అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి విడుదల చేస్తాం
కాంగ్రెస్ నేతలతో భేటీలో ముఖ్యమంత్రి రేవంత్
నిరుద్యోగులకు మేలు జరిగేలా త్వరలో నిర్ణయాలు
స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు
తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం
నిరుద్యోగుల డిమాండ్లపై అధికారులతో సీఎం చర్చ
హాజరైన విద్యార్థి సంఘాల నేతలు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం
‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.
ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ
గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.
12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు.
గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు
గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment