సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 2% కోటా కల్పించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. విద్యావకాశాల్లో స్పోర్ట్స్ కోటా అమలవుతున్నా.. ఉద్యోగ నియామకాల్లో క్రీడాకారులకు ప్రత్యేక కోటా రిజర్వేషన్లు అమలవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లోనే ఉద్యోగ నియామకాల్లో 2 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 74 విడుదల చేసింది. కానీ సాంకేతిక కారణాలతో అమల్లోకి రాలేదు. కొద్ది రోజుల కిందట ఏపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాల నిబంధనలను సవరించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటాకు రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తెలంగాణలో ఇప్పటికీ స్పోర్ట్స్ కోటా అమలవలేదు.
సవరణల కోసం ప్రతిపాదనలు..
క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కేసీఆర్ పలుమార్లు హామీ ఇచ్చారు. దీంతో తెలంగాణలో స్పోర్ట్స్ కోటా అమలులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ కసరత్తు ప్రారంభించింది. ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి టీఎస్‌పీఎస్సీకి లేఖ రాశారు. స్పందించిన కమిషన్.. ఉద్యోగ నియామక నిబంధనలకు సవరణలు చేస్తేనే స్పోర్ట్స్ కోటా అమలు సాధ్యమని ప్రత్యుత్తరం రాసింది. స్పోర్ట్స్ కోటా కల్పించేందుకు సర్వీసు రూల్స్, చట్ట సవరణ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలంటూ సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పంపించింది. క్రీడా, న్యాయ శాఖల పరిశీలన తర్వాత సాధారణ పరిపాలన శాఖలోని సర్వీసెస్ విభాగానికి ఫైలు చేరింది.
ఈ నెలలోనే ఉత్తర్వులు..!
ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో తరహాలోనే ప్రస్తుత సర్వీసు రూల్స్‌ను సవరించి ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. సీఎం నిర్ణయం మేరకు వీలైనంత త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మరో ఏడాది వ్యవధిలో దాదాపు 84 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారీ రిక్రూట్‌మెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు మేలు జరిగేలా స్పోర్ట్స్ కోటా ఉత్తర్వులను ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా
Published Fri, Oct 6 2017 1:11 AM | Last Updated on Fri, Oct 6 2017 1:11 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment