job appointments
-
ఏడాదిన్నరలో రికార్డ్‌స్థాయి నియామకాలు
న్యూఢిల్లీ: గడచిన ఏడాదిన్నర స్వల్పకాలంలోనే రికార్డుస్థాయిలో దాదాపు 10 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని ప్రధాని మోదీ ప్రకటించారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా మరో 71వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందించిన సందర్భంగా వర్చువల్‌గా సోమవారం ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ‘‘కేవలం ఒకటిన్నర సంవత్సరాల కాలంలో 10లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. గతంలో ఏ ప్రభుత్వమూ ఇంత తక్కువకాలంలో ఇంతటి భారీస్థాయిలో ఉద్యోగ కల్పన చేపట్టలేదు. మిషన్ మోషన్లో చేపట్టిన ఈ నియామక ప్రక్రియ నిజంగా ఒక రికార్డ్. యువతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మా ప్రభుత్వ విధాన నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ పాలసీలు, కార్యక్రమాలు, పథకాల్లో యువతకు పెద్దపీటవేస్తున్నాం. అత్యంత పారదర్శకంగా, నిజాయతీగా నియామక క్రతువు కొనసాగుతోంది. రోజ్‌గార్ మేళాలు యువత సాధికారత పెంపొందిస్తూ వారిలోని సామర్థ్యాలను వెలికితీస్తున్నాయి. నేటి భారతీయ యువత పూర్తి ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడుతోంది. ప్రతి రంగంలోనూ విజయపతాక ఎగరేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిలో మహిళలు అధికంగా ఉన్నారు. సాకారమవుతున్న మహిళా సాధికారతకు ఇది ప్రబల నిదర్శనం. ప్రతి రంగంలో మహిళల స్వావలంబనే మా ప్రభుత్వ ధ్యేయం. 26 వారాల ప్రసూతి సెలవులు మహిళలు కెరీర్‌కు ఎంతగానో దోహదపడుతున్నాయి. పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల్లో మెజారిటీ ఇళ్లకు మహిళలే యజమానులుగా ఉన్నారు. మహిళల సారథ్యంలో అభివృద్ధి దేశంలో సాకారమవుతోంది. భారతీయ యువత నైపుణ్యాలు, శక్తియుక్తులను పూర్తి స్థాయిలో సద్వినియోగంచేసుకునేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. స్టార్టప్ ఇండియా కావొచ్చు, డిజిటల్ ఇండియా కావొచ్చు, అంతరిక్ష రంగంలో, రక్షణ రంగంలో సంస్కరణల్లో ప్రతి విభాగంలో యువతకు ప్రాధాన్యత కలి్పస్తున్నాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేలా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చాం. విద్యాభ్యాసం మాతృభాషలో జరిగితేనే మెరుగైన విద్యాసముపార్జన సాధ్యం. రిక్రూట్మెంట్ పరీక్షల్లో నెగ్గుకురావడానికి భాష అనేది ఒక అవరోధంగా ఉండకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 13 ప్రధాన భారతీయ భాషల్లో ప్రవేశ, పోటీ పరీక్షలను నిర్వహిస్తోంది’’అని మోదీ అన్నారు. గ్రామీణ భారతం కోసం చరణ్ సింగ్ కృషిచేశారు ‘‘మాజీ ప్రధాని దివంగత చరణ్ సింగ్ జయంతి సోమవారం జరుపుకున్నాం. గ్రామీణ భారతావని అభివృద్ధి కోసం చరణ్ సింగ్ ఎంతగానో శ్రమించారు. ఆయన చూపిన స్ఫూర్తిపథంలో మా ప్రభుత్వం నడుస్తోంది. గ్రామాల్లోనూ ఉపాధి కలి్పస్తూ స్వయంఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. ఈ ఏడాదిలోనే మా ప్రభుత్వం చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం మాకెంతో గర్వకారణం’’అని మోదీ అన్నారు. ‘‘శ్రమించే తత్వం, తెగువ, యువత నాయకత్వ లక్షణాలే నేటి భారత్‌ను ముందుకు నడిపిస్తున్నాయి. ప్రతిభ గల యువతలో సాధికారతను పెంచుతూ 2047కల్లా అభివృద్ధి చెందిన భారత్‌ను సాకారంచేసే దిశగా మా ప్రభుత్వం విధానపర నిర్ణయాలను అమలుచేస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ త్వరలో మూడోస్థానానికి ఎదగడం ఖాయం’’అని మోదీ అన్నారు. -
క్రీడాకారులకు సర్కారీ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: ప్రతిభా వంతులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడానికి వీలుగా తెలంగాణ(పబ్లిక్ సర్వీస్ నియామ కాల క్రమబద్ధీకరణ, సిబ్బంది, వేతనాల హేతుబద్ధీకరణ) చట్ట సవరణ బిల్లును శుక్రవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్, కాలేజీ సర్వీస్ కమిషన్, ఏదైనా కమిటీ, ఎంప్లాయ్మెంట్ ఎక్సే్ఛంజీ, పత్రికల్లో బహిరంగ ప్రకటనల ద్వారా మినహా ఇతర పద్ధతుల్లో ఉద్యోగాల భర్తీపై ఈ చట్టం ద్వారా నిషేధం విధించారు.కారుణ్య నియామకాలతో పాటు పోలీసు కాల్పులు/ బాంబు పేలుళ్లు/ తీవ్రవాదుల హింస బాధితులు, అత్యాచారాలకు గురైన ఎస్సీ, ఎస్టీల విషయంలో మినహాయింపు ఉంది. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, అంతర్జాతీయ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇకపై క్రీడాకారులకు సైతం ఉద్యోగాలు ఇచ్చేందుకు వీలుగా ఈ చట్టానికి ప్రభుత్వం సవరణలను ప్రతిపాదించింది. మరో రెండు బిల్లులకు ఆమోదం..: జూనియర్ సివిల్ జడ్జీల ద్రవ్య అధికార పరిధిని రూ.20 లక్షల నుంచి రూ.10 లక్షలకు కుదించడానికి ప్రతిపాదించిన తెలంగాణ సివిల్ కోర్టు చట్ట సవరణ బిల్లుతో పాటు తెలంగాణ సంక్షిప్తనామాన్ని ‘టీఎస్’నుంచి ‘టీజీ’కి మార్చుతూ ప్రతిపాదించిన కొత్త చట్టం బిల్లును శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. -
బడ్జెట్ సమావేశాల్లో జాబ్ కేలండర్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లలో ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణలో జాప్యంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇకపై అలా జరగకుండా యూపీఎస్సీ తరహాలో ఏటా ప్రణాళికాబద్ధంగా కేలండర్ తేదీల ప్రకారం ఉద్యోగ నియామకాలు జరుపుతామని చెప్పారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ కేలండర్‌ను ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల నుంచి ప్రతి ఖాళీని మార్చి 31లోగా తెప్పించుకుని జూన్ 2లోగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని అన్నారు. ఎన్ని ఖాళీలున్నా డిసెంబర్ 9 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. శనివారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ‘రాజీవ్‌గాంధీ సివిల్స్ అభయహస్తం’పథకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రం నుంచి ఏటా సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెయిన్స్‌కు ఎంపికయ్యే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల్లో అర్హులకు సింగరేణి సంస్థ రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తుంది. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రారంభ కార్యక్రమంలో 2023 సివిల్స్ విజేతలు, 2024లో మెయిన్స్ రాసే అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిరుద్యోగుల బాధ నా కళ్లతో చూశా.. ‘రాష్ట్రంలో నిరుద్యోగ యువకుల సమస్యలను పరిష్కరించడమే మా ప్రభుత్వ తొలి పాధాన్యత. మా ప్రభుత్వం బాధ్యతలను స్వీకరించిన తర్వాత 90 రోజుల్లోగా 30 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసింది. దీనిని బట్టి మా ప్రభుత్వ ప్రాధాన్యతను నిరుద్యోగ యువత అర్థం చేసుకోవాలి. తెలంగాణ ఏర్పడిన పదేళ్లలో ఏ నోటిఫికేషన్ పరీక్షలు కూడా నిర్దేశిత సమయానికి జరగలేదు. ఉజ్వల భవిష్యత్తు ఆలోచనలతో యువత అమీర్‌పేట్, అశోక్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లలోని కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటుంటే సంవత్సరాల తరబడి పరీక్షలు వాయిదా పడ్డాయి. తీరా పరీక్షలు జరిగి ఫలితాలు వచ్చేసరికి ప్రశ్నపత్రాల లీకు వ్యవహారంతో నిరుద్యోగులు పడిన బాధ, భావోద్యేగాన్ని నా కళ్లతో చూశా. దీంతో యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి దాని తరహాలో టీజీపీఎస్సీని పునర్వ్యవస్థీకరించాం. యూపీఎస్సీ తరహాలో వెనువెంటనే నోటిఫికేషన్లు ఇచ్చాం. గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను విజయవంతంగా నిర్వహించాం. గ్రూప్–2 పరీక్షలు గ్రూప్–3తో కలిపి నవంబర్, డిసెంబర్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక న్యాయాన్ని పాటిస్తాం. మా ప్రభుత్వ హయాంలో పరీక్షలు నిర్వహించిన ఏ సంస్థపైనా ఎలాంటి ఆరోపణలూ రాలేదు. నిరుద్యోగ అభ్యర్థులు కష్టపడి మంచి ఫలితాలు సాధిస్తే ప్రభుత్వం వారిని వ్యక్తిగతంగా కలుస్తుందని, వెన్నుతట్టి ప్రోత్సహిస్తుందనే సందేశం ఇవ్వడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించాం. నిరుద్యోగ యువతలో నమ్మకం, విశ్వాసం కల్పించడం మా బాధ్యత..’అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర కొలువులపైనా దృష్టి పెట్టాలి ‘నిరుద్యోగ అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, సివిల్స్, బ్యాంకింగ్, ఆర్ఆర్బీ వంటి వాటిపై సైతం దృష్టి సారించాలి. సివిల్స్‌లో టాప్ ర్యాంక్ సాధించి తెలంగాణ కేడర్‌ను తీసుకుని రాష్ట్ర ప్రజలకు సేవలు చేయాలి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అఖిల భారత సర్వీసు పోస్టుల్లో తెలంగాణ యువత ఎక్కువగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. రాష్ట్రానికి నిధులు, ఇతర ప్రయోజనాల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరిపేటప్పుడు అక్కడ తెలంగాణ అధికారులు ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది..’అని రేవంత్ చెప్పారు. అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటే లక్ష్యం: భట్టి సివిల్స్ తరహా పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడం వ్యయ ప్రయాసలతో కూడిన అంశమని, సీఎం రేవంత్ చొరవతో.. అలాంటి పరీక్షలు రాసే అభ్యర్థులకు ఆర్థిక తోడ్పాటును అందించడం కోసమే ఈ పథకాన్ని ప్రారంభించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణి తరఫున దీనిని చేపట్టడం అభినందనీయమన్నారు. 2023లో రాష్ట్రం నుండి సివిల్స్‌కు ఎంపికైన 35 మంది అభ్యర్థులను, ఐఎఫ్ఎస్కు ఎంపికైన ఆరుగురిని ఈ సమావేశంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, సీతక్క, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, హర్కర వేణుగోపాల్ రావు, సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
రేటు కార్డా? సేఫ్గార్డా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు ఉద్యోగాల పేరిట ‘రేటు కార్డ్‌ల’తో యువతను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం(సేఫ్‌గార్డ్) పని చేస్తోందని ఉద్ఘాటించారు. వారసత్వ పార్టీలా? లేక మంచి చేసే ప్రభుత్వమా? యువత భవిష్యత్తు ఎవరిపై ఆధారపడాలన్నది దేశమే తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం రోజ్‌గార్ మేళాలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 70,000 మందికిపైగా యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పటి విపక్షాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. పథకాల పేరిట ప్రజాధనం దోచుకున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల నియామకాల్లోనూ అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా వారసత్వ పార్టీలు యువతను దగా చేస్తున్నాయని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టేదని, ఇప్పుడు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని గుర్తుచేశారు. నిర్ణయాత్మకత.. మన గుర్తింపు సమాజంలో విభజన తెచ్చేందుకు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు భాషను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పెడపోకడలు కనిపిస్తున్నాయని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని, హిందీ భాషను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప శ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు రేటు కార్డులు, కట్ మనీ వంటివి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రేటు కార్డులు యువత కలలను, సామర్థ్యాలను ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు బదులుగా పేద రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త ధీమా దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతున్నామని, మన దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఇలాంటి విశ్వాసం, ధీమా ఎన్నడూ లభించలేదన్నారు. -
ఉద్యోగ నియామకాల్లో అవినీతి, బంధుప్రీతి అంతం
న్యూఢిల్లీ: ఉద్యోగ నియామకాల వ్యవస్థలో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సమూల మార్పులతో అవినీతి, బంధుప్రీతికి అవకాశాలు అంతమయ్యాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రోజ్‌గార్ మేళాలో భాగంగా ఆయన మంగళవారం 71,000 మందికి నియామక పత్రాలను వర్చువల్ కార్యక్రమంలో అందజేశారు. వీరికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు లభించాయి. ఆ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి తుది ఫలితాలు ప్రకటించే దాకా మొత్తం ప్రక్రియను ఆన్లైన్ చేశామని వివరించారు. నియామకాల ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా, పక్షపాత రహితంగా మార్చామని అన్నారు. గ్రూప్–సి, గ్రూప్–డి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు చేశామని తెలిపారు. గత తొమ్మిదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరిగాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగం పుంజుకుందని ఉద్ఘాటించారు. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు(మే 16)న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయని గుర్తుచేశారు. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ స్ఫూర్తితో తమ ప్రయాణం ఆనాడే మొదలైందన్నారు. ‘వికసిత్ భారత్’ కోసం శ్రమిస్తున్నామని చెప్పారు. ఇదే రోజు సిక్కిం రాష్ట్రహోదా పొందిందని వివరించారు. దేశమంతటా కొత్త ఉద్యోగాల సృష్టి మన దేశంలో 2018–19 నుంచి ఇప్పటిదాకా 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని, ఈపీఎఫ్ఓ గణాంకాలను బట్టి ఈ విషయం నిరూపణ అవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) పెరుగుతున్నాయని, మన ఎగుమతులు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయని, దేశంలో ప్రతిమూలనా కొత్త ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల సృష్టి కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో కొత్త కొత్త రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయని, ఉద్యోగాల స్వరూప స్వభావాలు మారిపోతున్నాయని వెల్లడించారు. ఇకస్టార్టప్ రంగం ఆకాశమే హద్దుగా ఎదుగుతోందని అన్నారు. 2014 కంటే ముందు దేశంలో కేవలం కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు ఉండేవని, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని తెలియజేశారు. స్టార్టప్ కంపెనీల్లో 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. యువత సంక్షేమం, అభివృద్ధి పట్ల తమ అంకితభావం, చిత్తశుద్ధికి రోజ్‌గార్ మేళాలే నిదర్శనమని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని వివరించారు. పేదల కోసం 4 కోట్ల పక్కా ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. దేశంలో ఇప్పుడు యూనివర్సిటీల సంఖ్య 1,100కు, మెడికల్ కాలేజీల సంఖ్య 700కు చేరిందన్నారు. -
AP: 8,000 పోస్టులు సత్వరం భర్తీ
ఉన్నత విద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలి. రెగ్యులర్ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలి. ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీసు విభాగం, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. వచ్చే నెల మొదటి వారంలో దానిని నాకు నివేదించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జాబ్ క్యాలెండర్ (202122)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. 202122 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో జాబ్ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు. జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే.. జాబ్ క్యాలెండర్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గడువులోగా మిగిలిన పోస్టుల భర్తీ ► జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబర్‌లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ► విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నాం. ఇక్కడ ఖాళీలు భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు. ► ఈ సమీక్షలో డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె హేమచంద్రారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు హెచ్ఆర్ఎం) హెచ్ అరుణ్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ► 202122లో 39,654 పోస్టుల భర్తీ. ► ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 39,310 పోస్టుల్లో నియామకాలు పూర్తి. ► గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. ► 16.5 శాతం పోస్టులను, అంటే సుమారు 8 వేల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ► ఇందులో 1,198 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయి. -
1,800 మంది ఫ్రెషర్లను నియమించుకున్న ఎల్అండ్టీ
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) 1,800 మందికిపైగా ఫ్రెషర్లను నియమించుకుంది. ప్రాంగణ నియామకాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసినట్టు వెల్లడించింది. 300లకుపైగా కళాశాలల నుంచి 36,000ల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించింది. 8,000 ఇంటర్వ్యూలు వర్చువల్ విధానంలో కంపెనీ నిర్వహించింది. ఎల్అండ్టీ అనుబంధ కంపెనీలైన లార్సన్ అండ్ టూబ్రో ఇన్ఫోటెక్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మైండ్‌ట్రీ, ఎల్అండ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ వేర్వేరుగా ఫ్రెషర్లను నియమిస్తున్నాయి. -
లోక్‌సభలో ఏపీ జాబ్ క్యాలెండర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణీత కాలంలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు జరుగుతుండటంపై సోమవారం లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రస్తావించారు. 2021–22 సంవత్సరంలో ఖాళీల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్యాలెండర్‌ను కూడా విడుదల చేసిందని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, వివిధ ప్రభుత్వ విభాగాల నియామక సంస్థల ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలను అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్‌గా ఏర్పాటుచేసి వాటికోసం 1,26,728 పోస్టులు భర్తీ చేశారని చెప్పారు. 7,966 పోస్టులను ఇంకా భర్తీచేయాల్సి ఉందన్నారు. ఉపాధి, శిక్షణాశాఖ సమన్వయంతో జాబ్‌మేళాలు, జాబ్ ఫెయిర్లను నిర్వహిస్తూ ప్రైవేట్ రంగంలో నియామకాలు చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శక, జవాబుదారీ కోసం ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్›డ్ సర్వీసెస్ (ఆప్కోస్)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిందని బీజేపీ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. విశాఖ ఉక్కుపై పునరాలోచన లేదు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై పునరాలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రై వేటీకరణ కాకుండా రెండో అభిప్రాయం ఏమైనా ఉందా అన్న వైఎస్సార్సీపీ సభ్యుడు గోరంట్ల మాధ వ్ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఎంఎస్ ఎంఈల ఉపశమనం నిమిత్తం పలు చర్యలు చేపట్టామని వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, గొడే ్డటి మాధవి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సర్వీ సు స్టేషన్లకు రాలేని భారీ వాహనాల కోసం మొబైల్ డిస్పెన్సర్ల ద్వారా డీజిల్‌ను డోర్ టు డోర్ డెలివరీ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు బి.వి.సత్యవతి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువులశాఖ మంత్రి రామేశ్వర్ తేలి చెప్పారు. భారతీయ భాషల పట్ల వివక్ష లేదని వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఏపీకి జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని గత సెప్టెంబర్ 8న ఏపీ సీఎం లేఖ రాశారని, విడుదలకు హామీ ఇచ్చామని వైఎ స్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (ఎన్జీఎంఏ) ఆడియో విజువల్ గైడ్ యాప్‌ను మే 18న ప్రారంభించిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి.. వైఎస్సార్సీపీ ఎంపీలు సంజీవ్‌కుమార్, సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. మధ్యాహ్న భోజన పథకానికి ఏపీకి రూ.375.10 కోట్లు విడుదల చేశామని, ఏపీలో 92 శాతంమంది విద్యార్థులు ఈ పథకంలో లబ్ధిపొందారని టీడీపీ సభ్యుడు రామ్మోహన్నాయుడు ప్రశ్నకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోని క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ స్థానంలో ఈ ఏడాది మార్చి 25న స్వయం రెగ్యులేషన్స్–2021 ద్వారా ఆన్లైన్ లెర్నింగ్ కోర్సుల కోసం క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆమోదించిందని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిచ్చారు. రాజ్యసభలో.. డిజైన్ల మార్పుతో పెరిగిన పోలవరం హెడ్‌వర్క్స్ వ్యయం డిజైన్లలో మార్పుల వల్ల పోలవరం ప్రాజెక్టు హెడ్‌వర్క్స్ వ్యయం రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. 2014 ఏప్రిల్ 1 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ఇరిగేషన్ పనులకు అంచనా వేసి న వ్యయాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం భరిస్తుం దని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నారు. విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పా ర్క్ (ఎంఎంఎల్పీ) ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై ప్రాథమిక అధ్యయనం జరుగుతున్నట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ తెలిపారు. విజయవాడలో ఈ పార్క్‌కు ఆశించినంత డిమాండ్ లేనట్లు అధ్యయనంలో వెల్లడైందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధామిచ్చారు. మల్టీస్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి విశాఖపట్నం పోర్టు ట్రస్టును గుర్తించినట్లు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఓడరేవులశాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్ తెలిపారు. పోలవరంలో 3 విద్యుత్ యూనిట్లు 960 మెగావాట్ల సామర్థ్యంతో సిద్ధంకానున్న పోలవరం జలవిద్యుత్ ప్రాజెక్టులో ఒక్కొక్కటి 80 మెగావాట్ల సామర్థ్యంతో 12 యూనిట్లు ఉన్నట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. వీటిలో 3 యూనిట్లను 2024 జూలై నాటికి, మిగిలిన 9 యూనిట్లను 2026 జనవరి నాటికి పూర్తిచేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపిందని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏపీ, తెలంగాణ నుంచి గోదావరి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదన రాలేదని టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పోలవరంపై చర్చకు నోటీసులు పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం మేరకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన నిధులు తిరిగి చెల్లించాల్సి ఉందని, ఈ విషయాలపై చర్చ జరపాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు ఇచ్చారు. అయితే సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ నోటీసును అనుమతించలేదు. -
కళ్లలో ఆనందం: జగనన్నా.. కొలువుదక్కిందన్నా..
గుంటూరు ఎడ్యుకేషన్: 2008-డీఎస్సీలో అర్హత సాధించి పోస్టింగ్స్ పొందలేకపోయిన అభ్యర్థులకు ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు కల్పించింది. 13 ఏళ్లుగా ఉపాధ్యాయ నియామకాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థుల కళ్లలో ఆనందం తొణికిసలాడింది. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ కష్టాలను చెప్పుకున్న ఫలితంగా ఒకే ఒక్కమాటతో రాష్ట్ర వ్యాప్తంగా 2,193 మంది అభ్యర్థులకు ఉద్యోగాలను ఇచ్చిన హామీకి సలాం చెప్పారు. ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులందరూ ధ్యాంక్యూ సీఎం సార్ అంటూ సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. గుంటూరు పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో శనివారం జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.ఎస్ గంగా భవానీ అధ్యక్షతన నిర్వహించిన 2008–డీఎస్సీ కౌన్సెలింగ్ ద్వారా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 167 మంది అభ్యర్థులను సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ)లుగా నియ మిస్తూ పాఠశాలలను కేటాయించారు. రావాల్సిన వారిలో నలుగురు గైర్హాజరయ్యారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఉదయం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అభ్యర్థులకు శుక్రవారం సమాచారాన్ని పంపడంతో శనివారం ఉదయం 9.00 గంటల నుంచి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులతో పెద్ద సంఖ్యలో కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కాగా 171 మంది అభ్యర్థులతో మెరిట్ జాబితా సిద్ధం చేసిన తరువాత పాఠశాలల్లో ఖాళీలను ప్రదర్శించే విషయంలో ఉన్నతాధికారుల నుంచి స్పష్టత కోసం మధ్యాహ్నం వరకు ఎదురు చూశారు. అనంతరం ఏడు అంశాలతో కూడిన నిబంధనల తో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మధ్యాహ్నం 2.30కు కౌన్సెలింగ్ ప్రారంభించిన అధికారులు బ్యాచ్‌కు 25 మంది అభ్యర్థుల చొప్పు న కౌన్సెలింగ్ హాల్లోకి పిలిచి పాఠశాలలను కేటాయించారు. నరసరావుపేట డివిజన్ పరిధిలోకి వచ్చే పల్నాడు ప్రాంతంలోని మండలాలతో పాటు గుంటూరు, తెనాలి, బాపట్ల, సత్తెనపల్లి డివిజన్ల పరిధిలో మండలాల్లోని పాఠశాలల్లో ఖాళీలను డిస్ప్లేలో ప్రదర్శించి, అభ్యర్థులు కోరుకున్న పాఠశాలలను కేటాయించారు. 3,4 కేటగిరీలకు చెందిన పాఠశాలలతో పాటు 2వ కేటగిరీకి చెందిన పాఠశాలల్లోని ఖాళీలను సైతం భర్తీ చేశారు. -
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి’
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టబోయే విద్యా ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలకు తక్షణమే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్లు అమలు చేయాలని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్‌రెడ్డి కోరారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగ నియామకాల్లో కూడా నిరుపేద ఓసీలకు రిజర్వేషన్లు వర్తింపజేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏపీలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు.. మిగతా 5 శాతం రిజర్వేషన్లను అగ్రవర్ణంలోని పేదలకు ఇస్తామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు ప్రకటించారని పేర్కొన్నారు. ఇటువంటి మోసపూరిత ప్రకటనలతో అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని మండిపడ్డారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల అమలు కోసం త్వరలో లక్నో, జైపూర్, బెంగళూరు, భోపాల్‌లలో జాతీయ చైతన్య సదస్సులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు డి.సుదర్శనరెడ్డి, నాగిరెడ్డి, నరసింహారెడ్డి, సూర్యకుమార్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఈ–కామర్స్ నిబంధనల ప్రభావం స్వల్పమే..
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ రంగానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల విదేశీ పెట్టుబడుల పరంగా ఆందోళన ఉన్నప్పటికీ.. ఉద్యోగ నియామకాల్లో మాత్రం ప్రతికూల ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని పలు నియామక సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఉద్యోగాలపై ఈ ప్రభావం 5–10 శాతం మేర ఉండవచ్చని గ్లోబల్ హంట్ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ గోయల్ అంచనావేశారు. గిడ్డంగులు, రవాణా వంటి సప్లై చైన్ సంబంధిత రంగాల్లో వచ్చే 12 నెలల్లో 50,000 ఉద్యోగ అవకాశాలు తగ్గవచ్చు అని రాండ్‌స్టాడ్ సీఈఓ, ఎండీ పాల్ అభిప్రాయపడ్డారు. -
నిరుద్యోగులకే ఉద్యోగాలు దక్కేలా ‘జోనల్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు నిరుద్యోగులకే దక్కేలా జోనల్ విధానం తయారు చేయాలని ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వెంటనే ఉత్తర్వులు జారీచేసిన నేపథ్యంలో ఉద్యోగుల తరపున తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం చైర్మన్, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, అధ్యక్షురాలు వి.మమత, మధుసూదన్, కృష్ణ యాదవ్, రాజ్ కుమార్ గుప్తా, లక్ష్మీనారాయణ సోమవారం సచివాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. జోనల్ వ్యవస్థపై టీజీవో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి, ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకుందని శ్రీనివాస్‌గౌడ్ మంత్రికి తెలిపారు. త్వరలోనే ఒక నివేదికను తయారుచేసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందచేస్తామని వివరించారు. -
కొలువుల్లో క్రీడాకారులకు కోటా
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ఈ మేరకు క్రీడలశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఉమ్మడి రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు కాలేదు. వీటిని అమలు చేయాలంటే రూల్–22లో సవరణలు చేయాలని టీఎస్పీఎస్సీ సూచించింది. దీంతో ప్రభుత్వం అందుకు సంబంధించిన సవరణలు చేసింది. తాజా రిజర్వేషన్లు 29 రకాల క్రీడాకారులకు, 90 రకాల క్రీడల్లో పాల్గొన్న వారికి, పతకాలు సాధించిన వారికి వర్తించనున్నాయి. క్రీడాకారులకు వరం: మంత్రి పద్మారావుగౌడ్ క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు వరమని మంత్రి పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్లను పరిశీలించి రాష్ట్రంలో అమలు చేయాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ప్రతిపాదనలు తయారు చేశామని, వాటికి సీఎం ఆమోదం తెలిపారన్నారు. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో విజయం సాధించిన వారితో మాట్లాడిన ముఖ్యమంత్రి ప్రత్యేక రిజర్వేషన్ల హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చారన్నారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వీసీఎండీ దినకర్‌బాబు పాల్గొన్నారు. -
నియామకాలకు ఈ ఏడాది ఆశాజనకమే
న్యూఢిల్లీ: దేశీయ కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగుల నియామకాలు ఆశాజనకంగానే ఉంటాయని, 10–15 శాతం మేర వృద్ధి ఉంటుందని పీపుల్స్ స్ట్రాంగ్ అనే హెచ్ఆర్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2017లో ఉద్యోగ నియామకాలు మందగించిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు ఇండియా స్కిల్స్ నివేదిక 2018ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 120 సంస్థలు, 5,10,000 మంది విద్యార్థుల నుంచి అభిప్రాయాలు సమీకరించింది. గడిచిన ఐదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఉపాధి 45.6 శాతానికి పెరిగిందని పేర్కొంది. ‘‘మనం మార్పు దశలో ఉన్నాం. డిజిటల్ ప్రభావాన్ని అలవాటు చేసుకుంటున్నాం. ఈ దశను ఫలవంతంగా పూర్తి చేసేందుకు డిమాండ్, సరఫరా వైపు చర్యలు అవసరం. అయితే, మనం సరైన దిశలోనే వెళుతున్నామని డేటా తెలియజేస్తోంది’’అని పీపుల్ స్ట్రాంగ్ సీఈవో పంకజ్ బన్సాల్ అన్నారు. ఈ రాష్ట్రాల్లో అధిక ఉపాధి ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్ అధిక ఉపాధి అవకాశాలు కలిగిన రాష్ట్రాల్లో ఉన్నాయని ఈ నివేదిక తెలియజేసింది. ఐటీ రాజధానిగా పేరు తెచ్చుకున్న బెంగళూరు ఉపాధిలో ముందుంది. సర్వేలో ఈ నగరమే టాప్‌లో ఉంది. ఆ తర్వాత చెన్నై, ఇండోర్, లక్నో, ముంబై, నాగ్‌పూర్ వరుసగా అధిక ఉపాధి అవకాశాలు కలిగిన నగరాలు కావడం గమనార్హం. ఢిల్లీ 7వ స్థానంలో ఉండగా, పుణె, తిరుచిరాపల్లి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఉద్యోగ నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు ఎక్కువగా ఉన్నది ఢిల్లీలోనే. ఇక్కడ ప్రతీ ముగ్గురిలో ఇద్దరికి ఆ అర్హతలు ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. 18–25 సంవత్సరాల వయసులో ఉన్న ఉద్యోగ అభ్యర్థుల శాతం 46 శాతం కాగా, 26–29 వయసులోని వారు 26 శాతంగా ఉన్నారు. మొత్తం మీద ఉపాధి అవకాశాలు అంతకు ముందు సంవత్సరంలో ఉన్న 40.44 శాతం నుంచి 45.60 శాతానికి పెరిగినట్టు ఈ నివేదిక పేర్కొంది. -
లంచాలతో ఉద్యోగ నియామకాలు
టీ.నగర్: రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలు జరుగుతుండడంతో హైకోర్టు ఏసీబీ, సీబీఐ అధికారుల వివరణ కోరింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు టీఎన్పీఎస్సీ ద్వారా అర్హులైన వారిని ఎంపిక చేసి ఉద్యోగాలలో నియమిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ ఉద్యోగాలకు టీచర్స్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుపుతున్నారు. ఈ ఉద్యోగాలకు పలువురు లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లో చేరినట్లు పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. దీని ప్రాతిపదికన మదురై హైకోర్టు సుమోటోగా ప్రజాహిత కేసును స్వీకరించింది. ఈ పిటిషన్ న్యాయమూర్తి కృపాకరన్, తారణి సమక్షంలో మంగళవారం విచారణకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి టీఎన్పీఎస్సీ, సీబీఐ డైరెక్టర్, ఏసీబీలను ప్రతివాదులుగా చేర్చేందుకు న్యాయమూర్తులు ఉత్తర్వులిచ్చారు. ఈ విచారణ సమయంలో న్యాయమూర్తులు ఉద్యోగాలను సేవాభావంతో చేయాల్సి ఉందని, ఈ పనులను లంచాలు అందజేసి ఉద్యోగాల్లో చేరినవారు ఎలా నిజాయితీగా చేయగలరని ప్రశ్నించారు. ఎంతమంది ఉద్యోగాల్లో లంచాలు అందజేసి చేరారో, ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలపాలంటూ ఏసీబీ, సీబిఐ, టీఎన్పీఎస్సీ అధికారులు ఫిబ్రవరి 16న కోర్టులో వివరాలు దాఖలు చేయాలంటూ న్యాయమూర్తులు కేసు విచారణను వాయిదా వేశారు. -
ఫేస్బుక్ ‘ప్రకటన’ల వివక్ష!
న్యూయార్క్: ఉద్యోగ నియామకాల కోసం ప్రముఖ కంపెనీలు ఇచ్చే ప్రకటనలను నిర్దిష్ట వయసు వారికే కనిపించేలా ఫేస్బుక్ చూస్తోంది. ఎంపిక చేసిన వయసు పైబడిన ఉద్యోగులకు ఆయా ప్రకటనలు కనిపించకుండా చేస్తోంది. అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రో పబ్లికా, ది న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. వెరిజాన్, అమెజాన్, గోల్డ్‌మన్ శాక్స్, టార్గెట్ వంటి సంస్థలు ఇచ్చే ఉద్యోగ ప్రకటనలను ఓ నిర్ణీత వయసున్న వారికే ఫేస్బుక్ అందిస్తోంది. ‘ప్రకటనదారుల సందేశాన్ని, వారు కోరుకున్న నిర్దిష్ట వ్యక్తులకు చేరవేయడమే.. ఫేస్బుక్ వ్యాపార నమూనాకు మూలస్తంభం. అయితే ఈ విధానం వల్ల వయసు పైబడిన ఉద్యోగులకు అన్యాయం జరుగుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది’ అని ప్రో పబ్లికా, ది న్యూయార్క్ టైమ్స్ సంస్థలు తమ నివేదికలో పేర్కొన్నాయి. -
నియామకాల్లో భారత కంపెనీల దూకుడు!
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఉద్యోగ నియామకాల విషయంలో ఎంతో ఆశావాదంతో ఉన్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయంగా మన దేశం మూడో స్థానంలో ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 22 శాతం కంపెనీలు రానున్న మూడు నెలల్లో మరింత మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు వెల్లడైంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా తైవాన్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 4,500 కంపెనీల అభిప్రాయాలను ఈ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. జపాన్ 24 శాతంతో రెండో స్థానంలో ఉండగా, 22 శాతం ఆశావహంతో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మ్యాన్‌పవర్ గ్రూపు 43 దేశాల్లో 59,000 కంపెనీలను ఇంటర్వ్యూ చేసింది. -
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2% కోటా కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విద్యావకాశాల్లో స్పోర్ట్స్ కోటా అమలవుతున్నా.. ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా రిజర్వేషన్లు అమలవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లోనే ఉద్యోగ నియామకాల్లో 2 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 74 విడుదల చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అమల్లోకి రాలేదు. కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల నిబంధనలను సవరించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణలో ఇప్పటికీ స్పోర్ట్స్ కోటా అమలవలేదు. సవరణల కోసం ప్రతిపాదనలు.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో స్పోర్ట్స్ కోటా అమలులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి టీఎస్పీఎస్సీకి లేఖ రాశారు. స్పందించిన కమిషన్.. ఉద్యోగ నియామక నిబంధనలకు సవరణలు చేస్తేనే స్పోర్ట్స్ కోటా అమలు సాధ్యమని ప్రత్యుత్తరం రాసింది. స్పోర్ట్స్ కోటా కల్పించేందుకు సర్వీసు రూల్స్, చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పంపించింది. క్రీడా, న్యాయ శాఖల పరిశీలన తర్వాత సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ విభాగానికి ఫైలు చేరింది. ఈ నెలలోనే ఉత్తర్వులు..! ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో తరహాలోనే ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను సవరించి ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం నిర్ణయం మేరకు వీలైనంత త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో ఏడాది వ్యవధిలో దాదాపు 84 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు మేలు జరిగేలా స్పోర్ట్స్ కోటా ఉత్తర్వులను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. -
‘పదేళ్లు’.. మరో రెండేళ్లు
గరిష్ట వయోపరిమితి సడలింపు మరోసారి పొడిగింపు సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ నియామకాలకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపును రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిరుద్యోగులకు ప్రయోజనంగా ఉండేందుకు మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఉద్యోగ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు నిర్దేశించిన గరిష్ట వయో పరిమితి 34 ఏళ్లు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక 2015 జూలైలో ప్రభుత్వం ఈ వయో పరిమితిని సడలించింది. అదనంగా పదేళ్లపాటు గరిష్ట వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచింది. ఈ వెసులుబాటు ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రకటించింది. 2016 జూలైలో మరో ఏడాది పొడిగించింది. గతనెలలో ఈ గడువు ముగిసింది. దీంతో తాజాగా మరో రెండేళ్లపాటు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2019 జూలై 26 వరకు 44 ఏళ్ల గరిష్ట వయోపరిమితి పొడిగింపు ఉత్తర్వులు అమలు కానున్నాయి. -
టాటా జేఎల్ఆర్లో 5,000 ఉద్యోగాలు!
లండన్: టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఉద్యోగ నియామకాలు చేపట్టాలని భావిస్తోంది. దాదాపు 5,000 మందిని నియమించుకోవాలని ప్రణాళికలు రూపొందించుకుంటోంది. ఇందులో 1,000కి పైగా ఉద్యోగాలు ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కేటాయించినట్లు జేఎల్ఆర్ పేర్కొంది. ఇక మిగిలిన ఉద్యోగాలు తయారీ విభాగంలో ఉంటాయని తెలిపింది. ‘వాహన పరిశ్రమ కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతోంది. దీనికి నూతన సాఫ్ట్వేర్ ఆవిష్కరణలు ప్రధాన కారణం. అందుకే మేం ఆటానమస్, ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ప్రధాన లక్ష్యంగా కొత్త టాలెంట్‌ను నియమించుకోవాలని చూస్తున్నాం’ అని జేఎల్ఆర్ హెడ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) అలెక్స్ హెస్లోప్ తెలిపారు. సాఫ్ట్వేర్ సిస్టమ్, సైబర్ వ్యవస్థలు, యాప్ డెవలప్మెంట్, గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ వంటి పలు విభాగాల్లోకి కొత్త వారిని తీసుకుంటామని పేర్కొన్నారు. అభ్యర్థులు అసెంబ్లింగ్ జాగ్వార్ ఐ–పేస్ కాన్సెప్ట్, కోడ్–బ్రేకింగ్ వంటి పలు సవాళ్లను పరిష్కరించాల్సి ఉంటుందని తెలిపారు. జేఎల్ఆర్ కెరిర్స్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్‌ను స్వీకరిస్తామని పేర్కొన్నారు. -
మహిళల భద్రతే కీలకాంశం
ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పన.. మహిళల భద్రత, మహిళా సాధికారత.. ఆర్థికాభివృద్ధి, మెరుగైన ఆర్థిక విధానాలు.. మత సామరస్యం, నేరాల కట్టడి.. ఇవీ నవ యువ ఓటర్లు కొత్త ప్రభుత్వం నుంచి కోరుకుంటున్న ముఖ్యమైన హామీలు. ముఖ్యంగా మహిళల భద్రతను ఢిల్లీ యువతులు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తమ ఆశలు, ఆశయాలను నెరవేర్చే అభ్యర్థులను, పార్టీలను గుర్తించి, జాగ్రత్తగా ఆలోచించి ఓటేశామంటున్నారు ఓటుహక్కును మొదటిసారి వినియోగించుకున్న యువ ఓటర్లు. ‘నేరాలు పెరిగిపోతున్నాయని, అవినీతి అని, తాగునీరు లేదని.. ఇలా రకరకాల సమస్యలపై ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ ఓటేసేందుకు ముందుకు రారు. మార్పు కోరుకునే వారు కచ్చితంగా తమ ఓటును అందుకు ఆయుధంగా ఉపయోగించుకోవాలి’ అని ఢిల్లీ వర్సిటీకి చెందిన కార్తీక్ చెప్పారు. ‘మహిళల భద్రత చాలా ముఖ్యమైన అంశం. కానీ ఏ పార్టీ ఢిల్లీని సేఫ్ సిటీగా చేస్తుందనుకోను’ అని 23 ఏళ్ల సురభి రంజన్ అన్నారు. -
ఉపాధి పేరుతో ఘరానా మోసం
వనపర్తి, న్యూస్‌లైన్: గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఓ బోగస్ సంస్థ ఘరాన మోసం చేసేందుకు పథకం రచిం చింది. కంపోస్టు ఎరువుల తయారీలో ప్రత్యేక శిక్షణనిచ్చి సొంత గ్రామంలోనే మూడేళ్ల పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నెలకు రూ. 5వేల వేతనం చెల్లిస్తామని ఓ సంస్థ రాష్ట్రంలోని పలువురి సర్పంచ్‌లకు నెల రోజుల క్రితం ఉత్తరాలు పంపింది. కొత్తగా గెలిచిన సర్పంచ్‌లు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో గ్రామానికి చెందిన ముగ్గురు చొప్పున రూ.500ల డీడీలు తీసి, ఆ సంస్థ సూచించిన అడ్రస్‌కు పోస్టులో పంపించారు. అయితే సదరు సంస్థ బోగస్ అని తేలడంతో సర్పంచ్‌లు తెల్లమోహం వేశారు. సంస్థ ఉత్తరం అందుకున్న వనపర్తి మండలం మెంటేపల్లి సర్పంచ్ పురుషోత్తమరెడ్డి పలువురు సర్పంచ్‌లతో వెళ్లి ఆ సంస్థ ఇచ్చిన అడ్రాస్‌లో విచారణ చేయగా, అది బోగస్ అని తేలినట్లు వారు వాపోయారు. శుక్రవారం సర్పంచ్ పురుషోత్తమరెడ్డి ఇందుకు సంబంధించిన పలు వివరాలు విలేకరులకు వెల్లడించారు. ‘అ గ్రి ఫామింగ్ ఎండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ పేర నెల రోజుల క్రితం అన్ని గ్రామాల సర్పంచ్‌లకు ఓ ఉత్తరం వచ్చింది. అందులో ప్రతి గ్రామం నుంచి ఎస్సెస్సీ పాస్ లేదా ఫెయిల్ అయిన ముగ్గురు నిరుద్యోగులను సర్పంచ్‌లు ఎంపిక చేసి కంపోస్టు ఎరువుల తయారీలో శిక్షణనిచ్చేందుకు పంపాలని ఆ సంస్థ సూచించింది. చాలా మంది సర్పంచ్‌లు తమ గ్రామానికి మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో యువత చేత డీడీలు తీయించి పంపించారు. అయితే తనకు అనుమానం వచ్చి ఆ సంస్థ ఇచ్చిన అడ్రస్‌ను హైదరాబాద్‌లోని బోడుప్పల్లో వెతికి పట్టుకున్నాం. అయితే ఆ సంస్థను గత నెల 13వ తేదీనే రిజిస్ట్రేషన్ చేయించి, ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని బోగస్ సంస్థను సృష్టిచారని తమ విచారణలో తెలుసుకున్నాం’ అని పేర్కొన్నారు. అసలు ఆ సంస్థకు కంపోస్టు ఎరువుల తయారీపై శిక్షణనిచ్చే సామర్థ్యం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రం నుంచి వేలాది మంది ఇప్పటికే డీడీలు పంపించారని, మరో వారం పది రోజుల్లో సంస్థ బోర్డు తిప్పే పరిస్థితి ఉన్నట్లు తేలిందన్నారు. సర్పంచ్‌లను పావులుగా చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్న ఈ బోగస్ సంస్థ తీరుపై సర్పంచులందరీతో కలిసి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు.