
‘రాజీవ్ యువ వికాసం’ పథకం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘అందరినీ సమన్వయం చేసుకుంటూ.. సుపరిపాలన అందిస్తే పాలనపై పట్టు సాధించినట్లు.. నేను ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. దీనికి మరికొంత సమయం పడుతుంది. పాలనపై నాకు ఇంకా పట్టురా లేదని కొందరు అంటున్నారు. పాలనపై పట్టు అంటే ఏంటి? ఒకరిద్దరు మంత్రులను తొలగించడం, ఓ ఇద్దరు అధికారులపై కేసులు పెట్టి జైలుకు పంపించడమా?’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టలేదన్నారు. సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలో రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు.
యువతకు భవిష్యత్తు ఇవ్వడానికే..
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు రాజీవ్ యువ వికాసం పథ కాన్ని తీసుకువచ్చినట్టు సీఎం రేవంత్ చెప్పారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తున పోరాడిన యువత.. ఇప్పుడు మత్తు పదార్థాలకు బానిస లుగా మారుతున్నారు. ఇదో పంజాబ్, కేరళ మాదిరిగా మారుతోంది. అలాకాకుండా యువతకు భవిష్యత్తు ఇవ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టాం.
రూ.6 వేల కోట్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 5 లక్షల మంది నిరుద్యోగులకు రాయితీ పద్ధతిలో ఆర్థిక సహకారం అందిస్తాం. ఇది పార్టీ పథకం కాదు.. పూర్తిగా ప్రజలు, అర్హులైన నిరుద్యోగులకు అమలు చేసే పథకం. పూర్తిగా ప్రజల పథకం’’ అని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఎన్నో హామీలు అమలు చేశామని, పథకాలు, సంస్కరణలు తీసుకువచ్చాని రేవంత్ చెప్పారు.
అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడపం..
రాష్ట్రంలో బీసీ జనాభా 56.36శాతం ఉందని కుల సర్వే ద్వారా తేల్చామని, వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పెట్టామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై దేశంలోనే మొదటగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టిందన్నారు. ‘‘ప్రభుత్వ ఆదాయం తగ్గినా, అప్పులు పెరిగినా ధైర్యాన్ని కోల్పోలేదు. అబద్ధాల ప్రాతిపదికన ప్రభుత్వాన్ని నడిపించం. దుబారా తగ్గించి ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నాం.
ఇసుక విక్రయంతో రోజువారీ ఆదాయం రూ.3 కోట్లకు పెరిగింది. పన్నుల వసూలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. నిరుద్యోగ సమస్య 8.8 నుంచి 6.6శాతానికి తగ్గిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి..’’ అని చెప్పారు. రాజీవ్ యువ వికాసం ద్వారా రూ.50 వేల నుంచి రూ. 4లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తామని.. జూన్ 2న లబ్ధిదారుల జాబితా ప్రకటిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి నియోజకవర్గంలో 5 వేల మంది వరకు లబ్ధి కలిగిస్తామని, నిజమైన నిరుద్యోగులకే పథకం అందిస్తామని వివరించారు.
నిరుద్యోగ యువత కాళ్లపై నిలబడేలా..: భట్టి
గత ప్రభుత్వం దశాబ్దకాలంలో ఒక్కసారి కూడా గ్రూప్–1 నియామకాలు చేపట్టలేదని.. తాము కేవలం ఏడాదిలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించామని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ కేలండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాలు రాని నిరుద్యోగ యువత వారి కాళ్లపై నిలబడేలా, సమాజంలో తలెత్తుకొని ఆత్మగౌరవంతో బతికేలా స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రాజీవ్ యువ వికాసాన్ని తీసుకువచ్చారని భట్టి పేర్కొన్నారు. లబ్ధిదారులను మూడు కేటగిరీలుగా విభజించి, సాయం అందించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, కూనంనేని సాంబశివరావు తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment