సాక్షి, హైదరాబాద్ : ఎంతోకాలంగా వాయిదా పడుతూ వస్తున్నకొలువుల కొట్లాట సభ సోమవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. నిరుద్యోగులు సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సభకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం, విద్యావేత్త చుక్కా రామయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రాంచంద్రరావు, టీడీపీ నేత ఎల్ రమణ తదితరులు హాజరు అయ్యారు.
ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ... సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసామని, ఈ సభను విజయవంతం చేసి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలన్నారు. సభకు రాకుండా ప్రభుత్వం ఇబ్బందులు , ఆటంకాలు కల్పిస్తుందని, విభేదాలు పక్కన పెట్టి అన్ని పక్షాలు ఐక్యమత్యంతో సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. కోదండరాం మాట్లాడుతూ..‘మన చేపట్టబోయే కొలువులకై కొట్లాటను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్లు ప్రకటిస్తున్నదని , ఇది మన విజయం అని మన సభ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు ఒక సందేశం పంపాలని, వారికి మన సత్తా చాటి కనువిప్పు అయ్యేవిధంగా సభను విజయవంతం చేయాలి.’ అని కోరారు.
అంతకు ముందు కోదండరాం... తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. మరోవైపు కొలువుల కొట్లాట సభ పోలీసుల నిఘా నీడలో జరుగుతోంది. పోలీసులు తనిఖీల తర్వతే సభా ప్రాంగణంలోకి అనుమతి ఇస్తున్నారు. ఇక కొలువుల కొట్లా సభకు వస్తున్న విద్యార్థులు, నిరుద్యోగుల అక్రమ అరెస్ట్‌లను టీజేఏసీ నేతలు తీవ్రంగా ఖండించారు.
కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు సభా కార్యక్రమాలను ప్రారంభించి, సాయంత్రం 6 వరకు నిర్వహిస్తామని జేఏసీ ప్రకటించిన విషయం తెలిసిందే. సభ కోసం సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలు, ఉద్యమ ఘట్టాలు, జేఏసీ నిర్వహించిన పాత్ర వంటివాటిని గుర్తు చేసేలా పాటలను రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment