పార్టీలు మారితే రాజీనామా చేయాల్సిందే
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
సాక్షి, సంగారెడ్డి: ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం తప్పని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అన్నారు. ఒకవేళ మారితే విధిగా తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు. మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి పార్టీకి ఓ సిద్ధాంతం ఉంటుందని, ఓ పార్టీ తరఫున గెలుపొందిన ప్రజాప్రతినిధికి మరో పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు పదవులు వదిలిపెట్టాలని చెప్పారు. పదవులకు రాజీనామా చేసి కొత్త సిద్ధాంతం ప్రకారం తిరిగి ప్రజాతీర్పు కోరాలన్నారు. చట్టం కూడా ఇదే చెబుతుందన్నారు. పార్టీ ఫిరాయింపులు, పాలేరు ఉప ఎన్నికపై తెలంగాణ జేఏసీకి ఎలాంటి ఆసక్తిలేదని తెలిపారు. జేఏసీ ప్రస్తుతానికి ఎన్నికలకు దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కరువు తీవ్రం
రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉందని కోదండరాం అన్నారు. ఇటీవల తాను మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కరువు పరిస్థితులను పరిశీలించినట్టు చెప్పారు. త్వరలో మరికొన్ని జిల్లాల్లో అధ్యయనం చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న కరువు నివారణ చర్యలు సంతృప్తికరంగా లేవన్నారు. కరువు నేపథ్యంలో ప్రభుత్వం పన్నులు, శిస్తు వసూళ్లను నిలిపివేయాలని ఆయన కోరారు. కరువు తీవ్రతను వివరించేందుకు త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలవనున్నట్టు చెప్పారు.
ఓపెన్‌కాస్ట్‌పై మే 3న సదస్సు
ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాలపై వచ్చే నెల 3నజేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించనున్నట్లు కోదండరాం తెలిపారు. నిజాం షుగర్స్‌ను రక్షించుకునేందుకు త్వరలో నిజామాబాద్‌లో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. హిందుస్తాన్ కేబుల్స్, నిజాం షుగర్స్ కంపెనీలను తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందని సూచించారు. విద్యుత్, సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌పై అధ్యయనం కొనసాగుతుందని చెప్పారు.