోరారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు రబీ ప్రణాళికే లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయచర్యలను చేపట్టి ప్రజలను ఆదుకోవాలన్నారు. కరువుపై సీపీఐ తీవ్ర ఆందోళన జరిపినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. -
'పాలేరులో ప్రతిపక్షాలకు దిమ్మదిరగాలి'
ఖమ్మం: పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని ఓటర్లను మంత్రి కేటీఆర్ కోరారు. అభివృద్ధి నిరోధకాలు మారిన విపక్షాలతో తెలంగాణ ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొన్నారు. పాలేరు ప్రజలకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఇక్కడ మాత్రం దొంగ ఏడ్పులు ఏడుస్తోందని ధ్వజమెత్తారు. సాగునీటి, తాగు నీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణ మీద నీటి యుద్ధం ప్రకటించాయని అన్నారు. అవకాశవాద రాజకీయ పార్టీలకు కమ్యూనిస్ట్ పార్టీలు కేంద్రాలుగా మారాయని విమర్శించారు. రాజకీయాల్లో విలువలు భూస్థాపితం చేసిన ప్రతిపక్ష పార్టీలకు పాలేరు ఉప ఎన్నికలో దిమ్మదిరిగే జవాబు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులతో పాలేరులో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని హామీయిచ్చారు. మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు ఇస్తామన్నారు. -
కేసీఆర్ నీ కొడుకును అదుపులో పెట్టుకో: వీహెచ్
ఖమ్మం: 'నీ కొడుకును అదుపులో పెట్టుకో' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) సూచించారు. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వీహెచ్ విలేకర్లలో మాట్లాడుతూ.... కాంగ్రెస్‌ను బొంద పెడతాం, అడ్రస్ లేకుండా చేస్తామని కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాము ఊరుకోబోమని ఆయన పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందీ కాంగ్రెస్ పార్టీయే అని వీహెచ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే మంత్రి కేటీఆర్ లండన్‌కు పరిమితం అయ్యేవాడని ఎద్దేవా చేశారు. పాలేరులో ప్రజల మద్దతు కాంగ్రెస్‌కే ఉందని వీహెచ్ చెప్పారు. -
పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కు కేటీఆర్ సవాల్
ఖమ్మం : పాలేరు ఉపఎన్నికల్లో వ్యక్తిగత విమర్శలు తగవని కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఆదివారం ఖమ్మంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేటీఆర్ విలేకర్లలో మాట్లాడుతూ... పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే.. పీసీసీ అధ్యక్ష ప్రదవికి రాజీనామా చేస్తారా ? అని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. నైతిక విలువల గురించి మాట్లాడే అర్హత టీడీపీ, కాంగ్రెస్‌కు లేవన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ చేసిందని ప్రశ్నించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సముచిత గౌరవం ఇవ్వని నీచ సంస్కృతి కాంగ్రెస్ పార్టీదే అని కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
‘పాలేరులో టీఆర్ఎస్ నైతిక ఓటమి’
పాలేరు ఉప ఎన్నికలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పోటీలో నిలపడంతోనే టీఆర్ఎస్ నైతికంగా ఓడిపోయిందని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతోనే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్న తుమ్మలను టీఆర్ఎస్ ఎన్నికల బరిలోకి దించిందని తెలిపారు. పాలేరులో మొదటి నుంచి కాంగ్రెస్‌కు ఎంతో ఆదరణ ఉందని, అధికార టీఆర్ఎస్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారని ఆమె పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో వ్యవహరిస్తూ.. పాలేరు ఉప ఎన్నికలో అభ్యర్థిని నిలిపి తన దొరతనాన్ని చాటుకున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఉండి కూడా పోటీలో నిలపడం అవసరమా అని ఆమె ప్రశ్నించారు. -
పాలేరు ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రచారవ్యూహం
- మే 16న పాలేరులో ఉప ఎన్నిక - ప్రతి మండలానికి ఒక ఇంచార్జ్ నియామకం - మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో మొత్తం పాలేరు ఉప ఎన్నిక ఖమ్మం: మే 16న పాలేరులో జరుగనున్న ఉప ఎన్నికపై దృష్టిసారించిన అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రచార వ్యూహంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పాలేరు నియోజవర్గ పరిధిలో ఉన్న ప్రతి మండలానికొక ఇంచార్జ్‌ను నియమించింది. వారిలో నేలకొండపల్లి మండలానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును నియమించింది. అదేవిధంగా కూసుమంచి మండలానికి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తిరుమలాయపాలెంకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఖమ్మం రూరల్ మండలానికి మహేందర్ రెడ్డిని టీఆర్ఎస్ నియమించింది. ఈ నేపథ్యంలో మొత్తం పాలేరు ఉప ఎన్నికను తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యవేక్షించనున్నారు. -
పాలేరు ఉప ఎన్నికకు 16 నామినేషన్లు
పాలేరు ఉప ఎన్నికకు మొత్తంగా 16 నామినేషన్లు దాఖలు అయ్యాయి. శుక్రవారం చివరిరోజు కావడంతో టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పర్వం ముగిసేటప్పటికి కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎంలతోపాటు శ్రమశక్తి, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్నవర్గం, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం కలిపి 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల స్క్రూట్నీ ఈనెల 30న, ఉపసంహరణ మే 2న జరగనుంది. -
నేడు నామినేషన్ వేయనున్న సుచరిత, తుమ్మల
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి సుచరిత శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నాం ఆమె నామినేషన్ వేస్తారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పాల్గొనున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు. నేటి ఉదయం 11.00 గంటలకు ట్రంక్ రోడ్డులోని రూరల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి తుమ్మల ర్యాలీగా వెళ్లనున్నారు. తుమ్మల నాగేశ్వరరావు వేయనున్న ఈ నామినేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బేగ్‌తోపాటు జిల్లా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. 2014లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందారు. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో పాలేరు ఉప ఎన్నికల అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఆ పార్టీ నాయకులు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ... అవి సఫలం కాలేదు. కాగా టీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరిన విషయం తెలిసిందే. హస్తం పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వర్గీయ రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య రాంరెడ్డి సుచరితను కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. -
పార్టీలు మారితే రాజీనామా చేయాల్సిందే
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం సాక్షి, సంగారెడ్డి: ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం తప్పని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ఒకవేళ మారితే విధిగా తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పార్టీకి ఓ సిద్ధాంతం ఉంటుందని, ఓ పార్టీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధికి మరో పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు పదవులు వదిలిపెట్టాలని చెప్పారు. పదవులకు రాజీనామా చేసి కొత్త సిద్ధాంతం ప్రకారం తిరిగి ప్రజాతీర్పు కోరాలన్నారు. చట్టం కూడా ఇదే చెబుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పాలేరు ఉప ఎన్నికపై తెలంగాణ జేఏసీకి ఎలాంటి ఆసక్తిలేదని తెలిపారు. జేఏసీ ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరువు తీవ్రం రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని కోదండరాం అన్నారు. ఇటీవల తాను మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించినట్టు చెప్పారు. త్వరలో మరికొన్ని జిల్లాల్లో అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కరువు నివారణ చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం పన్నులు, శిస్తు వసూళ్లను నిలిపివేయాలని ఆయన కోరారు. కరువు తీవ్రతను వివరించేందుకు త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలవనున్నట్టు చెప్పారు. ఓపెన్‌కాస్ట్‌పై మే 3న సదస్సు ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలపై వచ్చే నెల 3నజేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు. నిజాం షుగర్స్‌ను రక్షించుకునేందుకు త్వరలో నిజామాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. హిందుస్తాన్ కేబుల్స్, నిజాం షుగర్స్ కంపెనీలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు. -
అభివృద్ధి చేస్తే భయమెందుకు?: తమ్మినేని
-పాలేరు అభ్యర్థిగా పోతినేని సుదర్శన్ ఖమ్మం ‘టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటోంది. దీనిని చూసి ప్రజలు మీకే ఓట్లు వేస్తారనుకుంటే.. పాలేరు ఉప ఎన్నికకు కేటీఆర్‌తో సహా ఐదుగురు మంత్రులు ఎందుకు? అభివృద్ధి చేస్తే ఇంత భయమెందుకు’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. పాలేరు అభ్యర్థిగా తమ పార్టీ నుంచి పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌ను బరిలో దింపుతున్నామని వివరించారు. ఖమ్మంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉపఎన్నికలో అవినీతి, అవకాశవాద రాజకీయాలతో రూ.50 నుంచి రూ.70కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. వామపక్షాలన్నీ తమకు మద్దతుగా నిలుస్తాయిని ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు తమ పార్టీకి శత్రువులేనని.. బూర్జువా పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
'ఎన్టీఆర్ బతికుంటే కన్నీరు పెట్టుకునేవారు'
మెట్పల్లి: టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అని, అలాంటి బద్ధ శత్రువుతో పాలేరు ఉప ఎన్నిక కోసం టీడీపీ చేతులు కలపడాన్ని దిగజారుడుతనంగా మంత్రి హరీష్‌రావు అభివర్ణించారు. ఎన్టీఆర్ బతికి ఉండి ఉంటే దీన్ని చూసి బాధపడేవారని ఆయన సోమవారమిక్కడ అన్నారు. మెదక్ జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో హరీష్‌రావు, ఎంపీలు కవిత, బాల్కసుమన్, ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో రూ.28 కోట్ల వ్యయంతో ఎస్సారెస్పీ కాల్వల ఆధునికీకరణ పనులకు కూడా వారు ప్రారంభోత్సవం చేశారు. -
పాలేరులో టీఆర్ఎస్దే గెలుపు: కేటీఆర్
ఖమ్మం : ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్దే గెలుపు అని ఆ పార్టీ నాయకుడు, తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆదివారం ఖమ్మంలో కేటీఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... ప్లీనరీతోపాటు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కూడా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడతారన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ ఖమ్మంలో ఏప్రిల్ 27వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే పాలేరు శాసన సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు.ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. మే 16వ తేదీన ఈ ఉప ఎన్నిక జరగుతుంది. ఓట్ల లెక్కింపు మాత్రం ఏప్రిల్ 19వ తేదీన లెక్కిస్తారు. -
'ఉపఎన్నికలో పోటీ చేయని పార్టీలకు ధన్యవాదాలు'
హైదరాబాద్ : ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో పోటీ చేయని రాజకీయ పార్టీలకు తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో భట్టివిక్రమార్క మాట్లాడుతూ... ఈ ఉప ఎన్నికల్లో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కూడా తమకు సహకరిస్తాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎవరైనా శాసన సభ్యుడు చనిపోతే... ఆ స్థానంలో జరిగే ఎన్నికలను ఏకగ్రీవం చేయడం గత నుంచి సాంప్రదాయంగా ఆయన గుర్తు చేశారు. గత సాంప్రదాయన్ని అనుసరించాలని అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నట్లు భట్టి ఈ సందర్భంగా తెలిపారు.