సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 20లోగా అన్ని స్థాయిల్లో తెలంగాణ జేఏసీ నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయాలని, దీని కోసం వెంటనే జిల్లా స్థాయిల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం జిల్లా కమిటీలకు సూచించారు. టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కోదండరాం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ నిర్మాణం, రైతు, నిరుద్యోగ సమస్యలపై పోరాటం, రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
వ్యవసాయ రంగ సమస్యలపై జిల్లా కమిటీలు అధ్యయనం చేసి, సమగ్ర నివేదికను జనవరి 10లోగా రాష్ట్ర కమిటీకి నివేదించాలని ఈ సమావేశంలో కోదండరాం సూచించారు. వ్యవసాయ రంగంలో అధ్యయనం చేయాల్సిన అంశాలకు అనుగుణంగా నివేదికను రూపొందించాలని, రైతుల ఆత్మహత్యలకు కారణాలను లోతుగా అధ్యయనం చేయాలని చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పెద్దఎత్తున పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టాలని, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రికి పోస్టుకార్డులు రాయాలని, పోస్టుకార్డుల్లో రాయాల్సిన అంశాలను రెండ్రోజుల్లో పంపిస్తామన్నారు. రైతాంగ, నిరుద్యోగ సమస్యలపై జనవరి మూడో వారంలో జేఏసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాల్లోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం వెల్లడించారు.
‘సాక్షి’వార్తపైనే..
రాజకీయ పార్టీ ఏర్పాటుపై జేఏసీ స్టీరింగ్ కమిటీలో ప్రధానంగా చర్చించారు. పార్టీ ఏర్పాటు, పేరు గురించి ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన వార్త గురించి ఈ సమావేశంలో పలువురు నేతలు ప్రస్తావించారు. దీనిపై కోదండరాం మాట్లాడుతూ ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు పనిచేయడం లేదు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం నినాదాలతో జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిర్మాణాత్మక చర్యలు లేవు.
రైతు ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడం లేదు. సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించలేదు. ఆత్మగౌరవం కోసం జరిగిన ఉద్యమంతో వచ్చిన రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోనూ ఇబ్బందులు వస్తున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులకు కూడా సీఎం అపాయింట్‌మెంట్ దొరకడం లేదు. ఇక ఆత్మగౌరవం రాష్ట్రంలో ఎక్కడ ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయ రాజకీయాలు, రాజకీయాల్లో మార్పు రావాలని చాలాకాలం నుంచి చెబుతున్నాం.
రాజకీయాల్లోకి రావాలని నేను చెబుతున్నదాన్ని మీరు(స్టీరింగ్ కమిటీ సభ్యులు) ముందుగా అర్థం చేసుకోవాలి. దానిని అందరికీ అర్థమయ్యేలా, సరిగ్గా చెప్పాలి’ అని సూచించారు. ‘పార్టీ పేరు అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ‘సాక్షి’లో వచ్చిన పేరుతోపాటు మరో ఐదారు పేర్లపై చర్చ జరుగుతోంది. సరైన సమయంలో బయటకు వస్తుంది. ఏదేమైనా ఇంకా జాప్యం చేయడానికి వీలులేదు. కార్యకలాపాల్లో వేగం పెంచాల్సిన సమయం వచ్చింది’అని కోదండరాం ముక్తాయించినట్టు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో జేఏసీ కన్వీనర్ రఘు, నేతలు ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, గురజాల రవీందర్‌రావు, భైరి రమేశ్, రాజేందర్‌రెడ్డి, ధర్మార్జున్, అంబటి నాగరాజు, డీపీ రెడ్డి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment